https://oktelugu.com/

Dinesh Kartik : ధోని విషయంలో అది ముమ్మాటికీ తప్పే.. నన్ను మన్నించండి

మహేంద్ర సింగ్ ధోని విషయంలో మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ లెంపలు వేసుకున్నాడు. సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా తనపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాడు.. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్ని ఫార్మాట్లలో తన ఆల్ టైం భారత క్రికెట్ జట్టును దినేష్ కార్తీక్ వెల్లడించాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 23, 2024 / 11:20 AM IST

    Dinesh karthik

    Follow us on

    Dinesh Karthik:  దినేష్ కార్తీక్ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆల్ టైం క్రికెట్ జట్టులో 12వ ఆటగాడిగా హార్భజన్ సింగ్ పేరును ప్రస్తావించాడు. అయితే ఇందులో దినేష్ కార్తీక్ ధోనీ పేరును ప్రకటించలేదు. మహేంద్ర సింగ్ ధోని 2007లో టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్ అందించాడు. 2011లో వన్డే ప్రపంచ కప్ దక్కేలా చూసాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ని టీమిండియా సొంతం చేశాడు. అయితే అలాంటి ఆటగాడిని దినేష్ కార్తీక్ పక్కన పెట్టడం చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో ధోని అభిమానులు దినేష్ కార్తీక్ ను సోషల్ మీడియా వేదికగా విమర్శించడం మొదలుపెట్టారు. “నువ్వెంత? నీ స్థాయి ఎంత ? దిగ్గజ ఆటగాడిని మర్చిపోయావు. అసలు నిన్ను అలాంటి జట్టును ఎంపిక చేయమని చెప్పింది ఎవరు. నువ్వు కూడా ధోనితో కలిసి ఆడావు కదా.. అతడి గొప్పతనం ఏంటో నీకు తెలియదా.. టీమిండియా కు అద్భుతమైన విజయాలు అందించని ఆటగాళ్లకు చోటు ఇచ్చిన నువ్వు.. ధోనికి ఎందుకు సముచిత ప్రాధాన్యం కల్పించలేకపోయావు? ఇదేనా నీ క్రీడాస్ఫూర్తి ” అంటూ ధోని అభిమానులు దినేష్ కార్తీక్ పై మండిపడుతున్నారు.

    అయితే ఈ వివాదానికి దినేష్ కార్తీక్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. తాను జట్టును ఎందుకు ఎంపిక చేశానో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ” నేను తప్పు చేశాను. అది పొరపాటే. నేను ప్రకటించిన 11 మందిలో ఒక వికెట్ కీపర్ ను మిస్ చేశాను. కానీ రాహుల్ ద్రావిడ్ ను నేను వికెట్ కీపర్ గా అనుకోని తీసుకోలేదు.. నేను కూడా వికెట్ కీపర్ నే కదా.. వికెట్ కీపర్ ను నేను మర్చిపోయానంటే మీరు నమ్ముతారా.. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. ఈ ఫార్మాట్లోనైనా ధోని పేరు కచ్చితంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రికెటర్లలో అతడు ఒకడు. ఒకవేళ ఆల్ టైం జట్టును ప్రకటించాల్సిన బాధ్యత నాపై కనుక ఉంటే.. ఏడవ స్థానంలో ధోని పేరును ప్రకటిస్తాను. అంతేకాదు భారత జట్టుకు ఏ దశలో అయినా అతడే కెప్టెన్” అని దినేష్ కార్తీక్ వెల్లడించాడు. ఇక దినేష్ కార్తీక్ ప్రకటించిన ఆల్ టైం 11 లో జహీర్ ఖాన్, బుమ్రా, యువరాజ్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు. 12వ ఆటగాడిగా హర్భజన్ సింగ్ పేరును దినేష్ కార్తీక్ జోడించాడు.

    మహేంద్ర సింగ్ ధోని అభిమానుల నుంచి విపరీతమైన ఆగ్రహం వ్యక్తం కావడంతో దినేష్ కార్తీక్ ఈ నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టాడు. సోషల్ మీడియాలో అతడిని టార్గెట్ చేస్తూ ధోని అభిమానులు ట్రోలింగ్ చేయడంతో.. తట్టుకోలేక వివరణ ఇచ్చినట్టు స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది..