T20 World Cup 2024: భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. ఫ్యాన్స్ కు ఐసీసీ అదిరిపోయే గిఫ్ట్..

భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ను పురస్కరించుకొని ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం నిర్వాహకులు ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో భారత్ నుంచి వచ్చి స్థిరపడిన వారు చాలామంది ఉన్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 18, 2024 10:02 am

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: మరికొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ కప్ కు ఈసారి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటికే ఇందుకే సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అమెరికాలో యుద్ధ ప్రాతిపదికన ఐసీసీ క్రికెట్ మైదానాలను నిర్మించింది. వెస్టిండీస్ ప్రాంతంలోనూ మైదానాలను అత్యాధునికంగా రూపొందించింది. జూన్ రెండున వరల్డ్ కప్ ప్రారంభమవుతున్నప్పటికీ.. అశేష క్రికెట్ అభిమానుల కళ్ళు మాత్రం జూన్ 9న జరిగే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పై ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ న్యూయార్క్ లోని నసావు క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ వరల్డ్ కప్ టోర్నీకే హైలెట్ గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ కు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఐసీసీ అభిమానులకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది.

భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ను పురస్కరించుకొని ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం నిర్వాహకులు ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో భారత్ నుంచి వచ్చి స్థిరపడిన వారు చాలామంది ఉన్నారు. వారి విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని లైవ్ మ్యాచ్ చూస్తున్న అనుభూతి కలిగించేందుకు ఈ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నట్టు స్టేడియం నిర్వాహకులు వెల్లడించారు. దీనికి ఐసీసీ అనుమతి కూడా ఇచ్చిందని వారు చెబుతున్నారు. ఈ స్టేడియం కెపాసిటీ దాదాపు 20,000 కాగా.. మ్యాచ్ చూసేందుకు పదివేల మందికి పైగా రావచ్చని స్టేడియం నిర్వాహకులు అంచనా వేస్తున్నారు..ఫ్యాన్ పార్క్ కోసం ఐసీసీ అనుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి.. ఈ మ్యాచ్ చూసేందుకు పాకిస్తాన్, భారత జట్లకు చెందిన పలువురు మాజీ ఆటగాళ్లు వస్తారని తెలుస్తోంది.

2019 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఈ వేదికపై మ్యాచ్ జరిగింది. అప్పుడు అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో అభిమానులు మ్యాచ్ ను ఆదరిస్తారని స్టేడియం నిర్వాహకులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఫ్యాన్ పార్క్ కు సంబంధించి టికెట్ ధర ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని వారు అంటున్నారు. ఇక ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు న్యూయార్క్ నసావు స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిని ఇటీవల ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్, వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ ఉస్సేన్ బోల్ట్ ఇటీవల ప్రారంభించాడు. ఈ మైదానం న్యూయార్క్ ఈస్ట్ మేడ్ లోని ఐస్ అండ్ హోవర్ పార్కులో నిర్మించారు. ఈ మైదానం కెపాసిటీ 34 వేలు. బౌండరీ లైన్ ముంబైలోని వాంఖడే మైదానాన్ని పోలి ఉంటుంది. ఈ స్టేడియంలో బౌండరీ లైన్ ప్రధాన మైదానం నుంచి నలువైపులా 65 నుంచి 70 మీటర్లకు కాస్త అటూ ఇటూగా ఉంటుంది.. ఈ మైదానం భారత్ పాకిస్తాన్ మాత్రమే కాకుండా.. ఇంకా ఎనిమిది మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తుంది.