West Indies Vs England: సాల్ట్ దెబ్బకు ఆతిథ్య వెస్టిండీస్ బెంబేలు.. ఈ విధ్వంస వీడియో చూడాల్సిందే

ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి, 180 రన్స్ చేసింది. జాన్సన్ చార్లెస్ 38, పావెల్ 36, రూథర్ ఫర్డ్ 28* పరుగులు చేసి.. వెస్టిండీస్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 20, 2024 1:05 pm

West Indies Vs England

Follow us on

West Indies Vs England: టి20 వరల్డ్ కప్ లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు..లీగ్ దశలో ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఒకానొక సందర్భంలో ఈ జట్టు ఇంటికి వెళ్ళిపోతుందని వార్తలు వినిపించాయి. అయితే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లలో ఇంగ్లాండ్ సత్తా చాటింది. తన స్థాయి ఆట తీరు ప్రదర్శించి.. విజయాలను అందుకుంది. ఈ క్రమంలో సూపర్ -8 లోకి ప్రవేశించింది.. తన తొలి మ్యాచ్ ను గురువారం ఆతిధ్య వెస్టిండీస్ జట్టుతో ఆడింది.

ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి, 180 రన్స్ చేసింది. జాన్సన్ చార్లెస్ 38, పావెల్ 36, రూథర్ ఫర్డ్ 28* పరుగులు చేసి.. వెస్టిండీస్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆదిల్ రషీద్, మొయిన్ అలీ, ఆర్చర్, లివింగ్ స్టోన్.. తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.. అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు 17.3 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 47 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడు స్ట్రైకింగ్ కు వస్తే చాలు వెస్టిండీస్ బౌలర్లు భయపడిపోయారు. ఒక్క బౌలర్ అని కాదు.. దాదాపు అందరి బౌలర్లను సాల్ట్ చితక్కొట్టాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ విజయానికి చివరి 5 ఓవర్లలో 40 పరుగులు కావలసి వచ్చినప్పుడు.. సాల్ట్ మైదానంలో బ్యాట్ తో శివతాండవం చేశాడు. తుఫాన్, సునామి, విధ్వంసం, పరాక్రమం.. ఇలా ఎన్ని అన్వయాలు ఉంటే.. వాటికి మించి అనేలాగా బ్యాటింగ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ మరో 15 బంతులు మిగిలి ఉండగానే దర్జాగా విజయాన్ని అందుకుంది.

రొమారియో షెఫర్డ్ వేసిన 16 ఓవర్ లో సాల్ట్ విజృంభించి ఆడాడు.. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టి వారెవ్వా అనిపించాడు. తొలి బంతిని ఎక్స్ ట్రా కవర్ మీదుగా ఫోర్, రెండవ బంతిని బౌలర్ తల మీదుగా సిక్స్, మూడో బంతిని అప్పర్ కట్ ద్వారా ఫోర్, నాలుగో బంతిని లాంగ్ ఆఫ్ లో సిక్సర్, ఐదవ బంతిని డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ ద్వారా సిక్సర్, ఆరో బంతి సులువుగా బౌండరీ తరలించి.. 30 పరుగులు పిండుకున్నాడు. ఒకానొక దశలో సాల్ట్ ఆడుతున్న తీరు చూసి…యువరాజ్ సింగ్ 2007 స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో కొట్టిన ఆరు సిక్సర్ల రికార్డును సమం చేస్తాడని భావించారు. అయితే ఇందులో మూడు బౌండరీలు ఉండడంతో.. యువరాజ్ రికార్డును సాల్ట్ చేరుకోలేకపోయాడు. సాల్ట్ ఆడిన ఆ భీకర ఇన్నింగ్స్ వల్ల ఇంగ్లాండ్ సులువుగా విజయం సాధించింది.