Jamily Election : దేశంలో జమిలి ఎన్నికలకు కసరత్తు ప్రారంభం అయ్యింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కేంద్రంలోని మోదీ సర్కార్ గత కొన్నేళ్లుగా జమిలీ ఎన్నికలకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిద్ నేతృత్వంలోని ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఆ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ముఖ్య ఉద్దేశం. దీనిపై నివేదిక ఇచ్చింది ఆ కమిటీ. అయితే బిజెపియేతర పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఏపీలో మాత్రం అధికారపక్షంతో పాటు విపక్షం ఆహ్వానిస్తున్నాయి. అదే జరిగితేఏపీ అసెంబ్లీ సైతం ముందస్తు ఎన్నిక అనివార్యంగా మారే అవకాశం ఉంది. వాస్తవానికి 2029 మార్చి తర్వాత ఏపీఅసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. కానీ కేంద్రం జెమిలి ఎన్నికలకు ప్లాన్ చేస్తుండడంతో 2027 ద్వితీయార్థంలో ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చని అంచనాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అదే జరిగితే మూడున్నర సంవత్సరాలకే కూటమి ప్రభుత్వం మరోసారి ప్రజా తీర్పుకోరే అవకాశం ఉంది. అయితే ఓటమితో నిరాశ నిస్పృహల మీద ఉన్న జగన్ నెత్తిన ఇది పాలు పోయడమే నన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అప్పటికైనా జగన్ పుంజుకుంటారా? జగన్ కు కూటమి ఆ అవకాశం ఇస్తుందా?అన్నది ప్రశ్న.
* చంద్రబాబు కీలక ప్రకటన
ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చారు. జమిలి ఎన్నికలపై ప్రకటన చేశారు.కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అదే సమయంలో జగన్ సైతం జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. జమిలిలో భాగంగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తే తాను మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమాతో ఉన్నారు. అందుకే పెద్ద ఎత్తున పార్టీలో ప్రక్షాళన చేస్తున్నారు.అయితే ఈ విషయంలో చంద్రబాబు ముందస్తు ఆలోచన చేయకుండా ఉంటారా? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.
* ఆ ప్లాన్ తో సహకారం
ప్రస్తుతం ఏపీకి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల నిధులు ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు సైతం కేటాయింపులు చేసింది. ప్రత్యేక రైల్వే జోన్ ను సైతం ఏర్పాటు చేయనుంది. విపత్తుల సమయంలో ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ పరిహారం అందించింది. మరోవైపు కేంద్రానికి సంబంధించి కీలక ప్రాజెక్టులను సైతం కేటాయిస్తోంది ఏపీకి. ఇవన్నీ చంద్రబాబు జమిలి ఎన్నికల్లో భాగంగా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నవి అని టాక్ నడుస్తోంది. అయితే ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఇబ్బందుల్లో ఉన్నారు జగన్. వీలైనంతవరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. ముందస్తు ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారు. మరి ఎవరి ప్రయత్నం సక్సెస్ అవుతుందో చూడాలి.