Arjun Tendulkar five-wicket haul: ఆరడుగుల ఎత్తు.. అంతకుమించిన శరీర సౌష్టవం.. వేగంగా బంతులు వేస్తాడు.. అదే సమయంలో ప్రత్యర్థి ఆటగాడిని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా.. ఎక్కడో బ్యాడ్ లక్ అతడి కెరియర్ మొత్తాన్ని ఎదురు తంతోంది.. వాస్తవానికి అతని స్థానంలో మరో ఆటగాడు గనుక ఉంటే ఎప్పుడో బ్యాగ్ సర్దుకునేవాడు. కాకపోతే అతడు సచిన్ కుమారుడు కాబట్టి అవకాశాలు వస్తున్నాయి. ఐపీఎల్ లో ముంబై జట్టు మేనేజ్మెంట్ ఇప్పటికీ అర్జున్ టెండూల్కర్ కు అవకాశాలు ఇస్తోంది అంటే దానికి ప్రధాన కారణం సచిన్ లెగసీనే. అయితే ఈసారి మాత్రం సచిన్ పేరు లేకుండానే అర్జున్ వెలుగులోకి వచ్చాడు. తనలో కూడా టాలెంట్ ఉందని.. అవకాశం కల్పిస్తే నూటికి నూరు శాతం న్యాయం చేస్తానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ కు సంబంధించిన ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ సచిన్ కుమారుడు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కొన్ని సందర్భాలలో అతడు రాణించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ వికెట్లు దక్కలేదు. స్వతహాగా బౌలర్ అయిన అర్జున్ తనను తాను మలచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి యువరాజ్ సింగ్ తండ్రి వద్ద కూడా తర్ఫీదు పొందాడు. అయినప్పటికీ కెరియర్లో అంతగా ఊపు రాలేదు. సచిన్ చొరవ తీసుకుంటే తప్ప అవకాశాలు రావడం లేదు. ఇలాంటి క్రమంలో ఏదైనా అద్భుతం జరగబోతుందని అర్జున్ ఎదురుచూస్తున్నాడు. అతడు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. మొత్తానికి అతని కెరియర్ ఒకసారిగా మలుపు తిరిగింది. ఇది అర్జున్ కంటే కూడా సచిన్ కే ఎక్కువ ఆనందాన్ని ఇస్తోంది.
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ కే తిమ్మప్పయ్య మెమోరియల్ ఇన్విటేషన్ టోర్నీ నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో అనేక దేశవాళి జట్లు పాల్గొంటున్నాయి.ఈ జట్లలో గోవాకు సచిన్ కుమారుడు అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సచిన్ కుమారుడు బౌలర్గా అందరికి సుపరిచితుడే. అయితే తొలిసారి అతడు తనలో ఉన్న బ్యాటర్ ను కూడా వెలుగులోకి తీసుకొచ్చాడు. మహారాష్ట్రలో జరిగిన మ్యాచ్లో అతడు 14 ఓవర్లు వేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. అర్జున్ దూకుడు వల్ల మహారాష్ట్ర 136 పరుగులకే ఆల్ ఔట్ అయింది. గోవా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 333 పరుగులు చేసింది. అభినవ్, మిశాల్ అర్థ సెంచరీలు చేసి అదరగొట్టారు. గోవా ఇన్నింగ్స్ లో అర్జున్ కూడా తన సత్తా ప్రదర్శించాడు. పరుగులు చేసి అదరగొట్టాడు. ఇటీవల అర్జున్ ముంబై వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆమె జీవితంలోకి రావడమే ఆలస్యం అర్జున్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. కెరియర్ లో కూడా కదలిక వచ్చింది. దేశవాళీ క్రికెట్లో అతడు ప్రస్తుతం చూపిస్తున్న సత్తా సమూల మార్పుకు సంకేతం అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీలో అతడు బ్యాట్.. బంతితో ఆకట్టుకోవడంతో సచిన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సానియా రాకతో అతడి జీవితం మారిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్లో అతడు తొలి బంతికే వికెట్ పడగొట్టడాన్ని గొప్ప విషయంగా భావిస్తున్నారు.
Arjun Tendulkar Took Five Wicket in a Local Tournament after returning To The Cricket after 7 Month. pic.twitter.com/G7RWzxaGhI
— яιşнí. (@BellaDon_3z) September 10, 2025