CM Revanth Reddy: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవంబర్ 11న జరుగున్నాయి. దీంతో ప్రచారం ఊపందుకుంది. మూడు పార్టీలు ఈ స్థానం తమ ఖతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్ సర్వశక్తుల ఒడ్డుతోంది. ఇక అధికార కాంగ్రెస్ ఇక్కడ గెలవకపోతే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తోంది. ఇక బీజేపీ తెలంగాణలో బలపడుతోందని నిరూపించాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. ఈతరుణంలో హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో కవితపట్ల జరిగిన అన్యాయంపై స్పందిస్తూ, ‘‘తన సోదరినే కాపాడుకోలేని నాయకుడు ప్రజల కోసం ఎలా నిలుస్తాడు?’’ అంటూ ప్రశ్నించారు. కవితపై రేవంత్ సానుకూలత ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కుటుంబ కలహాలపై రాజకీయ దెబ్బ
రేవంత్ ప్రకారం, కేటీఆర్ కుటుంబంలో ఆస్తి వివాదం కవితను తీవ్ర బాధకు గురిచేసిందన్న వార్తలు వాస్తవమని సూచించారు. కవిత కన్నీళ్లు కార్చడం ప్రజల ఎదుట కేటీఆర్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి తీసుకువచ్చిందని చెప్పుకొచ్చారు. అంతర్గత కుటుంబ వ్యవహారమైనా, ఆ వ్యక్తి ప్రజా నాయకుడైనప్పుడు ఆయన విలువలు సమాజానికి ఆదర్శమా కాదా అనేది ప్రశ్నించాల్సిన అంశమని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్–బీజేపీ రహస్య బంధం?
ప్రసంగంలో రేవంత్ మరోసారి బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఉన్న ‘‘రహస్య ఒప్పందం’’ ఉందని మరోసారి స్పష్టం చేశారు. రాజకీయ లాభాల కోసం ఇరుపార్టీలు ఓ ముసుగు ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. కవితపై జరుగుతున్న దర్యాప్తు, ఆస్తుల వివాదం ఇవన్నీ ఆ అంతర్గత అజెండాలో భాగమని ఆయన ఆరోపించారు. కవిత కూడా ఇదే విషయం చెప్పారని గుర్తు చేశారు. ఇటీవలి భేటీల్లో కవిత చేసిన పరోక్ష వ్యాఖ్యలు కూడా ఈ వివాదానికి కొత్త మలుపు ఇచ్చాయి. ఆమె ‘‘ఎవరైనా తమ మరిది ఫోన్ ట్యాప్ చేయిస్తారా?’’ అనే ప్రశ్నతో రాజకీయ వర్గాల్లో చర్చ చెలరేగింది. ఈ వ్యాఖ్య నేరుగా కేటీఆర్‌ను ఉద్దేశించిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్‌కు మద్దతు కోరిన రేవంత్
ప్రసంగం చివరలో రేవంత్ జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్దేశించి కాంగ్రెసుకు మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, పారదర్శక పాలన, జవాబుదారీ వ్యవస్థ తన ప్రభుత్వ లక్ష్యమని హామీ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రసంగం కాకుండా, బీఆర్‌ఎస్ అంతర్గత పరిస్థితులను బహిర్గతం చేసిన రాజకీయ వ్యూహంగా భావిస్తున్న విశ్లేషకులు చెబుతున్నారు. కవితకు మద్దతుగా నిలవడం కేటీఆర్ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉంది.