CM YS Jagan : క్రీడా సంరంభాన్ని మోగించిన సీఎం జగన్

ఇకపోతే ఎప్పటికప్పుడు రాష్ట్రంలో క్రీడా పోటీలను నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో వంటి ఆటలతోపాటు మూడు కిలో మీటర్ల మారథాన్, యోగా, టెన్నికాయిట్ వంటి సాంప్రదాయేతర పోటీలు నిర్వహణకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Written By: BS, Updated On : June 15, 2023 7:27 pm
Follow us on

CM YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో క్రీడా సంరంభాన్ని మోగించారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను వెలికి తీసే చర్యలను అధికారులు చేపట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. క్రీడా మంత్రత్వ శాఖ సంబంధించిన సమీక్ష సమావేశాన్ని గురువారం సాయంత్రం ఆయన అధికారులతో నిర్వహించారు ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలను అధికారులకు ఆయన చేశారు. గ్రామ స్థాయి నుంచే నైపుణ్యవంతమైన క్రీడాకారులను తయారు చేసేలా పటిష్టమైన చర్యలను చేపట్టాలని అధికారులకు జగన్మోహన్ రెడ్డి దిశా, నిర్దేశం చేశారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో ప్రత్యేకంగా 46 రోజులపాటు రాష్ట్రంలో క్రీడా సంరంభాలు నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలు ద్వారా క్రీడల పట్ల యువతలో ఆసక్తిని పెంచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. భారతదేశంలో కూడా గత కొన్నేళ్ల నుంచి క్రీడలకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. అయితే, అంతర్జాతీయంగా ఆశించిన స్థాయిలో దేశానికి పథకాలు రాకపోవడం కొంత నిరాశను కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలపై ప్రత్యేకంగా దృష్టి సాధించాయి. అందులో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆటగాళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
క్రీడాకారుల తయారీకి చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ సాయం.. 
ఇకపోతే రాష్ట్రంలో క్రీడాకారులు తయారీకి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులు తయారు చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ సాయం తీసుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది. క్రికెట్ లో ఆంధ్రప్రదేశ్ కు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ సహాయం అందించనుంది. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ వంటి జట్ల మేనేజ్మెంట్ సహాయాన్ని కూడా తీసుకోవడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సుముకత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఏపీ నుంచి ఒక ఐపీఎల్ టీమ్ ఉండేలా సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు మార్గదర్శనం చేశారు. ఈ జట్టులోనూ ఎక్కువ మంది ఆంధ్ర ఆటగాళ్లే ఉండేలా చూడాలని కూడా అధికారులకు సూచించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మూడు క్రికెట్ స్టేడియాల్లో క్రికెటర్లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ఆటగాళ్లలో ప్రొఫెషనలిజం పెరుగుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.
ప్రతి మండలంలో మైదానాలు ఏర్పాటు..
క్రీడాకారులను తయారు చేసేందుకు అనుగుణంగా ప్రతి మండలంలోనూ మైదానాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో క్రికెట్ పోటీలను ఆడించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని యువకులకు క్రికెటర్లు అంబటి రాయుడు, కేఎస్ భరత్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు. క్రీడాకారుల్లో ప్రొఫెషినలిజానికి ప్రాధాన్యతనివ్వాలని సీఎం అధికారులకు సూచించారు. గ్రామ స్థాయిలో క్రీడా సామాగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతులతోపాటు క్రీడా సామాగ్రితో కూడిన కిట్లను అందించాలని సూచించారు. అవుట్ డోర్ స్టేడియంతోపాటు ప్రతి నియోజకవర్గంలోనూ ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
ఈ తరహా పోటీలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలి..
ఇకపోతే ఎప్పటికప్పుడు రాష్ట్రంలో క్రీడా పోటీలను నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో వంటి ఆటలతోపాటు మూడు కిలో మీటర్ల మారథాన్, యోగా, టెన్నికాయిట్ వంటి సాంప్రదాయేతర పోటీలు నిర్వహణకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సచివాలయాల స్థాయిలో మొదలుకొని మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీలు ఉండాలని, ఇందుకోసం ‘ఆడుదాం ఆంధ్ర’ అనే పేరుతో 40 రోజులపాటు ఆటల పోటీలను నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఈ పోటీలు నిర్వహణకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఉండే మైదానాలను వినియోగించుకోవాలని ఆదేశించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన క్రీడా సమీక్ష సమావేశంలో సిఎస్ జవహర్ రెడ్డితోపాటు క్రీడల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జి వాణి మోహన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.