Pak Vs Eng: బంగ్లా జట్టుతో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ కోచ్ జాసన్ గిలెస్పీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టు ఆటగాళ్లు ఏకతాటి పైకి వచ్చారని.. కచ్చితంగా కొత్త పాకిస్తాన్ జట్టును చూస్తారని వ్యాఖ్యానించాడు. కానీ అదంతా ఉత్తిదేనని.. పాకిస్తాన్ జట్టులో కసి తేలిపోయిందని.. స్వదేశంలోనూ వరుస ఓటములు ఎదుర్కొంటున్నప్పటికీ.. ఆ జట్టులో మార్పు రాలేదని తాజాగా ఇంగ్లాండ్ జట్టుతో ఎదురైన ఓటమి ద్వారా తెలిసింది.. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో పాకిస్తాన్ రెండు టెస్టుల సిరీస్ స్వదేశంలో ఆడింది..2-0 తేడాతో సిరీస్ కోల్పోయింది. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా 10 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. ఇక రెండో టెస్టులోనూ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. చేతుల దాకా వచ్చిన మ్యాచ్ లలో ఓటములు ఎదురు కావడంతో పాకిస్తాన్ పరువు పోయింది. ఈ క్రమంలో జట్టులో మార్పులు జరిగాయని.. ఇకపై ఓటములు ఎదురుకావని మేనేజ్మెంట్ ప్రకటించింది. కానీ ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవడంతో.. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
చేతులెత్తేశారు
మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ వచ్చింది. తొలి టెస్ట్ ముల్తాన్ వేదికగా ఆడుతోంది. ఈ టెస్టులో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి.. 556 పరుగులకు ఆల్ అవుట్ అయింది. షఫీక్, సల్మాన్, మసూద్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నారు. జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. రూట్ డబల్, బ్రూక్ ట్రిబుల్ సెంచరీలు చేయడంతో ఇంగ్లాండు ఏడు వికెట్ల నష్టానికి 823 రన్స్ చేసింది. ఫలితంగా రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ బౌలర్లకు దాసోహం అయింది. తొలి ఇన్నింగ్స్ లో సత్తా చాటిన పాకిస్తాన్ బ్యాటర్లు.. రెండవ ఇన్నింగ్స్ లో పూర్తిగా తేలిపోయారు.అఘా సల్మాన్ (63), జమాల్(55) మిగతా వారంతా తేలిపోయారు. సల్మాన్, జమాల్ ఏడో వికెట్ కు ఏకంగా 109 పరుగులు జోడించారు. వీరిద్దరు గనుక ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయకుండా ఉండి ఉంటే పాకిస్తాన్ ఓటమి మరింత దారుణంగా ఉండేది. ఐదో రోజు ఆటను 152/6 తో ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు.. మరో 39 పరుగులు జోడించి సల్మాన్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో 220 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ మూడు తో కలిపి మొత్తంగా అతడు 7 వికెట్లను దక్కించుకున్నాడు.