IPL Net Worth: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో క్రికెట్ లీగ్ లు జరుగుతున్నాయి. అయితే, భారత్ లో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రం అత్యంత ఖరీదైన లీగ్ గా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే బీసీసీఐ ప్రపంచంలోనే ధనిక క్రికెట్ కంట్రోల్ బోర్డుగా అవతరించింది అంటే దానికి ఐపీఎల్ ఒక కారణంగా చెబుతారు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ కిందట ముగిసిన 2023తో 16 సీజన్లు పూర్తి చేసుకుంది. పదహారేళ్ళ కిందట ఒక సాధారణ లీగ్ గా ప్రారంభమై.. ప్రస్తుతం అసాధారణమైన స్థాయికి చేరిపోయింది. ఆదాయం, ఆదరణ, విలువపరంగా.. ఐపీఎల్ ఊహకు అందని స్థాయికి ఎదిగిపోయింది.
ప్రపంచంలో మరో క్రికెట్ లీగ్ కు లేనంతగా ఐపీఎల్ కు అభిమానులు ఉన్నారు. ఏటా కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులు.. ఐపీఎల్ వీక్షించేందుకు ఎదురు చూస్తుంటారు. వీక్షకుల సంఖ్య పెరుగుతున్న దానికి అనుగుణంగానే ఐపీఎల్ ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది ఐపీఎల్ బ్రాండ్ విలువ ఏకంగా రూ.26,432 కోట్ల(3.2 బిలియన్ అమెరికన్ డాలర్లు) కు చేరింది. గడిచిన ఏడాది రూ.14,868 కోట్లుగా ఉంది. ఒక్క ఏడాదిలోనే ఐపిఎల్ విలువ వృద్ధిరేటు 80 శాతం పెరిగింది. ఈ వ్యాపార సంస్థ విలువ కూడా 80 శాతం వృద్ధిరేటు (రూ.70,212 కోట్లు నుంచి రూ.1.27 లక్షల కోట్లకు) చేరుకుంది. 2023-27 కాలానికిగాను ఐపీఎల్ మీడియా హక్కుల కోసం వయాకామ్18, డిస్నీ స్టార్ కలిపి రూ.48,390 కోట్లు చెల్లించడమే ఈ లీగ్ విలువ భారీగా పెరుగుదలకు కారణమైంది. 2017 తో పోలిస్తే 2023 నాటికి మీడియా హక్కుల వార్షిక వృద్ధిరేటు 196 శాతంగా గా ఉంది. ఈ విషయంలో కేవలం అమెరికా ఫుట్బాల్ లీగ్ మాత్రమే ఐపీఎల్ కంటే ముందు ఉంది.
ఐపీఎల్ కు ఆదరణ ఎక్కువ ఉండడం వల్లే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో పెరుగుతున్న కొద్దీ అభిమానుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఐపీఎల్ కు స్పాన్సర్ చేసే సంస్థలు ఎక్కువగా ముందుకు వస్తున్నాయి. దీంతో ఎవరు ఊహించని రీతిలో ఐపీఎల్ కు ఆదరణతో పాటు ఆదాయం భారీగా పెరుగుతుంది. పదహారేళ్లలో ఐపీఎల్ లక్ష కోట్ల వృద్ధిరేటుకు చేరుకోవడం సాధారణ విషయం ఏమీ కాదు. అభిమానుల అంచనాలకు, వినోదానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చేస్తున్న మార్పులు కూడా ఐపీఎల్ పట్ల ఆదరణ తగ్గకుండా ఉండేందుకు కారణం అవుతున్నాయి. దీంతో ఆదాయ వనరులు కూడా తగ్గడం లేదు. భవిష్యత్తులో కూడా ఐపీఎల్ ను మరో లీగ్ దగ్గరలో కూడా కనిపించడం లేదంటే.. ఈ లీగ్ స్టామినా ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.