Bangladesh Vs Afghanistan: బంగ్లాదేశ్ వర్సెస్ అప్ఘన్ : మ్యాచ్ మలుపు తిరిగింది ఇక్కడే!

బంగ్లా విజయ లక్ష్యం 114 పరుగులు గానే ఉండడంతో.. చాలామంది ఆఫ్ఘనిస్తాన్ గెలవదు అని ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ, పడి లేచిన కెరటం లాగా.. జూలు విధిల్చిన సింహం లాగా.. ఆఫ్ఘనిస్తాన్ ఆడింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 25, 2024 5:41 pm

Bangladesh Vs Afghanistan

Follow us on

Bangladesh Vs Afghanistan: సోమవారం గ్రూప్ -1 లో ఆస్ట్రేలియా – భారత్ మధ్య జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో రోహిత్ సేన గెలవడంతో.. మీడియా ఫోకస్ మొత్తం టీమిండియా పైనే ఉంది. మంగళవారం ఆఫ్ఘనిస్తాన్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన సూపర్ -8 మ్యాచ్ ను లైట్ తీసుకుంది. ఆ మ్యాచ్ కు హాజరైన ప్రేక్షకులు సంఖ్య కూడా తక్కువగానే ఉంది. చివరికి మ్యాచ్ ప్రసారమయ్యే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో కూడా లైవ్ చూసేవారి సంఖ్య ఐదు లక్షలకు మించలేదు.. దీనికి తగ్గట్టుగానే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ కూడా కొనసాగింది. ఆ జట్టు ఆటగాళ్లు 20 ఓవర్లు పూర్తిగా ఆడి 115 పరుగులు మాత్రమే చేసింది. గుర్బాజ్ 43 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు.. ఆ తర్వాత వర్షం కురవడంతో అంపైర్లు డక్ వర్త్ లూయిస్ విధానాన్ని అమలు చేశారు. ఓవర్లను 19 కి తగ్గించారు.. బంగ్లాదేశ్ విజయ లక్ష్యాన్ని 114 పరుగులకు కుదించారు.

బంగ్లా విజయ లక్ష్యం 114 పరుగులు గానే ఉండడంతో.. చాలామంది ఆఫ్ఘనిస్తాన్ గెలవదు అని ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ, పడి లేచిన కెరటం లాగా.. జూలు విధిల్చిన సింహం లాగా.. ఆఫ్ఘనిస్తాన్ ఆడింది. మైదానంపై ఉన్న తేమను అనుకూలంగా మలుచుకుని అద్భుతంగా బౌలింగ్ వేసింది. పదునైన బంతులు వేస్తూ బంగ్లా ఆటగాళ్లను మూడు చెరువుల నీళ్లు తాగించింది.. బంగ్లా ఆటగాళ్లలో తాంజిద్ హసన్(0), షకీబ్ ఉల్ హసన్(0), రిషద్ హొస్సెన్(0) గోల్డెన్ డక్ ఔట్ లుగా వెను తిరిగారంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఏ స్థాయిలో సత్తా చాటారో అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ రషీద్, నవీన్ – ఉల్ – హక్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టి.. బంగ్లా పులుల భరతం పట్టారు.. వాస్తవానికి 16 ఓవర్ దాకా బంగ్లాదేశ్ గెలిచేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పైగా లిటన్ దాస్(54) అర్థ సెంచరీ చేసి ఊపు మీద ఉన్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా బంతిని స్టాండ్స్ అవతలికి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఈ దశలోనే రషీద్ ఖాన్ తన బుర్రకు పదును పెట్టాడు. అప్పటిదాకా రెండు వికెట్లు తీసిన నవీన్ ఉల్ హక్ కు బంతి చేతికి అందించాడు.

నవీన్ వేసిన మొదటి బంతికి దాస్ సింగిల్ తీశాడు.. రెండో బంతికి తస్కిన్ అహ్మద్ మరో సింగిల్ తీశాడు. మూడో బంతి కఠినంగా వచ్చినప్పటికీ దాస్ సింగిల్ తీశాడు. అయితే ఇక్కడే నవీన్ తన మాయజాలాన్ని ప్రదర్శించాడు. నాలుగో బంతిని స్లో డెలివరీగా సంధించగా.. దానిని తస్కిన్ అహ్మద్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. బంతిని గట్టిగా కొట్టే క్రమంలో అది ఎడ్జ్ కు తగిలి వికెట్లను పడగొట్టింది. దీంతో బంగ్లా జట్టులో ఒక్కసారిగా నైరాశ్యం అలముకుంది. ఆఫ్ఘాన్ జట్టులో ఉత్సాహం ఆవరించింది. అప్పటికి బంగ్లా జట్టు విజయ సమీకరణం 8 బంతుల్లో 8 పరుగులుగా ఉంది. ఈ దశలో ముస్తా ఫిజుర్ క్రీజ్ లోకి వచ్చాడు. నవీన్ మరోసారి స్లో డెలివరీ సంధించడంతో.. అది అతడి ప్యాడ్లను తగిలింది.. నవీన్ అప్పీల్ చేయగా .. అంపైర్ అవుట్ ఇచ్చాడు.. అయితే బంగ్లా ఆటగాళ్లు డీఆర్ఎస్ కు వెళ్ళగా… బంతి వికెట్లను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ కూడా ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో ఏకీభవిస్తూ ఔట్ ఇచ్చాడు. దీంతో బంగ్లాదేశ్ విజయానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలవగా.. ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది.. ఈ విజయంతో దర్జాగా సెమీస్ దూసుకెళ్లింది. ఎంతో ఉత్కంఠ మధ్య 17 ఓవర్ వేసిన నవీన్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు వికెట్లను వరుస బంతుల్లో పడగొట్టి.. ఆఫ్ఘనిస్తాన్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని కూడా దక్కించుకున్నాడు. టి20 వరల్డ్ కప్ చరిత్రలో నవీన్ వేసిన 17 ఓవర్ చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.