Jasprit Bumrah: బుమ్ బుమ్ బుమ్రా.. బౌలింగ్ కు క్రికెట్ దిగ్గజాల ఫిదా

జస్ ప్రీత్ బుమ్రా.. ఈ టీమిండియా ఏస్ బౌలర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. తన బ్యాటింగ్ తోనూ అప్పుడప్పుడూ మెరుపులు మెరిపించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 20, 2024 6:03 pm

Jasprit Bumrah

Follow us on

Jasprit Bumrah: క్రికెట్ లో ఒక ఆటగాడి ప్రతిభను.. మరొక ఆటగాడు కొనియాడటం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది. కానీ ఈ ఆటగాడు మాత్రం ఆ వరుసలో ఉండడు.. అతడికి ప్రత్యేకంగా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇతడి బౌలింగ్ వైవిధ్యంగా ఉంటుంది. విభిన్నంగా కనిపిస్తుంది. మైదానానికి తగ్గట్టుగా అతని బౌలింగ్ మారుతుంది. మందకొడి మైదానంపై స్వింగ్ అవుతుంది. తేమ ఉన్న మైదానంపై దూసుకు వస్తుంది. మొత్తంగా వికెట్లను గిరాటేస్తుంది. లేదా ఆటగాడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకుంటుంది. గతి తప్పితే క్యాచ్ అవుట్ గా మారుతుంది. స్ట్రైకర్ నిగ్రహాన్ని కోల్పోతే మరో రూపంలో ఔట్ కు దారితీస్తుంది. మొత్తంగా అతడి బౌలింగ్ అర్థమయ్యేలోపే చేయాల్సిన నష్టం చేసి వెళ్లిపోతుంది. అప్పటికి పెవిలియన్ చేరుకోవడం ఒకటే మిగులుతుంది. ఇంతటి గొప్ప బౌలింగ్ ఈ కాలంలో చూస్తున్నారు కాబట్టే అతడికి సీనియర్ ఆటగాళ్లు నీరాజనాలు పలుకుతున్నారు. వారెవ్వా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరంటే..

ఈ కాలపు స్వింగ్ మాస్టర్

జస్ ప్రీత్ బుమ్రా.. ఈ టీమిండియా ఏస్ బౌలర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. తన బ్యాటింగ్ తోనూ అప్పుడప్పుడూ మెరుపులు మెరిపించాడు. రవి శాస్త్రి దగ్గర నుంచి సునీల్ గవాస్కర్ వరకు ఇతడి బౌలింగ్ ను మెచ్చుకొని సీనియర్ ఆటగాళ్లు అంటూ లేరు. తనదైన రోజునే కాదు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయడం జస్ ప్రీత్ బుమ్రా కు బంతితో పెట్టిన విద్య. చాతిని విస్తారంగా ముందుకు తీసుకొచ్చి.. వెన్నును ఒక్కసారిగా వెనక్కి మళ్ళించి.. అంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చి.. చేతిని లాగవంగా తిప్పి.. బంతిని అలా విసిరివేయడంలో ఇతడు సిద్ధహస్తుడు. ముఖ్యంగా ఈ యార్కర్లు సంధించడంలో ఇతనికి ఇతడే సాటి. కొట్ని వాల్ష్ వేగం, మెక్ గ్రాత్ లాగా బంతిని స్వింగ్ చేయడంలో నైపుణ్యం జస్ ప్రీత్ బుమ్రా సొంతం. అందుకే అతడిని ఈ కాలపు స్వింగ్ మాస్టర్ అని పిలుస్తుంటారు.

అతడికి అతడే సాటి

ఇటీవల ఐపీఎల్ లో అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసి, వికెట్లను పడగొట్టిన ఘనతను జస్ ప్రీత్ బుమ్రా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత టి20 వరల్డ్ కప్ లోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఐర్లాండ్, పాకిస్తాన్ జట్ల మీద భారత్ గెలుపొందింది అంటే దానికి ప్రధాన కారణం జస్ ప్రీత్ బుమ్రానే. అందుకే అతడి బౌలింగ్ ను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ రాఫెల్ బిషప్ మెచ్చుకున్నారు. ” అతడి బౌలింగ్ చాలా విభిన్నంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు బౌలింగ్ చేయగలడు. అతన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇంకా చాలా కాలం పాటు అతడు క్రికెట్ ఆడతాడు. అతడు ఉన్నన్ని రోజులు భారత బౌలింగ్ దళానికి పెద్దగా ఇబ్బంది ఉండదని” వ్యాఖ్యానించారు.

నేను అతడి బౌలింగ్ కు వీరాభిమాని

సాధారణంగా వెస్టిండీస్ లెజెండరీ బౌలర్ అంబ్రోస్ ఇతర బౌలర్ల గురించి పెద్దగా వ్యాఖ్యానించడు. అక్కడిదాకా ఎందుకు ఈ ఏడాది ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ జట్టు టెస్ట్ సిరీస్ లో అసాధారణ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో వెస్టిండీస్ యువ బౌలర్ షమర్ జోసెఫ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయినప్పటికీ అతడిని అంబ్రోస్ పెద్దగా కీర్తించలేదు. ఆ విజయం తర్వాత అతడిని కలవను కూడా కలవలేదు. కానీ, బుమ్రా ఈ మధ్య ఆంటీగ్వా కు వచ్చినప్పుడు పలుమార్లు ఆంబ్రోస్ కలిశాడు. బౌలింగ్ గురించి చర్చించాడు. ఇదే విషయాన్ని ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు.” అతని బౌలింగ్ గొప్పగా ఉంటుంది. తన యాక్షన్ అసలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ గాయం అయితే తప్ప ఎటువంటి మార్పు చేయాల్సిన పరిస్థితి లేదు. అతడిని తొలిసారిగా నేను చూసినప్పుడు అభిమానిగా మారిపోయాను. ప్రతిభావంతమైన బౌలింగ్ చేస్తుంటాడు. అతనిలో నాకు ఆ టాలెంట్ నచ్చింది.. సంప్రదాయ బౌలర్లకు భిన్నంగా అతడు ఉన్నాడు. అతడు అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతని బౌలింగ్ ను నేను పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నానని” ఆంబ్రోస్ పేర్కొన్నాడు. అన్నట్టు ఆంబ్రోస్ మరెవరో కాదు.. వెస్టిండీస్ జట్టు ప్రపంచ క్రికెట్ పై పెత్తనం చెలాయిస్తున్నప్పుడు కీలక బౌలర్ గా ఉన్నాడు. అత్యంత వేగవంతమైన బంతులు వేసి.. ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు.