IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకయితే సగం లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. రాజస్థాన్, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ జట్లు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. తదుపరి ఏం జరుగుతుందో తెలియదు గాని.. ప్రస్తుతానికయితే ఈ జట్లు అద్భుతమైన ఆట తీరును కొనసాగిస్తున్నాయి. ఈ సీజన్లో కొన్ని జట్లు అదరగొడుతున్నాయి. అంచనాలకందని స్కోరు నమోదు చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మరికొన్ని జట్లు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాయి. కేవలం జట్లు మాత్రమే కాదు ఆటగాళ్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ సీజన్లో అలా నిరాశ పరుస్తున్న ఆటగాళ్లను ఒకసారి పరిశీలిస్తే..
కామెరూన్ గ్రీన్
ఈ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ను ముంబై ఇండియన్స్ నుంచి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 17.5 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అయితే ఇతడు బ్యాటింగ్, బౌలింగ్లో నిరాశ పరుస్తున్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఈ ఆటగాడు కేవలం 68 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో బెంగళూరు యాజమాన్యంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే ఇలా ఆడుతున్నావేంటని అంటూ గ్రీన్ పై మండిపడుతున్నారు.
మ్యాక్స్ వెల్
విధ్వంసానికి మారుపేరుగా ఆడే మాక్స్ వెల్.. ఈ సీజన్లో తేలిపోతున్నాడు. చేతికి గాయం కావడంతో టోర్నీ నుంచి పూర్తిగా నిష్క్రమించాడు. బెంగళూరు జట్టు ఏరి కోరి కొనుగోలు చేస్తే నట్టేట ముంచాడు. ఆరు మ్యాచ్లో కేవలం 32 పరుగులు చేశాడు. ఇందులోనూ ఏకంగా మూడు డక్ ఔట్ లు ఉన్నాయి. ఈ సీజన్లో ఏకంగా మాక్స్ వెల్ కు బెంగళూరు యాజమాన్యం 14 కోట్లు చెల్లించింది.
మహమ్మద్ సిరాజ్
టీమిండియా యువ సంచలనంగా ఈ బౌలర్ కు పేరుంది. అయితే ఈ సీజన్లో అతడు తన ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇటీవల బెంగళూరు.. హైదరాబాద్ జట్టుతో ఆడిన మ్యాచ్ లో ఇతడిని పక్కన పెట్టింది. ఇతడి ఎకానమీ రేటు 10.41 ఉందంటే బౌలింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వికెట్ల మాట అటుంచితే దారుణంగా పరుగులు ఇస్తున్నాడు.
సామ్ కరణ్
ఇంగ్లాండ్ జట్టుకు చెందిన ఈ ఆల్ రౌండర్ కు పంజాబ్ ఏకంగా 18.25 కోట్లు చెల్లిస్తోంది. కానీ ఇతడు తీసుకున్న ఆ డబ్బులకు న్యాయం చేయలేకపోతున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో చేతులెత్తేస్తున్నాడు. ఇప్పటివరకు ఇతడు కేవలం 126 పరులు మాత్రమే చేశాడు.. బౌలింగ్లో 8 వికెట్లు పడగొట్టాడు. కానీ అతడి స్థాయికి ఈ ప్రదర్శన సరికాదని అభిమానులు అంటున్నారు. కాస్త చూసి ఆడాలని సూచనలు చేస్తున్నారు.
హార్దిక్ పాండ్యా
గుజరాత్ జట్టు నుంచి ఇతడిని ఏరికోరి ముంబై జట్టు తెచ్చుకుంది. ఇందుకోసం భారీ మొత్తంలో అతడికి చెల్లిస్తోంది. కానీ ఇతడు బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ ఇలా మూడు విభాగాల్లో దారుణంగా ఫ్లాప్ అయ్యాడు. ఇప్పటివరకు అతడు కేవలం 131 రన్స్ మాత్రమే చేశాడు. బౌలింగ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇతడి నాయకత్వంలో ముంబై జట్టు ఇప్పటివరకు కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే నెగ్గింది.
మిచెల్ స్టార్క్
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఇతడి పై భారీ ఆశలు పెట్టుకుంది.. ఏకంగా 24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఇతడు మాత్రం దారుణమైన ఆటతీరుతో పరువు తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టి.. ఓవర్ కు పది చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు.