https://oktelugu.com/

ENG vs AUS : లార్డ్స్ లో ఆస్ట్రేలియాపై లివింగ్ స్టోన్ వీరకొట్టుడుకు రికార్డులన్నీ బద్దలైపోయాయి

ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఇంగ్లాండ్ ఆటగాడు లివింగ్ స్టోన్ లార్డ్స్ మైదానంలో పెను విధ్వంసాన్ని సృష్టించాడు. సరికొత్త చరిత్రను అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 29, 2024 / 12:52 PM IST

    ENG vs AUS

    Follow us on

    ENG vs AUS : ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశంలో పర్యటిస్తోంది. ఇప్పటికే మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ ను 1-1 తో సమం చేసుకుంది.. ఇక 5 వన్డేల సిరీస్ ను 2-2 తో నిలిచాయి. చివరి వన్డే ఆదివారం జరగనుంది. అయితే నాలుగో వన్డే లార్డ్స్ మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాడు లివింగ్ స్టోన్ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. కేవలం 27 బంతుల్లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడు ఆడిన ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ జట్టు గెలుపునకు ఉపకరించింది. అతడు గనక ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయకపోయి ఉంటే ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలయ్యేది. ఈ పరుగులు చేసి లివింగ్ స్టోన్ లార్డ్స్ మైదానంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫలితంగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పై 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వర్షం పదేపదే అంతరాయాన్ని కలిగించడంతో అంపైర్లు మ్యాచ్ ను 39 ఓవర్లకు కుదించారు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 312 పరుగుల స్కోర్ చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 24.4 ఓవర్లలో 126 పరుగులకు కుప్ప కూలింది. ఇంగ్లాండ్ ఆటగాడు లివింగ్ స్టోన్ కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొని 62 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 7 సిక్సర్లు, మూడు బౌండరీలు ఉన్నాయి. తద్వారా అతడి స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువ నమోదయింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంతవరకూ ఈ స్థాయిలో ఏ ఆటగాడు బ్యాటింగ్ చేయలేదు. ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్ మిచల్ మార్ష్ లాట్స్ మైదానంలో 26 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. అయితే అతడి రికార్డును లివింగ్ స్టోన్ బద్దలు కొట్టాడు. కేవలం 25 బంతుల్లోనే అతడు అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 2018లో భారత జట్టుపై జరిగిన ఓ మ్యాచ్లో డేవిడ్ విల్లి 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసే రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు ఆడం గిల్ క్రిస్ట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.

    ఇక నాలుగో వన్డే మ్యాచ్ ఒకసారి పరిశీలిస్తే.. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 312 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకేట్ 62 బంతుల్లో 63 పరుగులు చేశాడు. హరి బ్రూక్ 58 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా 2 వికెట్లు సాధించాడు. జోష్ హజిల్ ఉడ్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 126 పరుగులకు కుప్ప కూలింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్(34), మార్ష్(28) మాత్రమే రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్ మాథ్యూ పాట్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.. బ్రైడన్ కార్సే మూడు వికెట్లు సాధించాడు. ఇక ఈ టోర్నీలో కీలకమైన ఐదవ వన్డే ఆదివారం బ్రిస్టల్ లో జరుగుతుంది.. ఐదో వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్ దక్కించుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా నాలుగో వన్డే ఓటమికి సరైన బదులు తీర్చుకోవాలనుకుంటున్నది. రెండు జట్లు 2-2 సమంగా ఉండడంతో ఐదవ వన్డే హోరాహోరీగా జరిగే అవకాశం కనిపిస్తోంది.