Bangladesh Vs Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ విజయం.. కన్నీళ్లు పెట్టుకున్న ఆటగాళ్లు.. వీడియో వైరల్

114 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ లిటన్ దాస్(54; 49 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) 54 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 25, 2024 12:16 pm

Bangladesh Vs Afghanistan

Follow us on

Bangladesh Vs Afghanistan: క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం. సత్తా చూపే ఆటగాళ్ళు ఉన్నారు. మరి మైదానాలు? అంతంత మాత్రం. సౌకర్యాలు? సరైన రోడ్లు లేని ఆ దేశంలో సౌకర్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? అయినా సరే ఆ ఆటగాళ్లు క్రికెట్ మీద మక్కువ చంపుకోలేదు. ఉన్నదాంట్లోనే గొప్పగా ఆడటం మొదలుపెట్టారు. అద్భుతమైన సాధన చేయడం ప్రారంభించారు. కష్టేఫలి అన్నట్టుగా.. వారు పడ్డ కష్టానికి ప్రతిఫలం ప్రస్తుత టి20 క్రికెట్లో కనిపిస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు టి20 వరల్డ్ కప్ లో ఆడుతున్నప్పుడు చాలామందిలో ఒక అనుమానం ఉండేది. కనీసం ఈ జట్టు గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తుందా? కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఆఫ్ఘనిస్తాన్ అద్భుతమైన విజయాలు సాధించింది. లీగ్ దశలో న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది.. అయితే ఆ గెలుపు గాలివాటం కాదని.. సూపర్ -8 లో ఆస్ట్రేలియాను ఓడించి నిరూపించింది. భారత్ తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ పై వరుస విజయాలు సాధించి .. సెమిస్ చేరుకుంది.

Bangladesh Vs Afghanistan(1)

సెయింట్ విన్సెంట్ వేదికగా జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య 8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులు చేసింది. గుర్బాజ్ 43 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే వర్షం కురవడం.. మైదానం చిత్తడిగా మారడంతో డక్ వర్త్ లూయిస్ విధానాన్ని అంపైర్లు తెరపైకి తెచ్చారు. ఫలితంగా ఓవర్లను 19కి తగ్గించి.. బంగ్లాదేశ్ విజయ లక్ష్యాన్ని 114 పరుగులకు పరిమితం చేశారు.

114 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ లిటన్ దాస్(54; 49 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) 54 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.. మిగతా వారంతా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. మైదానం పై తేమను ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు సమర్థవంతంగా వినియోగించుకున్నారు. అద్భుతమైన బంతులు వేస్తూ బంగ్లా ఆటగాళ్లకు చుక్కలు చూపించారు.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్ చెరో నాలుగు వికెట్లు దక్కించుకున్నారు.గల్బాదిన్ నాయబ్, ఫారుఖీ చెరో వికెట్ పడగొట్టారు.

లో స్కోర్ నమోదైన ఈ మ్యాచ్లో విజయ సమీకరణం ఓవర్ ఓవర్ కు మారుకుంటూ వచ్చింది. 16 ఓవర్ వరకు బంగ్లా వైపే మొగ్గు ఉంది. కానీ ఎప్పుడైతే 17 వ ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ రషీద్ ఖాన్ నవీన్ ఉల్ హక్ కు ఇచ్చాడో, అప్పుడే మ్యాచ్ స్వరూపం మారిపోయింది. 17 ఓవర్ నాలుగో బంతికి తస్కిన్ అహ్మద్ ను క్లీన్ బౌల్డ్ చేసిన నవీన్.. ఆ మరుసటి బంతికి ముస్తాఫిజుర్ రెహమాన్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఫలితంగా 105 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది.

సరిగ్గా రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియా పై సంచలన విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్.. సెమీస్ వెళ్లాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో.. విజయం సాధించి.. దర్జాగా సెమీస్ వెళ్ళిపోయింది.. ఈ విజయం ద్వారా తాము పసికూనలం కాదని.. కసి ద్వారా ఇక్కడికి వచ్చిన వాళ్లమని ఆఫ్ఘాన్ ఆటగాళ్లు నిరూపించారు. 17 ఓవర్లో నవీన్ ఉల్ హక్ వరసగా రెండు వికెట్లు తీసి.. ఆఫ్ఘనిస్తాన్ కు విజయాన్ని అందించడంతో.. ఆ జట్టు ఆటగాళ్లు ఒకసారిగా భావోద్వేగానికి గురయ్యారు. గుర్బాజ్, రషీద్, నాయిబ్ వంటి వారు కన్నీరు పెట్టుకున్నారు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.