https://oktelugu.com/

Duvvada Srinivas: వలంటీర్లకు పోర్టు ఉద్యోగాలు.. ఆఫర్ చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ

ఏడాది కిందట మూలపేట పోర్టు శంకుస్థాపనకు వచ్చిన సీఎం జగన్ దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దువ్వాడ శ్రీనివాస్న్ గెలిపించాలని టెక్కలి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : February 21, 2024 11:18 am
    Duvvada Srinivas
    Follow us on

    Duvvada Srinivas: ఏపీలో దూకుడుగా ఉండే వైసీపీ నేతల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. ఆయనలో ఉన్న ఫైర్ చూసే సీఎం జగన్ టెక్కలి ఇన్చార్జి పోస్టు ఇచ్చారు. ఎమ్మెల్సీని చేశారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలి టికెట్ ను సైతం ఖరారు చేశారు. గత ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వాడ ఓడిపోయారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలుపొందారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు సైతం టెక్కలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల అనంతరం టిడిపి నుంచి గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించాలని జగన్ బలంగా నిర్ణయించుకున్నారు. అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ దూకుడుగా ఉండడంతో జగన్ దృష్టిలో పడ్డారు. టెక్కలి ఇన్చార్జ్, తరువాత ఎమ్మెల్సీ పదవి చకచకా దక్కించుకున్నారు.

    ఏడాది కిందట మూలపేట పోర్టు శంకుస్థాపనకు వచ్చిన సీఎం జగన్ దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దువ్వాడ శ్రీనివాస్న్ గెలిపించాలని టెక్కలి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్కడకు కొద్ది రోజులకే దువ్వాడ శ్రీనివాసును ఇన్చార్జి పదవి నుంచి తొలగించారు. ఆయన భార్య దువ్వాడ వాణిని ఇన్చార్జిగా ప్రకటించారు. ఆమె కొద్ది నెలలపాటు యాక్టివ్ గా పని చేశారు. పార్టీ శ్రేణులతో మమేకం అయ్యారు. కానీ అనూహ్యంగా ఆమెను తొలగించి దువ్వాడ శ్రీనివాస్ కు టెక్కలి టికెట్ ను జగన్ ఖరారు చేశారు. దీంతో నాలుగు మండలాల పార్టీ శ్రేణులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.

    దువ్వాడ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా సంతబొమ్మాలి మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు ఏకతాటిపైకి వచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ కు టికెట్ ఇస్తే సహకరించమని తేల్చేశారు. మూలపేట పోర్టు నిర్మాణంలో కాంట్రాక్టర్ గా అవతారం ఎత్తారని.. కమిషన్లు తీసుకుంటున్నారని.. ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఈ ఘటన మరువక ముందే తాజాగా దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సంతబొమ్మాలి మండలంలో పనిచేస్తున్న 420 మంది వలంటీర్లు వైసిపి గెలుపు కోసం పనిచేయాలని కోరారు. వైసిపి అధికారంలోకి వస్తే వలంటీర్లు అందరికీ పోర్టులో ఉద్యోగాలు ఇస్తామని.. వారి స్థానంలో కొత్తగా కొంతమందిని వలంటీర్లుగా తీసుకుంటామని దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోర్ట్ లో ఉద్యోగాలు అంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆఫర్ ఇవ్వడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.