DC vs SRH: Sunrisers Hyderabad highest score in power play in T20 history..
DC vs SRH : ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. బౌలర్ ఎంత అరి వీర భయంకరుడైనా భయపడటం లేదు. బాదుడే మంత్రంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ జట్టులో ముఖ్యంగా హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 287 రన్స్ చేసి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. అది జరిగిన రోజుల వ్యవధిలోనే మరో రికార్డును సన్ రైజర్స్ ఆటగాళ్లు తమ పేరు మీద లిఖించుకున్నారు.
శనివారం రాత్రి ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు వీరవిహారం చేశారు.. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లే లో అనితర సాధ్యమైన స్కోర్ నమోదు చేశారు. తొలి పవర్ ప్లే లో 20 కి పైగా రన్ రేట్ తో 125 పరుగులు చేశారు. ఇందులో 13 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. దీనినిబట్టి హైదరాబాద్ ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు తొలి వికెట్ కు హెడ్ , అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లో 131 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
శనివారం ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో తొలి పవర్ ప్లే లో హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీనికంటే ముందు 2017లో బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు వికెట్ నష్టపోకుండా 105 రన్స్ చేసింది. 2014లో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై రెండు వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. 2015 లో ముంబై జట్టుపై చెన్నై జట్టు వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. అయితే ఈ జట్ల రికార్డులను హైదరాబాద్ ఆటగాళ్లు అత్యంత సులువుగా చెరిపేశారు. బహుశా ఇప్పట్లో మరే జట్టూ ఈ ఘనతను సాధించకపోవచ్చని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.