IND VS NZ Test Match : బెంగళూరులో గెలిచినా.. న్యూజిలాండ్ పై భారత్ దే పై చేయి.. ఇండియాలో ఇప్పటికీ అత్యల్ప రికార్డే..

1988లో న్యూజిలాండ్ జట్టు భారత్ పై టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు అంటే దాదాపు 36 సంవత్సరాల తర్వాత బెంగళూరు వేదికగా జరిగిన టెస్టులో విజయం సాధించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 20, 2024 6:47 pm

IND VS NZ

Follow us on

IND VS NZ Test Match :  టీమిండియాతో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు ముందు న్యూజిలాండ్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో, శ్రీలంక జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లను కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ ను కూడా మార్చింది. మొత్తంగా ఆ జట్టు అనామకంగా భారత గడ్డపైకి ప్రవేశించింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యంత పటిష్టమైన భారత జట్టును తొలి ఇన్నింగ్స్ లో కేవలం 46 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 402 రన్స్ చేసి.. భారత్ పై తిరుగులేని ఆధిక్యతను సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే కుప్పకూలిన నేపథ్యంలో.. భారత జట్టు బౌన్స్ బ్యాక్ అయింది. రెండవ ఇన్నింగ్స్ లో 462 రన్స్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్ 150, పంత్ 99 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. అయితే మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో టీమ్ ఇండియా భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచలేకపోయింది. టీమిండియా విధించిన 108 పరుగుల టార్గెట్ ను న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి చేదించింది. 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపు ద్వారా 36 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు లాథమ్ సేన తెరదించింది. బెంగళూరులో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ.. ఇప్పటికీ న్యూజిలాండ్ భారత గడ్డపై తన పేలవ రికార్డును కొనసాగిస్తూనే ఉంది.

37 టెస్ట్ మ్యాచ్ లలో..

న్యూజిలాండ్ జట్టు ఇప్పటివరకు టీం ఇండియాతో 37 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. అయితే ఇందులో మూడుసార్లు మాత్రమే విజయం సాధించింది.. 1969 లో నాగ్ పూర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ 167 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు న్యూజిలాండ్ భారత్ పై సాధించిన విజయాలలో అతి పెద్దదిగా కొనసాగుతోంది. 1988లో వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 136 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత న్యూజిలాండ్ ఇన్నాళ్లకు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2000 సంవత్సరం తర్వాత న్యూజిలాండ్ జట్టు భారత్ లో టీమిండియా పై ఒక ఇన్నింగ్స్ లో 100+ టార్గెట్ ను విజయవంతంగా చేదించడం ఇదే మొదటిసారి. ఇక భారత్ విషయానికి వస్తే.. రెండవ ఇన్నింగ్స్ లో 400+ స్కోర్ చేసినప్పటికీ ఓడిపోవడం ఇది నాలుగోసారి. 1985లో చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రెండవ ఇన్నింగ్స్ లో భారత్ 412 పరుగులు చేసింది. అయినప్పటికీ ఓటమిపాలైంది. 1998లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియా పై రెండవ ఇన్నింగ్స్ లో 424 రన్స్ చేసినప్పటికీ పరాజయం పాలైంది. 2005లో బెంగళూరు వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్ లో భారత్ 449 రన్స్ చేసినప్పటికీ ఓటమిపాలైంది. 2024లో హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై భారత్ రెండవ ఇన్నింగ్స్ లో 436 రన్స్ చేసింది. అయినప్పటికీ ఓటమి పాలైంది.

వర్షం వల్ల.. తొలిరోజు ఆట బంద్.. ఆ తర్వాత ఓటమి

1976లో చెన్నై వేదికగా న్యూజిలాండ్ జట్టుతో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. అప్పుడు వర్షం కురవడం వల్ల తొలి రోజు ఆట సాధ్యం కాలేదు. మిగతా రోజుల్లో ఆట సాగింది. భారత్ ఓడిపోయింది. 2013 మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో, 2024 బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లోనూ వర్షం అంతరాయం కలిగించి.. తొలిరోజు ఆట సాధ్యం కాలేదు. మిగతా నాలుగు రోజుల్లో మ్యాచ్ సాగినప్పటికీ.. భారత్ ఓటమి పాలైంది.