GT Vs CSK: డిపెండింగ్ ఛాంపియన్ చెన్నైకి.. గుజరాత్ కోలుకోలేని షాక్.. ఆసక్తికరంగా ప్లే ఆఫ్

భారీ లక్ష్యాన్ని చేదించడంలో చెన్నై తడబడింది. మూడు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. పేలవమైన ఆటతీరును ప్రదర్శించిన రచిన్ రవీంద్ర చాలా రోజుల తర్వాత తుది జట్టులోకి వచ్చాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 11, 2024 8:20 am

GT Vs CSK

Follow us on

GT Vs CSK: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నైకి పేరు ఉంది. గత సీజన్లో ఆ జట్టు ట్రోఫీ దక్కించుకుంది. కానీ ఈసారి ఎందుకనో ఆ స్థాయిలో ఆట తీరు ప్రదర్శించలేకపోతోంది. ప్లే ఆఫ్ ముందు కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో.. చెన్నై ఓడిపోయింది.. ఈ సీజన్లో అస్థిరమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న గుజరాత్ చేతిలో ఓటమిని కొని తెచ్చుకుంది. గుజరాత్ ఆటగాళ్లు గిల్, సుదర్శన్ శతకాలు బాదడంతో.. గుజరాత్ భారీ స్కోర్ చేసింది. అనంతరం అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నై జట్టును కట్టడి చేసింది. ఈ విజయంతో గుజరాత్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 12 మ్యాచ్లలో ఆరు ఓటములతో ప్లే ఆఫ్ ఆశలను చెన్నై క్లిష్టతరం చేసుకుంది. చెన్నై జట్టు గత మ్యాచ్లో అదిరే ఆట తీరు ప్రదర్శించింది. పంజాబ్ పై అద్భుత విజయాన్ని అందుకున్న ఆ జట్టు.. గుజరాత్ చేతిలో ఓడిపోయింది. బంతితో వికెట్లు తీయలేకపోయింది.. బ్యాట్ తో పరుగులు సాధించలేకపోయింది. ఫలితంగా ప్లే ఆఫ్ ముందు గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది.

ఈ మ్యాచ్లో చెన్నై జట్టు టాస్ గెలిచింది. మైదానం పరిస్థితి అంచనా వేయలేక కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 231 రన్స్ చేసింది..గిల్ 104, సాయి సుదర్శన్ 103 శతకాలతో అదరగొట్టారు. తొలి ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టి గిల్ తన ఉద్దేశాన్ని చాటాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ కూడా దూకుడుగా ఆడాడు. చెన్నై కెప్టెన్ బౌలర్లతో రకరకాల ప్రయోగాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ దశలో సుదర్శన్ 32 బంతుల్లో అర్థ సెంచరీ, గిల్ 25 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి జోడి 13 ఓవర్లకే 160 పరుగులు చేసింది. 17 ఓవర్లో 200 దాటించింది. ఈ దశలో గుజరాత్ 250 స్కోర్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తుషార్ దేశ్ పాండే ఒకే ఓవర్ లో వీరిద్దరిని పెవిలియన్ పంపించాడు. దీంతో చివరి 3 ఓవర్లలో గుజరాత్ 22 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారీ లక్ష్యాన్ని చేదించడంలో చెన్నై తడబడింది. మూడు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. పేలవమైన ఆటతీరును ప్రదర్శించిన రచిన్ రవీంద్ర చాలా రోజుల తర్వాత తుది జట్టులోకి వచ్చాడు. అయితే అతడు ఒక్క పరుగు మాత్రమే చేసి, తొలి ఓవర్ లోనే రన్ అవుట్ అయ్యాడు. అజింక్య రహానే కూడా అతడి దారినే అనుసరించాడు. రుతురాజ్ గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. కేవలం పది పరుగులకే చెన్నై మూడు వికెట్ల కోల్పోయింది. ఈ దశలో చెన్నై జట్టును మిచెల్, మోయిన్ అలీ ఆదుకున్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడారు. మూడో వికెట్ కు 73 పరుగులు జోడించారు. నూర్ అహ్మద్ వేసిన 11 ఓవర్లో మోయిన్ అలీ హ్యాట్రిక్ సిక్సులు కొట్టాడు. ఈ దశలో చెన్నైని అతడు గెలిపిస్తాడని అందరూ భావించారు. కానీ మోహిత్ రెండు ఓవర్ల వ్యవధిలో మిచెల్, మోయిన్ ను అవుట్ చేశాడు. శివం దుబే 21, జడేజా 18 దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయ్యారు. చివర్లో వచ్చిన ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అభిమానులకు కాస్త ఆనందాన్ని పంచాడు. ఇదొక్కటే చెన్నై జట్టుకు సానుకూల అంశం. కాగా, ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానానికి చేరుకుంది. అంతేకాదు ప్లే ఆఫ్ పోరు ఆసక్తికరంగా మారింది.