Shubman Gill vs Virat Kohli: టీమిండియాలో విరాట్ కోహ్లీకి తిరుగులేదు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అతడు పరుగులు చేస్తాడు. బౌలర్ ఎవరనేది లెక్క పెట్టడు. మైదానం ఎలాంటిదనేది చూడడు. ఏమాత్రం వెరవకుండా బ్యాటింగ్ చేస్తాడు. బీభత్సంగా పరుగుల వరద పారిస్తూ ఉంటాడు.
అందువల్లే విరాట్ కోహ్లీని ఈ కాలపు విస్పోటన శక్తి అని పిలుస్తుంటారు. విరాట్ కోహ్లీ మరికొద్ది రోజులు సుదీర్ఘ ఫార్మాట్ లో ఉంటాడని అనుకుంటుంటే.. అతడు అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్ నుంచి వై దొలుగుతున్నట్టు ప్రకటించాడు. దీంతో ఇంగ్లీష్ జట్టుతో సిరీస్ లో అతడు లేకుండానే భారత్ ఆడుతోంది. విరాట్ కంటే ముందు టీం ఇండియా సారథి రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక విరాట్ గతంలో ఆంగ్ల జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఏకంగా సిరీస్ అందించే ప్రయత్నం చేశాడు. అనుకోకుండా కరోనా రావడం.. చివరి టెస్ట్ నిలిపివేయడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. తదుపరి మ్యాచ్ కొంతకాలం తర్వాత నిర్వహించారు. ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోవడంతో సిరీస్ దక్కే అవకాశం లేకుండా పోయింది. ద్రవిడ్ ఆధ్వర్యంలో భారత్ 2007లో ఇంగ్లీషులో టెస్టు సిరీస్ నెగ్గింది. ఆ తర్వాత మరోసారి ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. విరాట్ నాయకత్వంలో సిరీస్ విజయానికి దగ్గరగా వచ్చినప్పటికీ.. అనుకోకుండా ఎదురైన ఓటమి సిరీస్ విజయాన్ని దూరం చేసింది. ఇప్పుడిక గిల్ నాయకత్వంలో భారత్ ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అంతేకాదు గిల్ విరాట్ కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ చేయబోతున్నాడు.
Also Read: Virat Kohli : కోహ్లీ స్థానాన్ని టెస్టులలో ఎవరు భర్తీ చేస్తారు?
అంచనాలు అందుకుంటాడా..
ఓపెనర్లలో ఎవరో ఒకరు లేదా ఇద్దరు విఫలమైనప్పుడు విరాట్ కోహ్లీ రంగంలోకి దిగేవాడు. మైదానంలో ఉన్న పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ బ్యాటింగ్ చేసేవాడు. సమర్థవంతమైన బౌలర్లను సైతం పటిష్టంగా ఎదుర్కొనేవాడు. ఏమాత్రం భయపడకుండా బ్యాటింగ్ చేసేవాడు. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ స్థానంలో గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓపెనర్ గా వస్తాడని ప్రచారం జరిగినప్పటికీ.. అతడిని వన్ డౌన్ వికెట్ గా ఆడించే అవకాశం కనిపిస్తోంది. గిల్ కూడా దానికి సుముఖత వ్యక్తం చేశాడు. ఇంగ్లీష్ జట్టు మీద గిల్ కు ఆశించిన స్థాయిలో రికార్డు లేకపోయినప్పటికీ.. ప్రస్తుతం సారధిగా ఉన్న నేపథ్యంలో అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు
ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా గిల్ మెరుగ్గానే బ్యాటింగ్ చేశాడు. భారీగా పరుగులు చేయలేకపోయినప్పటికీ మైదానంలో ఉన్న పరిస్థితులను అతడు అర్థం చేసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే బ్యాటింగ్ చేశాడు. గతంలో గిల్ లో అంతగా సమయోచితం కనిపించకపోయేది. కానీ ఇప్పుడు అతడు అత్యంత సమర్థవంతంగా బ్యాటింగ్ చేయడం భారత జట్టుకు లాభం చేకూర్చుతుందని విశ్లేషకులు అంటున్నారు..” విరాట్ స్థానంలో గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒకప్పటిలాగా గిల్ జట్టులో సభ్యుడు మాత్రమే కాదు.. జట్టును నడిపించే నాయకుడు కూడా. అలాంటప్పుడు అతని మీద ఒత్తిడి ఉంటుంది. అదే సమయంలో బాధ్యత కూడా ఉంటుంది. ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటే అతడికి తిరుగుండదని” సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరి విరాట్ స్థానాన్ని గిల్ ఎలా భర్తీ చేస్తాడనేది చూడాల్సి ఉంది.
రెండు పర్యాయాలు మాత్రమే ఆడాడు..
ఇంగ్లీష్ గడ్డ మీద గిల్ రెండు పర్యాయాలు మాత్రమే ఆడాడు. రెండు సందర్భాల్లోనూ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ దిశగా వెళ్లే బంతులను అనవసరంగా వేటాడి మూల్యం చెల్లించుకున్నాడు. అయితే ఈసారి తన లోపాన్ని సరి చేసుకోవడానికి గిల్ తీవ్రంగా ప్రయత్నించాడు. మైదానంలో తీవ్రంగా శ్రమించాడు. బౌలర్లను మార్చి మార్చి తన మీదికి ప్రయోగించుకున్నాడు. అయితే ఈసారి సమర్థవంతంగా బ్యాటింగ్ చేసే దిశగానే గిల్ ప్రాక్టీస్ చేశాడని సహచర ప్లేయర్లు అంటున్నారు.