Jos Buttler: 2022 t20 వరల్డ్ కప్ లో భాగంగా ఆడిలైడ్ లో టీమ్ ఇండియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఏకపక్ష విజయాన్ని సాధించింది. టీమిండియా విధించిన 169 పరుగుల విజయ లక్ష్యాన్ని 17 ఓవర్ లోనే వికెట్ కోల్పోకుండా ఇంగ్లాండ్ జట్టు చేదించింది. బట్లర్ 86 , హేల్స్ 80 పరుగులు చేసి.. ఇంగ్లాండ్ జట్టుకు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు. నాడు ఇండియా పై విజయం సాధించడంతో బట్లర్ మైదానంలో ఊగిపోయాడు. టీమిండియా ఆటగాళ్లను గేలి చేశాడు. అయితే ఇంగ్లాండ్ ఒక్క ఓటమిని రుచి చూపిస్తే.. టీమిండియా అంతకుమించి అనేలాగా డబుల్ ఓటములను ఇంగ్లాండ్ జట్టుకు పరిచయం చేసింది.. వన్డే వరల్డ్ కప్ లో 100 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. గురువారం గయానా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో 68 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
టీమిండియా ఇచ్చిన ఓటమి దెబ్బకు ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ కుంగిపోయాడు. మైదానంలో ముఖం చిన్న బుచ్చుకున్నాడు. మీడియా ముందుకు వచ్చి సరిగా మాట్లాడలేక.. విచారంగా వెళ్లిపోయాడు. టీమిండియాతో ఎదురైన ఓటమి నేపథ్యంలో బట్లర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొద్దిరోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. “ఓటమి చాలా బాధించింది. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. ఇలాంటి పరిణామం ఏ ఆటగాడినైనా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఓటమి తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని” బట్లర్ మీడియా సమావేశంలో వెల్లడించాడు.
“ఈ ఓటమి వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. భారత జట్టు మాపై అన్ని విభాగాలలో ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి మేము బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది. కానీ మేము తీసుకున్న నిర్ణయం టీమిండియా కు వరం లాగా మారింది. వాళ్లు మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్కోరు చేశారు. ఇలాంటి మైదానంపై చేజింగ్ అంత సులువు కాదు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే కొద్ది రోజులపాటు ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ ఓటమి నాకు అనేక పాఠాలు నేర్పింది. అయితే దాని గురించి లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు సమయం కాదు. తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఉద్వేగంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు విరామం కావాలని” బట్లర్ వ్యాఖ్యానించాడు.
ఓటమి ప్రభావం వల్ల జట్టును ఇబ్బంది పెట్టదలుచుకోలేదని చెప్పిన బట్లర్, తమ జట్టులో ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నారని చెప్పుకొచ్చాడు.. సమయానికి అత్యున్నత స్థాయిలో ప్రదర్శన చేయకపోవడం వల్లే ఓడిపోయామని వివరించాడు. భారత జట్టు డు ఆర్ డై అన్నట్టుగా ఆడిందని.. విజయానికి ఆ జట్టు పూర్తిస్థాయిలో అర్హత కలిగి ఉందని బట్లర్ పేర్కొన్నాడు.