Fire Accident Compensation : అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అనకాపల్లి తో పాటు విశాఖ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాలను సీఎం చంద్రబాబు పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం కూడా ప్రకటించారు. క్షతగాత్రులకు సైతం పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే అంతవరకు బాగానే ఉంది కానీ.. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పరిహారం అనేది తాము కాకుండా కంపెనీ నుంచి ఇప్పించే ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇంతటి బాధలో ఉన్న వారికి వెనువెంటనే సాయం అందిస్తే ఉపశమనం దక్కేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల పరిహారం.. కంపెనీ నుంచి ఇప్పిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని బాధిత కుటుంబాల వారు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కూడా దీనినే హైలెట్ చేస్తోంది. చంద్రబాబు చేసిన కామెంట్స్ విపరీతంగా ట్రోల్ చేస్తోంది.
* నాడు ఎల్జి పాలిమర్స్ ఘటనలో
విశాఖలో ఎల్జి పాలిమర్స్ లో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మృత్యువాత పడ్డారు. వెయ్యి మంది వరకు క్షతగాత్రులు అయ్యారు. అయితే నాడు సీఎంగా ఉన్న జగన్ స్పందించారు. వెనువెంటనే పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున అందిస్తామని చెప్పుకొచ్చారు. కంపెనీ ఇచ్చే పరిహారంతో సంబంధం లేకుండా తామే అందిస్తామని చెప్పారు. అందుకు తగ్గట్టుగా పరిహారం అందించి తమ ఉదారతను చాటుకున్నారు.
* అలా ప్రకటన చేస్తారని
ఎల్జి పాలిమర్స్ ఘటన నేపథ్యంలో చంద్రబాబు సైతం ఇప్పుడు అలానే ప్రకటిస్తారని.. పరిహారం అందజేస్తారని బాధితులు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. కేవలం కంపెనీ నుంచి పరిహారం వసూలు చేసి అందిస్తామని చంద్రబాబు చెప్పడంతో బాధితులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. కంపెనీ పరిహారం అందిస్తే ప్రభుత్వం చేసిందేమిటన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వచ్చారు.. వెళ్లారు తప్ప సీఎం పర్యటనతో ఒరిగిందేమిటని నెటిజన్లు సైతం కామెంట్లు పెడుతున్నారు.
* ప్రభుత్వమే ఇస్తుందనుకుంటే
ఇంతటి భారీ దుర్ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత అనకాపల్లి జిల్లా కలెక్టర్, హోం మంత్రి వంగలపూడి అనిత బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున పరిహారం అందించనుందని ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఒకవైపు పరిహారం అందిస్తే.. కంపెనీ అందించే పరిహారం అదనం అని అంతా భావించారు. కానీ చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కంపెనీతో నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పుకొచ్చారు. దీనినే ఇప్పుడు వైసీపీ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. నేనే పరిహారం ఇస్తాను అన్న జగన్ ఎక్కడ? కంపెనీతో పరిహారం ఇస్తానన్న చంద్రబాబు ఎక్కడ? అని కామెంట్స్ ను ఉదాహరిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అంశంగా మారింది.