Edgbaston Test Match: 500 పరుగులకు మించిన లక్ష్యం.. అప్పటికే మూడు వికెట్లు పడిపోయాయి.. ఇక చివరి రోజు మిగతా ఏడు వికెట్లు పడగొడితే విజయం మనదే.. ఇవీ రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత మీడియాలో వచ్చిన విశ్లేషణలు. వాస్తవానికి విజయం టీమిండియా సాధిస్తుందని.. మొదటి టెస్ట్ పరాజయానికి రివెంజ్ తీర్చుకుంటుందని అందరూ అనుకున్నారు. మాజీ క్రికెటర్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఆదివారం నాటికి వరుణుడు రాసిన స్క్రిప్ట్ మరో విధంగా ఉంది. విజయం మీద కన్నేసిన భారత జట్టుకు మరో విధమైన ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ కథనం రాసే సమయ వరకు రెండవ టెస్టు జరుగుతున్న ఎడ్జ్ బాస్టన్ వేదికలో వర్షం కురుస్తోంది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.. వర్షం కురవడం వల్ల దాదాపు ఇప్పటికే గంట ఆట తుడిచిపెట్టుకుపోయింది. గంట ఆట అంటే దాదాపు ఒక సెషన్ లో సగం అన్నమాట. ఒకవేళ అనుకున్నట్టు మ్యాచ్ జరిగితే.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి ఉంటే.. ఇంగ్లాండ్ కొన్ని వికెట్లు కోల్పోయి ఉండేది.
Also Read: ఇంగ్లాండ్ 600 టార్గెట్ చేజ్ చేస్తుందా.. గత చరిత్ర ఏం చెబుతోందంటే?
వర్షం తగ్గుతుందా? లేదా? అనే ఆందోళనలు అభిమానుల్లో కొనసాగుతున్నాయి. వాస్తవానికి నాలుగో రోజు ఇంగ్లాండు జట్టు మీద భారీ ఆధిక్యాన్ని సాధించిన తర్వాత ఇండియా కెప్టెన్ డిక్లేర్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ జట్టు ఎదుట 600కు మించి పరుగుల లక్ష్యం ఉంచేదాకా గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ ఇవ్వలేదు. 500 పరుగుల లక్ష్యం వరకు వచ్చిన తర్వాత భారత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. వర్షం కురుస్తుందని ఆక్యు వెదర్ నిన్నటి నుంచి చెబుతోంది. ఆ విషయాన్ని గుర్తించి గిల్ కనక ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఉంటే మ్యాచ్ ఫలితం త్వరగా వచ్చేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఎడ్జ్ బాస్టన్ టెస్ట్: టీమ్ ఇండియాకు షాక్ తప్పదా?
ఆక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆ వెదర్ రిపోర్ట్ చెప్పినట్టుగానే అక్కడ వర్షం కురుస్తోంది. వర్షం కురవడానికి 60 శాతం అవకాశాలు ఉన్నాయని ఆక్యు వెదర్ రిపోర్టు తెలిపింది. ఆ రిపోర్టు ప్రకారం అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఆదివారం ఆకాశం మేఘావృతం అయి కనిపించింది. ఉదయం తొమ్మిది దాటిన తర్వాత మెల్లమెల్లగా చినుకులు కురిశాయి. ఇప్పుడు అక్కడ భారీగానే వర్షం కురుస్తోంది..పిచ్ పాడు కాకుండా ఉండడానికి కవర్లు కప్పారు. అయితే వర్షం తగ్గిన తర్వాత పిచ్ ను ఆరబెట్టడానికి అర్థగంట వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఇండియా కీలకమైన ఆటను కోల్పోయినట్టే. ఒకవేళ వర్షం గనుక అదే తీరుగా కురిస్తే మ్యాచ్ డ్రా అవుతుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.