Deepti jivan ji : గ్రహాంతరవాసి అన్నారు.. పారాలింపిక్స్ లో కాంస్యం సాధించింది.. ఇప్పుడేమో నిజ జీవితాన్నీ గెలిచింది

ఇటీవల పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్ లో దీప్తి కాంస్యం సాధించింది. దీంతో ఆమె చేసిన గొప్పదనం వెలుగులోకి వచ్చింది. తన తల్లిదండ్రులు తనకోసం అమ్మిన భూమిని తిరిగి కొనుగోలు చేసిన తీరు చర్చకు దారితీస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 6, 2024 6:04 pm

Deepti jivan ji

Follow us on

Deepti jivan ji : ఉలి దెబ్బలకు భయపడితే శిల శిల్పం కాలేదు. అవమానాలకు కృంగిపోతే మనిషి విజయం సాధించలేడు. ఈ మాటలు ఈమె జీవితంలో నూటికి నూరుపాళ్లు నిజమయ్యాయి. హేళన చేసిన వారిని.. అవమానించిన వారిని.. అడ్డగోలుగా మాట్లాడిన వారిని.. ఇలా ప్రతిదశలో చూసింది. తన ప్రతి మలుపులో ఎదుర్కొంది. కానీ చివరికి ధైర్యే సాహసి లక్ష్మీ అన్నట్టుగా పోరాడింది. చివరికి పారాలింపిక్స్ లో కాంస్యం సాధించింది. ఆ మెడల్ తోనే ఆగిపోలేదు.. ఇప్పుడు నిజజీవితంలోనూ ఆమె గెలిచేసింది.

పారాలింపిక్స్ లో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజి కాంస్యం పతకం సాధించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ లో దీప్తి జన్మించింది. చిన్నప్పుడే ఆమెకు మేధోపరమైన బలహీనత ఉండేది. దీంతో ఆమె చదువు, క్రీడల్లో శిక్షణ నిమిత్తం తల్లిదండ్రులు ఉన్న ఎకరం భూమిని అమ్మేశారు. 2016లో తమకు ఉన్న ఆ భూమిని తొమ్మిది లక్షలకు అమ్మి దీప్తిని అథ్లెట్ గా తీర్చి దిద్దడానికి వెచ్చించారు. అయితే ఇప్పుడు ఆ ఎకరం భూమిలో అర ఎకరాన్ని 11 లక్షలకు దీప్తి కొనుగోలు చేసింది. తన తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చింది. గత ఏడాది చైనా వేదికగా పారా ఆసియా గేమ్స్ జరిగాయి. ఈ పోటీల్లో దీప్తి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం 11 లక్షల క్యాష్ అవార్డు ఇచ్చింది. ఆ డబ్బును ఖర్చు పెట్టకుండా తన ఉన్నతి కోసం తల్లిదండ్రులు ఎకరం భూమిని అమ్మిన నేపథ్యంలో.. అందులో అర ఎకరాన్ని కొనుగోలు చేసింది..

తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చింది

ఇక ఇటీవల పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్ లో దీప్తి కాంస్యం సాధించింది. దీంతో ఆమె చేసిన గొప్పదనం వెలుగులోకి వచ్చింది. తన తల్లిదండ్రులు తనకోసం అమ్మిన భూమిని తిరిగి కొనుగోలు చేసిన తీరు చర్చకు దారితీస్తోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు దీప్తిపై అభినందనలు జల్లు కురిపిస్తున్నారు.”విజయం అంటే ఇదే. గొప్పదనం అంటే ఇదే. ఎంతోమంది ఆమెను హేళన చేశారు. చివరికి ఆమెను గ్రహాంతరవాసి అని కూడా అన్నారు. ఆమె వైకల్యాన్ని దెప్పి పొడిచారు. ఆమెను పదే పదే విమర్శించారు. అయినప్పటికీ ఆమె తట్టుకుంది. ఎవరైతే విమర్శలు చేశారో.. వాటిని తన విజయానికి బాటలుగా మలచుకుంది. విశ్వక్రీడా వేదికపై మూడు రంగుల జెండాను రెపరెపలాడించింది. మారుమూల గ్రామం నుంచి పారిస్ దాకా తన విజయకేతనాన్ని ఎగరేసిందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు మిగతా అర ఎకరం భూమిని కూడా కొనుగోలు చేసేందుకు భగవంతుడు ఆమెకు ఆర్థిక శక్తిని అందించాలని కోరుతున్నారు.

తొలి క్రీడాకారిణి గా రికార్డ్

పారాలింపిక్స్ లో దీప్తి 400 మీటర్ల టి20 కేటగిరి ఫైనల్లో 55.45 సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మూడవ స్థానంలో నిలిచింది..పారాలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో మెడల్ సాధించిన తొలి క్రీడాకారిణిగా దీప్తి రికార్డు సృష్టించింది. కాంస్యం సాధించిన నేపథ్యంలో దీప్తికి శంషాబాద్ విమానాశ్రయంలో అద్భుతమైన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గురువారమే దీప్తి ఢిల్లీ చేరుకుంది. ఆమె కేంద్ర మంత్రి మన్ సుఖ్ ను కలిసింది. ఈ సందర్భంగా ఆమెను కేంద్రమంత్రి అభినందించి, సన్మానించారు.