Suryakumar Yadav And Shubman Gill: ఈ శీర్షిక చదివి సూర్య అభిమానులు, గిల్ అభిమానులు మా మీద ఆగ్రహం వ్యక్తం చేసినా పర్వాలేదు. ఇంకా ఏ రకంగా నైనా తిట్టుకున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే వీరిద్దరూ ఆడుతున్న తీరు అలా ఉంది మరి. వాస్తవానికి సూర్య కంటే మెరుగైన, గిల్ కంటే సమర్థులైన ఆటగాళ్లు జట్టులో చాలామంది ఉన్నారు. కానీ వీరిద్దరి కోసం వారంతా కూడా రిజర్వు బెంచ్ కు పరిమితం కావలసి వస్తోంది.
టి20 అనేది అత్యంత వేగవంతమైన క్రికెట్. చూస్తుండగానే వికెట్లు తీయాలి. స్వల్పకాలంలోనే వేగంగా పరుగులు తీయాలి.. అలా పరుగులు తీస్తూ ప్రత్యర్థి జట్టు మీద ఒత్తిడి పెంచాలి. అలాంటి ప్లేయర్లే టి20 ఆడాలి. సూర్య కుమార్ యాదవ్ వేగవంతమైన ప్లేయర్. చూస్తుండగానే విధ్వంసం సృష్టించే ఆటగాడు. గిల్ కూడా అటువంటివాడే. వీరిద్దరూ ఐపీఎల్లో ఎన్నో విధ్వంసాలను సృష్టించారు. టీమిండియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించారు.. అదే అటువంటి ఈ ఆటగాళ్లు ఇప్పుడు దారుణంగా ఆడుతున్నారు.. జట్టు భారాన్ని మోయాల్సిన వారు.. జట్టుకు భారంగా మారుతున్నారు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా తో టీమ్ ఇండియా టి20 సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్లో విజయం సాధించింది. రెండో మ్యాచ్లో దారుణంగా ఓడిపోయింది. తొలి మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసి అదరగొడితే.. రెండో మ్యాచ్ లో చెత్త బౌలింగ్ వేసి విమర్శలు మూట కట్టుకుంది. బ్యాటింగ్లో సూర్య కుమార్ యాదవ్, గిల్ వరుసగా విఫలమవుతూనే ఉన్నారు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మరోసారి సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యాడు. గిల్ అయితే ఏకంగా సున్నా చుట్టాడు. దీంతో వీరిద్దరి చుట్టూ చర్చ మొదలైంది. అసలు వీరికి టి20 లలో అవసరమా అనే ప్రశ్న ఎదురవుతోంది.
గత 14 t20 లలో గిల్ కేవలం 263 పరుగులు మాత్రమే చేశాడు. సూర్య కుమార్ యాదవ్ తన చివరి 20 మ్యాచ్లలో కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరి కోసం ఫామ్ లో ఉన్న సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ బలవుతున్నారు. సంజు శాంసన్ ను జట్టులోకి తీసుకుంటున్నప్పటికీ.. అతడికి తుది జట్టులో ఆడే అవకాశం లభించడం లేదు. మరోవైపు యశస్వి జైస్వాల్ పరిస్థితి మరింత ఘోరం. గిల్ కోసం అతడిని టీ20 జట్టులోకి ఎంపిక కూడా చేయడం లేదు. ఇప్పటికైనా కోర్సు గౌతమ్ గంభీర్ గిల్ మీద, సూర్య కుమార్ యాదవ్ మీద విపరీతమైన ప్రేమను తగ్గించి.. జట్టు ప్రయోజనాల కోసం ఆడే ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలని అభిమానులు కోరుతున్నారు.