Homeక్రీడలుAsian Games 2023: నీచ చైనా.. ఆసియా క్రీడల ముందు వక్రబుద్ధి

Asian Games 2023: నీచ చైనా.. ఆసియా క్రీడల ముందు వక్రబుద్ధి

Asian Games 2023: ఆ దేశంలో ప్రజాస్వామ్యం కనిపించదు. అది భారతదేశాన్ని ఓర్వదు. పైగా తన ప్రయోజనాల కోసం శత్రుదేశాలకు సహాయం చేస్తూ ఉంటుంది. సరిహద్దులను ఆక్రమిస్తూ ఉంటుంది. ఇతర దేశాల ప్రాంతాలను తనవిగా చెబుతూ ఉంటుంది. భౌగోళికంగా ఉన్న వాటిని కాదని కొత్త పేర్లు పెడుతుంది. అంతర్జాతీయంగా పలు వేదికలలో లేనిపోని ఆరోపణలు చేస్తుంది.. వాటిని నిజం అనుకునేలాగా ఇతర దేశాలలో నమ్మిస్తుంది.. ఇంత ఉపోద్ఘాతం చెబుతున్నామంటే ఆ దేశం పేరేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.

పొరుగు దేశాల భూభాగాలపై కన్నేస్తూ.. అవి తమవేనంటూ ప్రకటిస్తూ.. వీలుచిక్కితే ఆక్రమణకు దిగుతూ నిత్యం కయ్యాలు పెట్టుకునే చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల ముంగిట భారత్‌ను కవ్వించే యత్నం చేసింది. శనివారం నుంచి హాంగ్జౌలో అధికారికంగా మొదలుకానున్న ఈ క్రీడలకు ముగ్గురు అరుణాచల్‌ప్రదేశ్‌ ఆటగాళ్లకు వీసాలను నిరాకరించింది. క్రీడలకు రాజకీయాలను ముడిపెట్టకూడదనే ఒలింపిక్‌ స్ఫూర్తిని విస్మరించింది. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌పై చైనా తరచూ పేచీకి దిగుతున్న సంగతి తెలిసిందే. అక్కడి భూభాగాలను తమవిగా చెబుతూ ఇటీవల మ్యాప్‌లు సైతం విడుదల చేసింది. కొన్ని ప్రాంతాలకు మాండరిన్‌ భాషలో పేర్లు కూడా పెట్టింది. ఇప్పుడు ఆసియా క్రీడల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న అరుణాచల్‌ ఆటగాళ్లకు వీసాలు నిరాకరించింది. దీనిని భారత్‌ తీవ్రంగా పరిగణించింది. ‘‘మా ప్రయోజనాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకునే హక్కు ఉంది. చైనా తీరు వివక్షాపూరితం’’ అని మండిపడుతూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ప్రకటన విడుదల చేశారు. సభ్య దేశం క్రీడాకారులను పథకం ప్రకారం లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోందని, ఇది ఆసియా క్రీడల స్ఫూర్తికి విఘాతమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతి, ప్రాంతం ఆధారంగా భారత పౌరుల పట్ల డ్రాగన్‌ చూపుతున్న వివక్షను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అరుణాచల్‌ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు.

కాగా, తాజా వివాదంతో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చైనా టూర్‌ రద్దు చేసుకున్నారు. భారత్‌ తరఫున క్రీడా వేడుకల ప్రారంభోత్సవానికి ఠాకూర్‌ హాజరుకావాల్సి ఉంది. కేంద్ర మంత్రి, అరుణాచల్‌ ఎంపీ అయిన కిరెన్‌ రిజిజు సైతం చైనా చర్యను తీవ్రంగా ఖండించారు. అరుణాచల్‌ వాసులకు వీసా నిరాకరించే హక్కు ఆ దేశానికి లేదన్నారు. ఇలాంటి చర్యలతో భవిష్యత్‌లోనూ ఆటగాళ్లకు చేటు జరుగుతుందుని.. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ మౌనం వీడాలని డిమాండ్‌ చేశారు.
ఆ ముగ్గురూ ఉషూ ఆటగాళ్లు
చైనా వీసా నిరాకరణ నేపథ్యంలో ఆ ముగ్గురు అరుణాచల్‌ క్రీడాకారులు ఎవరనే ఆసక్తి నెలకొంది. వీరు.. ఉషూ క్రీడాకారులు ఒనిలు టేగా, నేమన్‌ వాంగ్సు, మెపుంగ్‌ లామ్‌గూ అని తేలింది. మరోవైపు వీసాల నిరాకరణ విషయాన్ని ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ, ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆటగాళ్ల వెంట ఉన్న అధికారి తెలిపారు.

అయితే, వీసాల విషయంలో ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియా (ఓసీఏ) వాదన మరోలా ఉంది. చైనా వీసాలను నిరాకరించలేదని.. ప్రయాణ పత్రాలు కూడా జారీ చేసిన భారత అథ్లెట్లే వీసాలను అంగీకరించలేదని తెలిపింది. ఇది ఓసీఏ సమస్యగా తాను భావించడం లేదన్నారు. అర్హులైన అథ్లెట్లందరూ పాల్గొనేలా చైనా ఒప్పందాన్ని అంగీకరించిందని చెప్పారు.
భారత క్రీడాకారులకు వీసాల నిరాకరణ వ్యవహారం వివాదాస్పదం కావడంతో చైనా విదేశాంగ శాఖ స్పందించింది. అయితే, ఎప్పటిలాగే తన అడ్డగోలు వాదనను సమర్థించుకుంది. ‘‘అరుణాచల్‌ ప్రదేశ్‌గా చెబుతున్న ప్రాంతాన్ని మా ప్రభుత్వం గుర్తించలేదు. ‘జాంగ్నాన్‌’ మా ప్రాదేశిక పరిధిలోనిది’’ అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ పేర్కొన్నారు. అరుణాచల్‌ను దక్షిణ టికెట్‌గా పిలుచుకునే డ్రాగన్‌, ఏప్రిల్‌ ఆ రాష్ట్రంలోని 11 ప్రాంతాలకు తమ భాషలో పేర్లు పెట్టుకుంది. ఆ రాష్ట్రంలోని 90 వేల చదరపు కిలోమీటర్ల భూ భాగాన్ని తమదిగా చెబుతూ దానిని ‘జాంగ్నాన్‌’ అని వ్యవహరిస్తోంది. కాగా, ఆసియా క్రీడల ఆతిథ్య దేశంగా ‘‘చట్టబద్ధమైన పత్రాలున్న’’ అన్ని దేశాల క్రీడాకారులను సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఆమె తమ వక్ర బుద్ధిని చాటారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version