https://oktelugu.com/

Dhruv Jurel : నీ బలం అదే.. ధృవ్ జురెల్ కు దిగ్గజాల కితాబు

రాంచి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత్ 307 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టుకు 46 పరుగుల ఆధిక్యం లభించింది.

Written By:
  • NARESH
  • , Updated On : February 25, 2024 / 09:19 PM IST
    Follow us on

    Dhruv Jurel : ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో భారత్ ఆడుతున్న నాలుగో టెస్టు అనూహ్య మలుపులు తిరుగుతోంది.. రెండవ రోజు ఇంగ్లాండ్ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తే.. మూడవరోజు ఇండియా వికెట్ కీపర్ ధృవ్ జురెల్ తనదైన ఆటను ప్రదర్శించాడు. ఎక్కువగా డిఫెన్స్ ఆడి అసలు సిసలైన టెస్ట్ క్రికెట్ ఎలా ఉంటుందో ఇంగ్లాండ్ బౌలర్లకు రుచి చూపించాడు. కులదీప్ యాదవ్, ఆకాష్ వంటి వారితో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని 43 పరుగులకు తగ్గించాడు. ధృవ్ 90 పరుగుల వద్ద అవుట్ అయినప్పటికీ క్రికెట్ దిగ్గజాల మనసు గెలుచుకున్నాడు. రోహిత్, గిల్, జడేజా వంటి సీనియర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నప్పటికీ.. ఇంగ్లాండ్ బౌలర్లు దూకుడుగా బంతులు సంధిస్తున్నప్పటికీ.. ధృవ్ జురెల్ నిదానంగా ఆడాడు. జట్టుకు ఆపద్బాంధవుడిగా నిలిచి నాలుగో టెస్ట్ భారత్ చేతిలో ఉండేలా చేశాడు. ధృవ్ జురెల్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో భారత జట్టుకు చెందిన ఒకప్పటి దిగ్గజ ఆటగాళ్లు వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

    ధృవ్ జురెల్ ఆడిన ఇన్నింగ్స్ పై ఒకప్పటి భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించాడు..” చాలా బాగా ఆడావ్. జురెల్ నీకు నా బెస్ట్ విషెస్. మీడియా హైప్ ఇవ్వలేదు. నీ ఆటలో ఎటువంటి డ్రామా లేదు. నీ దగ్గర అద్భుతమైన నైపుణ్యం ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు అవసరమైన విధంగా నువ్వు చూపించిన తెగువ చాలా గొప్పది.” అని వీరేంద్ర సెహ్వాగ్ రాసుకొచ్చాడు.

    భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ” ఇంత బాగా ఆడుతున్న ధృవ్ జురెల్ ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. అంత ప్రశాంతంగా ఆడుతుంటే నాకు ధోని గుర్తుకు వస్తున్నాడు.. అతడు కచ్చితంగా భారత జట్టుకు భవిష్యత్తు ఆశా కిరణం అవుతాడని” అన్నాడు.

    “వికెట్ల వెనకాల అద్భుతమైన ప్రదర్శన ఇచ్చావు. వికెట్ల ముందు అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శిస్తున్నావు. కుల దీప్ తో అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పావు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే.” అని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.

    కాగా, రాంచి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత్ 307 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టుకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 145 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత స్పిన్నర్లు అశ్విన్ 5, కుల దీప్ 4 వికెట్లు తీశారు. జడేజా ఒక వికెట్ పడగొట్టాడు.