https://oktelugu.com/

Cristiano Ronaldo: రొనాల్డో.. 100 కోట్లు.. ఇదేం రికార్డు బాబోయ్..

ఫుట్ బాల్ దిగ్గజం రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోర్చుగల్ దేశానికి చెందిన ఈ ఆటగాడు సమకాలిన ఫుట్ బాల్ లో అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 13, 2024 / 07:28 PM IST

    Cristiano Ronaldo(1)

    Follow us on

    Cristiano Ronaldo: మైదానంలో రొనాల్డో సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి ఆటగాళ్ల ఎత్తులను చిత్తు చేస్తూ గోల్స్ సాధించడంలో ఇతడు నేర్పరి. సంపాదనలోనూ సరికొత్త ఘనతను సృష్టించిన ఆటగాడు.. అటువంటి ఈ దిగ్గజం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ సంచలనం సూచిస్తున్నాడు. సామాజిక మాధ్యమంలో ఉన్న ఖాతాలన్నింటిలో ఇతడి ఫాలోవర్ల సంఖ్య 100 కోట్లను దాటింది. సామాజిక మాధ్యమాలలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఇతడే కావడం విశేషం. దీంతో తన అభిమానులకు రొనాల్డో కృతజ్ఞతలు తెలిపాడు. దానికి సంబంధించి ఒక పోస్ట్ కూడా చేశాడు. ” మీ సహకారంతో ఒక చరిత్ర సృష్టించాం. 100 కోట్ల మంది నన్ను అనుసరిస్తున్నారు. ఇది సంఖ్య అనడాన్నే నేను ఒప్పుకోను. ఇది మీ ప్రేమాభిమానాలకు నిలువెత్తు ప్రతీక. నా ప్రయాణం మడైరా వీధి నుంచి ప్రారంభమైంది. సోషల్ మీడియాలో మీ అభిమానం నన్ను ప్రపంచంలోనే అతిపెద్ద వేదికకు మార్చింది.. నేను నా కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని మీకోసం ఆడాను. నాకోసం 100 కోట్ల మంది ఉన్నారు. నా ఓటమి, గెలుపు, ప్రతి అంశంలో మీరు నాతో నిలబడ్డారు. ఇది నాది మాత్రమే కాదు.. మనందరి ప్రయాణం. ఇలా సంయుక్తంగా ఉండడం వల్లే ఇదంతా సాధించాం. దాన్ని ప్రపంచానికి నిరూపించాం. నాపై విశ్వాసాన్ని ఉంచినందుకు మీకు ధన్యవాదాలు. నాకు అన్ని సమయాలలో అండగా ఉన్నందుకు.. నా జీవితంలో ఒక భాగమైనందుకు మీకు నా నిండు మనసుతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. నేను ఇంకా మెరుగైన ఆట ఆడాలి. మరిన్ని గెలుపులు సొంతం చేసుకోవాలి.. అనితర సాధ్యమైన ఘనతను సృష్టించాలని” రొనాల్డో రాసుకొచ్చాడు.

    యూట్యూబ్లోకి ప్రవేశం

    రొనాల్డో ఇటీవల యూట్యూబ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి అడుగుపెడుతూనే పెను ఫంక్షన్లను సృష్టించాడు. అతడు తన ఛానల్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే పాల్గొన్న సంఖ్య కోటి దాటింది. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఖాతాను ఆరు కోట్లకు పైగా నెటిజన్లు అనుసరిస్తున్నారు.. ఇన్ స్టా గ్రామ్ లో 63.9 కోట్ల మంది ఫాలో అవుతున్నారు..ఎక్స్ లో 11.3 కోట్ల మంది, ఫేస్ బుక్ లో 17 కోట్ల మంది అనుసరిస్తున్నారు. యూట్యూబ్లో తన సంబంధించిన అంశాలను రొనాల్డో ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటున్నాడు. మ్యాచ్ లు ఆడేందుకు వెళ్లిన ప్రదేశాల గురించి, మైదానంలో తన ప్రదర్శన గురించి వివరిస్తున్నాడు. రొనాల్డో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడం పట్ల అతడి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన ఆటగాడికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. రొనాల్డో ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయాలని వారు కోరుకుంటున్నారు.