DC Vs MI IPL 2025: టీమిండియాలో బుమ్రా అంటే “బుమ్ బుమ్” అంటూ దూసుకు వచ్చే బంతే గుర్తుకువస్తుంది. వేగానికి వేగం.. కచ్చితత్వానికి కచ్చితత్వం. ఇన్ స్వింగర్, అవుట్ స్వింగర్, యార్కర్.. ఇలా బంతులతో చుక్కలు చూపిస్తాడు. మేటిమేటి ఆటగాళ్లను సైతం పెవిలియన్ పంపిస్తాడు. అయితే అటువంటి బు మ్రా కు ఢిల్లీ ఆటగాడు చుక్కలు చూపించాడు. మామూలుగా కాదు.. అతని పేరు మైండ్లో రిపీట్ అయితే చాలు భయపడేంతలా బుమ్రా ను వణికించాడు. ముంబై జట్టు విధించిన 206 పరుగుల టార్గెట్ ను చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన ఢిల్లీ జట్టుకు తొలి ఓవర్ తొలి బంతికే షాక్ తగిలింది. ప్రమాదకర ఓపెనర్ జేక్ ఫ్రెజర్ గుర్క్ దీపక్ చాహార్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. దీంతో ముంబై జట్టులో ఎనలేని ఉత్సాహం నెలకొంది. అయితే ఇది నీరు కారడానికి ఎంతో సమయం పట్టలేదు. గుర్క్ అవుట్ అయిన తర్వాత వన్ డౌన్ ఆటగాడిగా వచ్చిన కరణ్ నాయర్ (53* 25 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు) దుమ్ము రేపే ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా ఢిల్లీ జట్టు స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది.. కరణ్ కు మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ కూడా తోడు కావడంతో ఢిల్లీ జట్టు స్కోరు వికెట్ నష్టానికి సెంచరీకి చేరువైంది..
Also Read: అక్షర్ పటేల్ స్పైడర్ మాన్.. పరుగులు ఆపడానికే పుట్టావా బ్రో!
కరణ్ నాయర్ తన బ్యాటింగ్ స్టైల్ తో ఢిల్లీ అభిమానులను ఆకట్టుకుంటే.. ఢిల్లీ ప్రధాన బౌలర్ బుమ్రా కు చుక్కలు చూపించాడు. తన బ్యాటింగ్ ప్రతాపంతో బుమ్రా బౌలింగ్ ను ఉప్పు పాతర వేశాడు.. 4, 1, 0, 6, 0, 4, 0, 6, 2 మొత్తంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఇటీవలి కాలంలో బుమ్రా బౌలింగ్ లో ఈ స్థాయిలో చితక్కొట్టిన ఆటగాడు బహుశా కరణ్ నాయర్ మాత్రమే కావచ్చు. అంతటి విరాట్ కోహ్లీ కూడా ఇటీవలి మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్లో ఈ స్థాయిలో పరుగులు సాధించలేదు. కరణ్ ధాటికి హార్దిక్ పాండ్యా ఆరుగురు బౌలర్లను రంగంలోకి దింపాల్సి వచ్చింది. చివరికి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లోకి దిగినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీపక్ చాహర్, బుమ్రా, బౌల్ట్, శాంట్నర్, హార్దిక్ పాండ్యా, కర్ణ్ శర్మ… ఇలా ఆరుగురు బౌలర్లు కూడా చేష్టలుడిగి చూడాల్సి వచ్చింది.
అరుదైన రికార్డు
ముంబై జట్టుపై చేసిన హాఫ్ సెంచరీ ద్వారా కరణ్ నాయర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ జట్టు తరఫున కేవలం ఆరు ఓవర్ల లోపే హాఫ్ సెంచరీ చేసిన మూడవ ఆటగాడిగా కరణ్ ఘనత సొంతం చేసుకున్నాడు. జాబితాలో జాక్ ప్రెజర్ మెక్ గుర్క్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాడు. గత సీజన్లో ముంబై జట్టుపై 78(24), రాజస్థాన్ రాయల్స్ పై 50(20) పరుగులు చేశాడు. ఇక కరణ్ నాయర్ ముంబై ఇండియన్స్ పై 50(22) పరుగులు చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన కరణ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. అంతేకాదు గతంలో కరణ్ టెస్ట్ ప్లేయర్ గా ముద్రపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు వీడ్కోలు కూడా పలికాడు. కానీ అటువంటి ఆటగాడు ఇలా ఆడటం నిజంగా విశేషమే.
4,1,0,6,0,4,0,6,2 BY KARUN NAIR VS JASPRIT BUMRAH TONIGHT. pic.twitter.com/6rIUUQqpQq
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2025