Immadi Ravi Ibomma: ఐ బొమ్మ.. ఈ పేరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దొంగ చాటుగా ఆన్లైన్లో తెలుగు సినిమాలను చూసే వాళ్లకు ఐ బొమ్మ చాలా వరకు సుపరిచితం. ఆన్లైన్లో సినిమాలను పైరసీ చేసి.. అందుబాటులో ఉంచే సైట్లు చాలా ఉన్నప్పటికీ.. ఐ బొమ్మ కు మాత్రం ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఇది అద్భుతమైన క్వాలిటీతో సినిమాలను అందుబాటులో ఉంచుతుంది.. పైగా దీనిని ట్రేస్ చేయడానికి.. సినిమాలను ఆపుదల చేయడానికి నిర్మాతలు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో నిర్మాతలు తలలు పట్టుకొని.. చేసేదేం లేక వదిలేశారు.
హైదరాబాద్ పోలీసుల కృషి వల్ల ఐ బొమ్మ నిర్వాహకుల ఆగడాలు ఆగిపోయాయి. ముఖ్యంగా ఐ బొమ్మ కు కర్త కర్మ క్రియ లాంటి రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.. అతడు ఎక్కడో ఆఫ్రికాలోని ఓ దీవిలో ఉంటున్నాడు.. అతడికి గతంలోనే వివాహం జరిగింది. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు.. అతడు అక్కడ నుంచి ఫ్రాన్స్ కి వచ్చాడు. ఫ్రాన్స్ నుంచి ఇండియాలో అడుగు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. అతడి ఖాతాలో దాదాపు మూడు కోట్ల వరకు నగదు ఉంది. ఆ నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఐ బొమ్మ ద్వారా సినిమాలు చూసే సినీ ప్రేమికులు.. ఆ సంస్థ నిర్వాహకుడిని ఇంతవరకు చూడలేదు. అయితే తొలిసారి రవిని తెలంగాణ పోలీసులు బయటి ప్రపంచానికి చూపించారు.
రవికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అతడిని శనివారం ఉదయం కూకట్పల్లిలోని సిసిఎస్ పోలీసులు తీసుకెళ్తుండగా కొంతమంది ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా ఆఫ్రికాలోని కరేబియన్ దీవులలో రవి ఉంటున్నాడు. ఐ బొమ్మ పేరుతో సైట్ నిర్వహిస్తున్నాడు. అది తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన నిర్మాతలకు ఇబ్బందికరంగా మారింది. ఐ బొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. అతడికి మద్దతుగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అధిక టికెట్ ధరలు పెట్టి సినిమా చూడలేని వారికి ఇటువంటి సైట్లే దిక్కని పేర్కొంటున్నారు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ ధరలు కూడా భారీగా ఉంటున్నాయని చెబుతున్నారు.
వాస్తవానికి ఐ బొమ్మ వరకు అతడు పరిమితమైతే బాగానే ఉండేది. అయితే రవి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కోట్లల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అందువల్లే పోలీసులు అరెస్టు చేసామని చెబుతున్నారు. అతడి ఖాతాలో మూడు కోట్ల వరకు నగదు ఉంది. అయితే ఇంకా బినామీ ఖాతాలలో ఏ స్థాయిలో నగదు ఉందో తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.