https://oktelugu.com/

Paris Olympics 2024 : బోల్ట్ నిష్క్రమించినా.. ట్రాక్ పై నిప్పులు చిమ్ముకుంటూ పరుగులు పెట్టారు..

బోల్ట్ నిష్క్రమణ తర్వాత 100 మీటర్ల పరుగు పందెం పూర్తిగా తన లయను కోల్పోయింది. ఆ ట్రాక్ పై ఇద్దరు అథ్లెట్లు సరికొత్త కాంతిని నింపారు. ఆసక్తి కోల్పోయి నిరాశ జనకంగా మారిపోయిన ఈ విభాగానికి మళ్లీ కొత్త రంగులు అద్దాలు. నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడి ఆకట్టుకున్నారు. వాస్తవానికి గోల్డ్ మెడల్ ఒక్కరికే దక్కినప్పటికీ.. ప్రేక్షకుల మనసులో ఇద్దరూ విజేతలుగా నిలిచారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 6, 2024 11:50 am
    Follow us on

    Paris Olympics 2024 : ఒలింపిక్స్ లో మిగతా క్రీడల సంగతి ఎలా ఉన్నా.. వంద మీటర్ల పరుగు అనగానే మనకు జమైకా గుర్తుకు వస్తుంది. జమైకా దేశానికి చెందిన హుస్సేన్ బోల్ట్ సృష్టించిన ఘనత జ్ఞప్తికి వస్తుంది. కాలం వేగంతో సమానంగా పరిగెత్తే బోల్ట్.. ఒలింపిక్స్ చరిత్రలో ఎన్నో మెడల్స్ సొంతం చేసుకున్నాడు. అనితర సాధ్యమైన ఘనతలను తన పేరు మీద రాసుకున్నాడు. అందుకే సమకాలిన 100 మీటర్ల పరుగు పందెంలో బోల్ట్ సరికొత్త ధ్రువతారగా ఎదిగాడు. అయితే అతడి నిష్క్రమణ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? ఆ స్థాయిలో పరుగులు పెట్టేది ఎవరు? అనే ప్రశ్నలకు పారిస్ ఒలింపిక్స్ ద్వారా ఇద్దరు అథ్లెట్లు సమాధానం చెప్పారు.

    ఆకర్షణ పెంచారు

    బోల్ట్ నిష్క్రమణ తర్వాత 100 మీటర్ల పరుగు పందెం పూర్తిగా తన లయను కోల్పోయింది. ఆ ట్రాక్ పై ఇద్దరు అథ్లెట్లు సరికొత్త కాంతిని నింపారు. ఆసక్తి కోల్పోయి నిరాశ జనకంగా మారిపోయిన ఈ విభాగానికి మళ్లీ కొత్త రంగులు అద్దాలు. నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడి ఆకట్టుకున్నారు. వాస్తవానికి గోల్డ్ మెడల్ ఒక్కరికే దక్కినప్పటికీ.. ప్రేక్షకుల మనసులో ఇద్దరూ విజేతలుగా నిలిచారు. వారే నయా స్ప్రింట్ పెను సంచలనాలు నోవా లైల్స్, కిషేన్ థాంప్సన్. 100 మీటర్ల పరుగు పందెంలో బోల్ట్ వారసులుగా వీరిద్దరూ ప్రత్యేకంగా నిలిచిపోయారు.

    హోరాహోరిగా తలపడ్డారు

    హుస్సేన్ బోల్ట్ 100 మీటర్ల పరుగు విభాగంలో సరికొత్త రికార్డులు సృష్టించాడు. 2008, 2012, 2016లో గోల్డ్ మెడల్స్ దక్కించుకున్నాడు. మూడు సంవత్సరాల పాటు ఒలింపిక్ ఛాంపియన్ గా ఆవిర్భవించాడు. అతడు నిష్క్రమించిన తర్వాత ఈ పోటీ కాస్త కళావిహీనంగా మారిపోయింది. ఈ క్రమంలో పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగు పందెంలో నోవా లైల్స్, కిషేన్ థాంప్సన్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డారు. వీరిద్దరూ కేవలం 9.79 సెకండ్లలోనే టార్గెట్ రీచ్ అయ్యారు.. 0.005 సెకండ్లలో జమైకా అథ్లెట్ కిషేన్ థాంప్సన్ ను నోవా లైల్స్(అమెరికా) వెనక్కి నెట్టాడు. తొలిసారిగా ఒలంపిక్ ఛాంపియన్ గా ఆవిర్భవించాడు. వాస్తవానికి వీరిద్దరి నేపథ్యాలు పూర్తి విభిన్నమైనవి. అయితే పరుగు పందెంలో మాత్రం హోరాహోరిగా తలపడ్డారు. ట్రాక్ పై మెరుపుతీగల్లాగా మెరిశారు. చిరుతల్లాగా పరిగెత్తి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు.. 100 మీటర్ల పరుగు పందెంలో ఫైనల్స్ లో 8 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. అయితే వీరంతా 10 సెకండ్ల లోపే రేసును ముగించడం విశేషం.

    హృదయాలను గెలిచారు

    100 మీటర్ల పరుగు పందెంలో నోవా లైల్స్, కిషేన్ థాంప్సన్ చిరుత పులుల్లాగా పరుగులు పెట్టారు. కాలం వేగంతో సమానంగా కదిలారు. నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డారు. విజేత గా నోవా లైల్స్(అమెరికా) ఆవిర్భవించినప్పటికీ.. కిషేన్ చేతులెత్తయలేదు. తన వల్ల కాదంటూ వెనుకబడిపోలేదు. కేవలం 0.005 సెకండ్ల తేడాతోనే రేసులో వెనుకబడ్డాడు. నోవా లైల్స్(అమెరికా), కిషేన్ మధ్య వ్యత్యాసం 0.005 సెకండ్లు మాత్రమే. అంటే దీనిని బట్టి వారిద్దరి మధ్య పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరూ పరిగెత్తిన విధానాన్ని చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ” రెండు చిరుతపులులు మైదానంలో పరిగెత్తినట్టు ఉంది. వారిద్దరూ పరుగులు తీస్తుంటే కాలం కూడా వెనుకబడిపోయినట్టు అనిపించింది. కాంతి వేగం కూడా చిన్నదనిపించింది. ధ్వని వేగం కూడా చిన్నబోయినట్టు అనిపించింది. అసలు వాళ్లకు ఒంట్లో ఎముకలు ఉన్నాయా లేదా? అనే అనుమానం కలిగింది. ఆ స్థాయిలో పరుగులు పెట్టారంటే ఏ స్థాయిలో శిక్షణ పొంది ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ వారిద్దరూ మా హృదయాలను గెలిచారంటూ” సోషల్ మీడియా వేదికగా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.