CSK Vs RCB IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ షురూ కానుంది. శుక్రవారం నాటి ప్రారంభ మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢీ కొట్టబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మైదానంలో ఒక్కసారి గత రికార్డులను పరిశీలిస్తే..
సొంత మైదానం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సానుకూలాంశం అవుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మైదానంలో చెన్నై జట్టుకు మెరుగైన రికార్డులు ఉన్నాయి. ఈ గ్రౌండ్లో చెన్నై బెంగళూరు చేతిలో ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. ఇరుజట్లు ఈ మైదానం వేదికగా ఇప్పటివరకు ఎనిమిది సార్లు తలపడ్డాయి. చెన్నై జట్టు ఏడుసార్లు, బెంగళూరు ఒక్కసారి విజయం సాధించింది. ఆ విజయం కూడా 2008లో సాధించింది.
చెన్నై జట్టు తన సొంతమైదానంలో ఇప్పటివరకు 64 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 18 మ్యాచ్ లలో ఓడిపోయింది. 46 మ్యాచ్ లలో గెలుపు సాధించింది. అందుకే చెన్నై జట్టుకు చిదంబరం స్టేడియం అచ్చొచ్చిన వేదిక అంటారు. బెంగళూరు జట్టు ఈ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 12 మ్యాచ్ లు ఆడింది. ఐదింట్లో గెలిచింది. ఏడింట్లో ఓడిపోయింది.
శుక్రవారం నాటి ప్రారంభ మ్యాచ్ లో టాస్ కీలక పాత్ర పోషిస్తుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. చెన్నై జట్టు ఈ మైదానం వేదికగా ఎక్కువ మ్యాచ్ లు గెలవడంలో టాస్ విన్నింగ్ ముఖ్య పాత్ర పోషించింది. చెన్నై జట్టు గెలిచిన 46 మ్యాచ్ లలో 30 మ్యాచ్ ల్లో CSK ముందుగా బ్యాటింగ్ చేయడం విశేషం. టాస్ విన్ అయిన జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. కాగా చెన్నై, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ సాయంత్రం 7:30కు ప్రారంభం కానుంది. జియో సినిమాలో యాప్ లో ఈ మ్యాచ్ స్ట్రీమ్ అవుతుంది.