Vizag : భారత మహిళల అంధుల క్రికెట్ టీమ్‌కు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన బాలిక ఎంపికైంది. జిల్లాలోని బాతుగుడబ మండలం గుమ్మ లక్ష్మీపురం మండలం బాతుగుడబా గ్రామానికి చెందిన చెల్లకి సంధ్య(12) భారత అంధుల క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఇటీవలే ఉమెన్స్ క్రికెట్ జట్టుకు ఏపీకే చెందిన మహిళా క్రికెటర్ ఎంపికైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇద్దరూ పేదింటి ఆడబిడ్డలే.
ఇంగ్లండ్‌లో వరల్డ్ కప్..
ఆగస్టు 17 నుంచి 25 వరకు ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐబీఎస్ పోటీల్లో సంధ్య పాల్గొననుంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని చినజీయర్‌స్వామి నేత్రాలయం పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇంగ్లాండ్‌లో జరగనున్న పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.
ఇదీ కుటుంబ నేపథ్యం..
సంధ్య తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. తెలిసిన వారి సలహా మేరకు చదువుకొనేందుకు చినజీయర్‌స్వామి నేత్రాలయం పాఠశాలలో తల్లిదండ్రులు సంధ్యను చేర్పించారు. అక్కడ బ్రెయిలీ లిపి నేర్చుకునే క్రమంలో క్రికెట్, ప్రముఖ క్రికెటర్ల గురించి తెలుసుకున్న సంధ్యకు క్రీడలపై ఆసక్తి కలిగింది. అప్పటికే ఆశ్రమంలోని సత్యవతి, రవణి.. ఇద్దరూ క్రికెటర్లుగా రాణిస్తున్నారు. ఇది తెలుసుకున్న సంధ్య వారితో క్రికెట్ ఆడడం ప్రారంభించింది. అలా మొదలైన ఆమె క్రికెట్ ప్రస్థానం చిన్న వయస్సులోనే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుంది.
బౌలింగ్‌లో రాణింపు..
సంధ్య కుడి చేతి వాటం మీడియం పేస్ బౌలర్. గత నెలలో చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు తీసి ఆంధ్ర జట్టును గెలిపించింది. ఈ మ్యాచ్‌లో మ్యాన్‌ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకుంది. భారత జట్టుకు ఎప్పటికైనా కెప్టెన్ కావాలనే లక్ష్యంతో ప్రయాణం కొనసాగిస్తోన్న సంధ్య ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.
అనంతపురం నుంచి ఉమెన్స్ జట్టుకు..
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూష బారెడి. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నీలో టీమిండియా జట్టులో స్థానం దక్కింది. అనూష ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది. ఎడమ చేతి స్పిన్నర్, బ్యాటర్ అయిన అనూష తన ప్రతిభతో అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టులో స్థానం పొందింది. జాతీయ క్రికెట్ టోర్నీలో అనూష అద్భుత ప్రతిభ కనబర్చి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. అనూష ఇంతకుముందే హాంగ్‌కాంగ్ లో జరిగిన అండర్ 19 టోర్నీలో పాల్గొని కనబరిచింది.