DC vs KKR : నరైన్ విధ్వంసం.. ఐపీఎల్ లోనే రెండో అత్యధిక స్కోరు

ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు చేసిన ఘనత హైదరాబాద్ జట్టు మీద ఉంది. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ 277 పరుగులు చేసింది. కోల్ కతా 272 రన్స్ చేసి.. ఆ ఘనతకు ఐదు పరుగుల దూరంలో నిలిచింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు మూడు ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 27 పరుగులు చేసింది. 

Written By: NARESH, Updated On : April 3, 2024 10:18 pm
Follow us on

DC vs KKR : బౌలర్ బంతి వేయడమే ఆలస్యం.. స్టాండ్స్ లోకి వెళ్లిపోయింది. సునీల్ నరైన్ కొట్టిన కొట్టుడుకు బౌండరీ లైన్ చిన్నబోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సిక్సర్లు.. ఫోర్లు కూడా అంతే సంఖ్యలో.. ఎదుర్కొన్నది కేవలం 39 బంతులు.. బౌలర్ ఎవరనేది కాదు ముఖ్యం.. కొట్టాడా లేదా? బంతి బౌండరీ లైన్ దాటిందా? లేదా? అన్నట్టుగా సాగింది నరైన్ బ్యాటింగ్ తాండవం.. ఒక రకంగా చెప్పాలంటే విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం లో నరైన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా జట్టు 20వ ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఓపెనర్లుగా ఫిలిప్ సాల్ట్(18; 12 బంతుల్లో నాలుగు ఫోర్లు) సునీల్ నరైన్(85; 39 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు) కోల్ కతా జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 4.3 ఓవర్లలోనే కోల్ కతా జట్టు స్కోరును 60 పరుగులు దాటించారు. జట్టు స్కోరు 60 పరుగుల వద్ద సాల్ట్ ను అన్రిచ్ నోర్ట్జీ అవుట్ చేశాడు. అనంతరం రఘువంశి వన్ డౌన్ బ్యాటర్ గా క్రీజ్ లోకి వచ్చాడు. నరైన్ కు ఇతడు తోడు కావడంతో కోల్ కతా జట్టు స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. వీరిద్దరూ రెండో వికెట్ కు ఏకంగా 104 పరుగులు జోడించారు.. ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటివరకు రెండో వికెట్ కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 12.3 ఓవర్లలోనే కోల్ కతా జట్టు ఈ ఘనత సాధించింది అంటే.. వారి బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటికే నరైన్ 85 పరుగులు చేసి మిచెల్ మార్ష్ బౌలింగ్ లో కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

నరైన్ అవుట్ అయినప్పటికీ  రఘువంశి జోరు కొనసాగించాడు. అతడు కేవలం 27 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్స్ ల సహాయంతో 54 పరుగులు చేశాడు.. జట్టు స్కోరు 176 పరుగుల వద్ద ఉన్నప్పుడు రఘువంశి మూడో వికెట్ గా వెనుతిరిగాడు. నరైన్, రఘు వంశీ విధ్వంసం సృష్టించారనుకుంటే.. రస్సెల్ అంతకుమించి అనేలాగా ఆడాడు. కేవలం 19 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 41 పరుగులు చేశాడు. ఇతడు ఇషాంత్ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

కెప్టెన్ అయ్యర్ పదకొండు బంతుల్లో రెండు సిక్సుల సహాయంతో 18 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో స్టబ్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రింకు సింగ్ చివర్లో మెరుపులు మెరిపించాడు. కేవలం ఎనిమిది బంతుల్లో మూడు సిక్స్ లు, ఒక ఫోర్ సహాయంతో 26 పరుగులు చేశాడు. నోర్ట్జీ బౌలింగ్లో డేవిడ్ వార్నర్ కు క్యాచ్ ఇచ్చి ఓటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇశాంత్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. మిచెల్ మార్ష్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

మైదానం బ్యాటింగ్ కు సహకరిస్తుందనే అంచనా ఉండడంతో కోల్ కతా కెప్టెన్ అయ్యర్ మరో మాటకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతడి నిర్ణయం సబబే అని నిరూపిస్తూ కోల్ కతా ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని అందించారు. 60 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయినప్పటికీ..కోల్ కతా ఏమాత్రం వెనుకంజ వేయలేదు. తొలి వికెట్ ఇచ్చిన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసింది. రెండో వికెట్ కు ఏకంగా 104 పరుగుల భాగస్వామ్యం లభించింది. అప్పటికే జట్టు స్కోరు 164 పరుగులకు చేరడంతో.. మిగతా ఆటగాళ్లు మరింత రెచ్చిపోయారు. ఫలితంగా కోల్ కతా జట్టు స్కోరు 272 పరుగులకు చేరుకుంది.

ఈ మైదానంలో ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ ఒక ఓవర్లో 18 పరుగులు ఇచ్చి తన పేరు మీద చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. రఫిక్ మూడు ఓవర్లు వేసి 47, నోర్ట్జీ నాలుగు ఓవర్లు వేసి 59, ఈశాంత్ శర్మ మూడు ఓవర్లు వేసి 43, ఖలీల్ అహ్మద్ 4 ఓవర్లు వేసి 43 పరుగులు ఇచ్చుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో సుమిత్ కుమార్ మాత్రమే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతడు కూడా రెండు ఓవర్లు వేసి 19 పరుగులు సమర్పించుకున్నాడు.

ఈ మ్యాచ్లో నరైన్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే వచ్చీ రావడంతోనే అతడు దూకుడు మంత్రాన్ని ఎంచుకున్నాడు. ఒకానొక దశలో సెంచరీ వైపు కదులుతున్నట్టుగా అనిపించింది. అప్పటికే అతడు 7ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు. 39 బంతుల్లో 85 పరుగులు చేసి.. సెంచరీ చేసేలా కనిపించాడు. మిచెల్ మార్ష్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. 15 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. రఘు వంశీ, రస్సెల్, రింకు సింగ్ బ్యాట్లను ఝులిపించడంతో కోల్ కతా భారీ స్కోర్ సాధించింది. ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు చేసిన ఘనత హైదరాబాద్ జట్టు మీద ఉంది. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ 277 పరుగులు చేసింది. కోల్ కతా 272 రన్స్ చేసి.. ఆ ఘనతకు ఐదు పరుగుల దూరంలో నిలిచింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు మూడు ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 27 పరుగులు చేసింది.