Suresh Raina: టీమిండియాలో ధోని లాగా వెలుగొందాల్సిన వాడు.. ఆ లోపంతో కెరియర్ నే కోల్పోయాడు..

అతని బ్యాటింగ్ అమోఘం. ఫీల్డింగ్ అత్యద్భుతం. బౌలింగ్ సంచలనం. అప్పట్లో అతడిని భావి ధోనిగా పిలిచేవారు. ధోని తర్వాత నాయకత్వ బాధ్యతలు అందుకుంటాడని అంచనా వేశారు. కానీ అతడేమో అర్థాంతరంగా కెరియర్ కు ముగింపు పలికాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 28, 2024 3:12 pm

Suresh Raina

Follow us on

Suresh Raina: సురేష్ రైనాను ఐపీఎల్ లో చిన్న తలా(సోదరుడు) అని పిలుస్తారు. వాస్తవానికి రైనా గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనికి సురేష్ రైనా అత్యంత దగ్గరి స్నేహితుడు. ఐపీఎల్ లో చెన్నై జట్టుకు నంబర్ :2 గా గుర్తింపు పొందాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తన బ్యాటింగ్ తో ఆదుకునేవాడు.. వికెట్లు కావాల్సి వచ్చినప్పుడు తన బౌలింగ్ తో పడగొట్టేవాడు. పరుగుల వరద పారుతున్నప్పుడు తన ఫీల్డింగ్ తో అడ్డుకట్ట వేసేవాడు. యువరాజ్, మహమ్మద్ కైఫ్ తర్వాత ఆ స్థాయిలో ఫీల్డింగ్ ప్రమాణాలను పాటించాడు. ఇన్ని సానుకూలతలు ఉన్న అతడు.. లెజెండరీ ప్లేయర్ కాకుండానే ఒకే ఒక్క బంతి ద్వారా తన కెరియర్ కు ఎండ్ కార్డు వేసుకున్నాడు.

అప్పుడు ప్రవేశించాడు

2005 జూలై 30న దంబుల్లా వేదికగా భారత జట్టు శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడుతున్న సమయంలో.. టీమిండియాలోకి సురేష్ రైనా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిద్దామని ఆయన రంగంలోకి దిగాడు. కానీ తొలి బంతికే 0 పరుగులకు అవుట్ అయ్యాడు. ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్లో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు జట్టులో స్థానం కోసం ఎదురుచూశాడు.. సున్నా తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన భారతీయ క్రికెటర్ దాకా ఎదిగేలా చేసుకున్నాడు. 2008లో రైనా ధోని ఆధ్వర్యంలో సూపర్ ఆటగాడిగా ఆవిర్భవించాడు. ధోని నీడ ఉన్నప్పటికీ తనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఎలాంటి స్థానంలోనైనా బ్యాటింగ్ చేసే సత్తాను సొంతం చేసుకున్నాడు.. ఫీల్డింగ్ లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు. పార్ట్ టైం లా కాకుండా ప్రొఫెషనల్ బౌలర్ గా జట్టుకు సేవలు అందించాడు.. ఒకానొక దశలో జట్టుకు వైస్ కెప్టెన్ అయ్యాడు. ధోని లేని సమయంలో నాయకుడిగా జట్టును నడిపించాడు.

అదే ఇబ్బంది పెట్టింది

ధోని తర్వాత భావి కెప్టెన్ రైనానే అని అందరూ భావించారు. ఐపీఎల్ లోనూ సురేష్ రైనా సత్తా చాటాడు. ధోని ఆధ్వర్యంలోని చెన్నై జట్టు అప్రతిహత విజయాలు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. చెన్నై జట్టులో ధోని తర్వాత స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. అయితే ఈ ఊపులో షార్ట్ బాల్ లోపం రైనాను కెరియర్ ను తీవ్రంగా ప్రభావితం చేసింది. అయితే అతను మాత్రమే కాదు టీమ్ ఇండియాలో చాలామంది ఆటగాళ్లకు ఈ వైఫల్యం ఉంది. అయితే ఇది రైనాకు కాస్త ఎక్కువగా ఉంది. దీంతో ప్రత్యర్థి బౌలర్లు అలాంటి బంతులను రైనా మీదికి సంధించేవారు. అలా రైనా 2013 నుంచి ఆ షార్ట్ బంతులను ఎదుర్కోలేక ఇబ్బంది పడేవాడు.. దీంతో వికెట్లను సమర్పించుకునే వాడు. ఫలితంగా జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. అయితే ఆ బంతులను ఎదుర్కొనేందుకు రైనా తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత రంజీ క్రికెట్ లో సత్తా చాటాడు. వరుసగా సెంచరీలు చేశాడు.

మళ్లీ జట్టులోకి వచ్చినప్పటికీ..

దేశవాళి క్రికెట్ వరుస సెంచరీలు చేసి సురేష్ రైనా మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. షార్ట్ బాల్ విక్నెస్ ను మాత్రం అధిగమించలేకపోయాడు. కొన్ని సందర్భాల్లో షార్ట్ బాల్ ఆడేందుకు ప్రయత్నిస్తుంటే.. బౌలర్లు యార్కర్లు సంధించేవారు. దీంతో క్లీన్ బౌల్డ్ అయ్యేవాడు. ఇలా తన కెరియర్ డౌన్ ఫాల్ అవుతుండడంతో.. తట్టుకోలేకరైన 2018లో చివరి t20 మ్యాచ్ ఆడాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అతడు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు 33 సంవత్సరాల వయసును మాత్రమే రైనా కలిగి ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ వయసు 37 సంవత్సరాలు. ఫిట్ నెస్ ను కాపాడుకోవడంలో రోహిత్ కంటే రైనా ముందుంటాడు. లాఫ్టెడ్ షాట్లు, ఫ్లిక్ షాట్,
కవర్ డ్రైవ్, కట్ షాట్లు అద్భుతంగా ఆడే రైనా.. షార్ట్ బాల్స్ ను మాత్రం ఎదుర్కోలేకపోయాడు. తన లోపంతో చివరికి ఎంతో ఉజ్వలమైన కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు.