India Pakistan Conflict: పహల్గాం దాడి తర్వాత పాక్ పేరు వినపడితే చాలు భారత ప్రభుత్వం మండిపడుతోంది. ఎక్కడికి అక్కడ తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వమే కాదు భారత క్రికెట్ జట్టు కూడా పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపిస్తోంది. ఇటీవల ఆ దేశం వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగితే ఆడేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయలేదు.. అంతేకాదు హైబ్రిడ్ మోడ్లో దుబాయిలో ఆడింది.. ఒకరకంగా ఇది పాకిస్తాన్ దేశానికి చెంప పెట్టులాగా మారింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. పాకిస్తాన్ ఆటగాళ్లు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక మెట్టు కూడా కిందికి దిగి రాలేదు. చివరికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శనకు కూడా భారత్ అడ్డు చెప్పింది. ఐసీసీ మీద ఒత్తిడి తీసుకురావడంతో పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ పిఓకే లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శనను నిలుపుదల చేసింది.
Also Read: ఈ బంధమూ పెటాకులు.. పాపం హార్దిక్ భయ్యా.. ఏంటీ నీకు ఈ కష్టాలు?
పహల్గాం దాడి తర్వాత భారత క్రికెట్ బోర్డు పాకిస్తాన్ మీద మరింత ఆగ్రహాన్ని పెంచుకుంది. ఏ దశలో కూడా పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడకూడదని నిర్ణయించుకుంది. తటస్థ వేదికల మీద మాత్రమే అది కూడా ఐసీసీ నిర్వహించే టోర్నీలలోనే ఆడతామని భారత్ స్పష్టం చేసింది.. దీంతో రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత దిగజారిపోయాయి. అంతేకాదు సెప్టెంబర్ లో నిర్వహించే ఆసియా క్రికెట్ కప్ నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశాన్ని కూడా బీసీసీఐ నిషేధించే అవకాశం కనిపిస్తోంది.. ఎందుకంటే ఆసియా క్రికెట్ కప్ నిర్వహించే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధిపతి కొనసాగుతున్నారు.. పైగా ఈ సమావేశాన్ని ఢాకాలో నిర్వహించాలని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ తో నెలకొన్న పరిస్థితులు నేపథ్యంలో ఢాకాలో నిర్వహించే సమావేశానికి తాము హాజరుకాబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. అంతేకాదు భారత క్రికెట్ నియంత్రణ మండలి వాదనకు శ్రీలంక క్రికెట్ బోర్డు, ఓమన్ క్రికెట్ బోర్డు సమ్మతం తెలిపాయి.. ఇది ఇలా ఉండగానే పాకిస్తాన్ జట్టుకు భారత్ మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
Also Read: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మ్యాచ్ టై.. బౌలవుట్ లో ఏం జరిగిందంటే? వైరల్ వీడియో
ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా డబ్ల్యూ సి ఎల్ టి 20 క్రికెట్ లీగ్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం పాకిస్తాన్, భారత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఈ మ్యాచ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది..” ఆదివారం పాకిస్తాన్ భారత్ మధ్య హాకీ, వాలీబాల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే పాకిస్తాన్ భారత్ మధ్య వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టి20 టోర్నీలో మ్యాచ్ ప్లాన్ చేశాం. అయితే ఈ మ్యాచ్ వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని” నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు తరఫున హర్భజన్, సురేష్ రైనా, శిఖర్ ధావన్ నిరాకరించారు. ” ఏం వేళాకోళంగా ఉందా.. ఇష్టాను సారంగా షెడ్యూల్ ఏర్పాటు చేసి.. ఇలా ఆడిస్తారా.. మా అభిప్రాయాలతో మీకు సంబంధం లేదా” అని రైనా, ధావన్ నిర్వాహకుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.