Homeఆంధ్రప్రదేశ్‌Jagan: జగన్ ట్రాప్ అది

Jagan: జగన్ ట్రాప్ అది

Jagan: రాజకీయాలు అన్నాక ఎవరి ఎత్తుగడలు వారికి ఉంటాయి. ఎవరి వ్యూహాలను వారు అమలు చేస్తారు. ప్రత్యర్థులను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల నేతలు ముందుంటారు.ముఖ్యంగా జగన్ ఈ విషయంలో ఆరితేరి పోయారు. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదాను అడ్డం పెట్టుకొని ఎన్డీఏ నుంచి చంద్రబాబును దూరం చేయగలిగారు. తాను ఎన్డీఏలో చేరకుండానే బిజెపికి దగ్గరయ్యారు. గత ఎన్నికల్లో ఎంత లబ్ధి పొందాలో.. అన్ని రకాలుగా పొందారు. అప్పట్లో హోదా విషయంలో జగన్ ట్రాప్ లో పడవద్దని మోడీ సూచించినా చంద్రబాబు వినలేదు. మూల్యం చెల్లించుకున్నారు.

గత ఐదు సంవత్సరాలుగా వెంట పడడంతో బిజెపి మెత్తబడింది. తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో చేర్చుకుంది. ఇటీవల ప్రధాని మోదీ ఏపీకి వచ్చారు. చంద్రబాబుతో వేదిక పంచుకున్నారు. ఇప్పుడు కూడా జగన్ ట్రాప్ లో పడవద్దని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. షర్మిల, జగన్ ఒక్కటేనని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకే షర్మిలను కాంగ్రెస్ పార్టీ ప్రయోగించిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయితే అప్పటివరకు షర్మిలను చంద్రబాబు ప్రయోగిస్తున్నారు అన్న ప్రచారం జరిగింది. అయితే ప్రధాని మోదీ హెచ్చరికలతో అదో ట్రాప్ గా తేలింది.దీని వెనుక జగన్ ఉన్నారన్న అర్థం బయటపడింది.

ఇప్పుడు వాలంటీర్ల విషయంలో సైతం జగన్ ఒక రకమైన ఆలోచనతో ఉన్నారు. వాలంటీర్లు అంతా వైసిపి సానుభూతిపరులే. కచ్చితంగా వారు ఎన్నికల్లో వైసీపీకి సహకరిస్తారు. ప్రత్యక్ష, పరోక్ష ప్రచారానికి దిగుతారు. కేసుల్లో ఇరుక్కుంటారు. చాలామంది ఉద్యోగాలు నుంచి తొలగించబడతారు. ఎలక్షన్ కమిషన్ తో పాటు కోర్టులు సైతం కలుగజేసుకుంటాయి. ఈ రెండు నెలలకు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టాలన్న ఆదేశాలు, తీర్పులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలా రావాలని జగన్ సైతం కోరుకుంటున్నారు. అప్పుడే ప్రజల్లోకి ఇదో ప్రాధాన్యత అంశంగా తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు తెచ్చేందుకు వాలంటీర్ వ్యవస్థను తాను ప్రారంభిస్తే.. విపక్షాలు దూరం చేశాయని ప్రజల నుంచి సానుభూతి వచ్చేలా జగన్ తప్పకుండా ప్రచారం చేస్తారు. అయితే ఇది పూర్తిగా జగన్ ట్రాప్ గా కనిపిస్తోంది. కానీ విపక్షాలు మాత్రం అదే పనిగా వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్నాయి. ఎల్లో మీడియా సైతం వారినే టార్గెట్ చేసుకుంది. పరోక్షంగా జగన్ ట్రాప్ నకు సహకరిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version