Virat Kohli : విరాట్ కోహ్లీ వన్డే, టి20 మాత్రమే కాదు.. టెస్టులలో కూడా తనదైన మార్క్ ప్రదర్శించాడు. సచిన్ టెండూల్కర్, రాహు ద్రావిడ్ అనంతరం ఆస్థాయిలో ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అందువల్లే అతడు టీమిండియాలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ గా అవతరించాడు. ధోని టెస్ట్ ఫార్మాట్ నుంచి వీడ్కోలు తీసుకునే సమయం నాటికి.. టీమిండియా పరిస్థితి అత్యంత అద్వానంగా ఉంది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు స్వీకరించాడు. ఆ తర్వాత తనదైన దూకుడుతో జట్టును ముందుకు నడిపించాడు. టెస్టులలో ఏకంగా ప్రథమ స్థానం దక్కించుకునేలా చేశాడు. అతని ఆధ్వర్యంలో టీమిండియా అత్యధికంగా విజయాలు సాధించింది. టీమ్ ఇండియా టెస్ట్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన సారధిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ధోని వల్ల కానిది.. సచిన్ చేయలేనిది.. గంగూలీ నిరూపించలేనిది.. విరాట్ కోహ్లీ చేసి చూపించాడు. ఇంకాస్త సమయం అతడు టెస్ట్ క్రికెట్ ఆడితే ఇంకా బాగుండేది. కాకపోతే అతడు అనుకోని విధంగా టెస్ట్ క్రికెట్ కు శాశ్వత వీడ్కోలు పలకడం సగటు అభిమానిని ఇప్పటికీ ఆందోళనకు గురి చేస్తోంది.
Also Read : కనివిని ఎరుగని రేంజ్ లో డబ్ల్యూటీసీ ప్రైజ్ మనీ .. ఐసీసీ ఎంతకు పెంచిందంటే?
ఎవరు ఆస్థానాన్ని భర్తీ చేస్తారు
విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకున్న తర్వాత.. ఆస్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టెస్టులలో ముఖ్యంగా టీమ్ ఇండియాలో బ్యాటింగ్ లైన్ అప్ విషయానికి వస్తే.. నాలుగో స్థానం అత్యంత కీలకమైనది. అప్పట్లో సచిన్ టెండూల్కర్.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఈ స్థానంలో బ్యాటింగ్ చేశారు. కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఆస్థానంలో గిల్, కె.ఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, కరణ్ నాయర్, సాయి సుదర్శన్ పేరు వినిపిస్తున్నాయి.. అయితే నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తేనే బాగుంటుంది అని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గిల్ ఓపెనర్ గా.. సర్ఫరాజ్ ఐదవ స్థానంలో, కరుణ్ నాయర్ వన్ డౌన్ లో.. వస్తే బాగుంటుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కేఎల్ రాహుల్ బలంగా ఆడగలడు. స్థిరంగా ఆడగలడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గట్టిగా నిలబడగలడు. ఎందుకంటే అతడు బంతులు ఎదుర్కొనే విధానం.. బౌలర్లను ప్రతిఘటించే విధానం సరికొత్తగా ఉంటుంది. అందువల్లే అతడు కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరి బ్యాటింగ్ ఆర్డర్ లో గౌతమ్ గంభీర్, జట్టు మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.