Namasthe Telangana Vs Andhra Jyothi: అది అంధజ్యోతే అనుకుందాం.. మరి నమస్తే ఇచ్చిన క్లారిటీ ఏంటి?

‘ధాన్యం టెండర్ల గోల్‌మాల్‌!’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై ‘నమస్తే తెలంగాణ’ సరైన వివరణ ఇవ్వలేక చతికిల పడింది. టెండర్‌పై అంధజ్యోతి బ్లండర్‌! అంటూ రాతలు రాసి అసలు విషయాన్ని మర్చిపోయింది.

Written By: Bhaskar, Updated On : September 23, 2023 2:56 pm

Namasthe Telangana Vs Andhra Jyothi

Follow us on

Namasthe Telangana Vs Andhra Jyothi: కెసిఆర్ కు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.. బావా బామ్మర్దుల మధ్య గతంలో ఇలాంటి పొరపచ్చాలు వచ్చినప్పటికీ అవి తర్వాత సమసిపోయాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్య విభేదాలు పొడ చూపడం ప్రారంభమయ్యాయి. అవి చినికి చినికి గాలి వాన లాగా మారి భారీ ఉత్పాతంగా మారాయి. ఫలితంగా అటు కెసిఆర్ కు, ఇటు రాధాకృష్ణకు పూడ్చలేనంత అగాధం ఏర్పడింది. కెసిఆర్ ప్రభుత్వ విధానాల పట్ల రాధాకృష్ణ రాసేస్తున్నాడు. నిప్పులు చిమ్మేలాగా వార్తలను ప్రజెంట్ చేస్తున్నాడు. వాస్తవానికి ఇలాంటి కథనాల ఆధారంగా ప్రతిపక్షాలు రెచ్చిపోవాలి. కానీ వాటిని అవి క్యాష్ చేసుకోలేకపోతున్నాయి. అయితే తాజాగా ధాన్యం కొనుగోలు లో టెండర్లకు సంబంధించి ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. సహజంగానే దీనికి మరుసటి రోజు నమస్తే తెలంగాణ కౌంటర్ ఇచ్చింది. ఇక్కడ ఆంధ్రజ్యోతిని అంధజ్యోతిగా పేర్కొంది. అది కెసిఆర్ కాంపౌండ్ నుంచి వచ్చే పత్రిక కాబట్టి అలానే రాస్తుంది అనుకుందాం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తకు కౌంటర్ గా ఉండాలి. అలాగే ఆంధ్రజ్యోతి రాసిన విషయాలు పూర్తి అబద్దమని నిరూపించే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ నమస్తే తెలంగాణ రాసిన రాతల్లో సరైన పస లేకపోవడంతో అవకతవకలు జరుగుతున్నాయని తనే ఒప్పుకుంది.

‘ధాన్యం టెండర్ల గోల్‌మాల్‌!’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై ‘నమస్తే తెలంగాణ’ సరైన వివరణ ఇవ్వలేక చతికిల పడింది. టెండర్‌పై అంధజ్యోతి బ్లండర్‌! అంటూ రాతలు రాసి అసలు విషయాన్ని మర్చిపోయింది. వాస్తవానికి యాసంగి ధాన్యం టెండర్లను ప్రభుత్వం అడ్డగోలుగా నిర్వహిస్తోంది. తొలుత రూ.1000 కోట్ల టర్నోవర్‌, రూ.100 కోట్ల నికరలాభం ఉండాలని నిబంధనల్లో పేర్కొంది. కానీ, ఇంత టర్నోవర్‌ అసాధ్యమని, నెట్‌వర్త్‌ కూడా తగ్గించాలని ప్రీ బిడ్డింగ్‌ సమావేశంలో టెండరుదారులు డిమాండ్‌ చేశారు. దీంతో ప్రభుత్వం నిబంధనలు మార్చి టర్నోవర్‌ను రూ.200 కోట్లకు, నికర లాభాన్ని రూ.20 కోట్లకు తగ్గించింది. అయినప్పటికీ 11 కంపెనీలే టెండర్లు దాఖలు చేశాయి. 25 లాట్లలో 10 లాట్లకు సింగిల్‌ బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి. పైపెచ్చు ధాన్యాన్ని తక్కువ ధరకు కొట్టేయాలనే కుట్రలు జరిగాయి. ఈ లోపాయికారీ ఒప్పందాలను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. కథనంలో ఎక్కడా ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసినట్లు పేర్కొనలేదు. టెండర్లు ఖరారు చేస్తే.. క్వింటాలుకు రూ.600 చొప్పున రూ.1,500 కోట్ల నష్టం జరుగుతుందని పేర్కొంది.

టెండర్ల నిర్వహణలో జాప్యాన్ని, మిల్లర్లు ఎమ్మెస్పీ చెల్లిస్తామని ప్రభుత్వానికి రాసిన లేఖనూ ప్రస్తావించింది. టెండర్ల ఫైలును రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేషన్‌ పంపించినట్లు పేర్కొంది. 21వ తేదీన పౌరసరఫరాల సంస్థ ఎండీ అనిల్‌ కుమార్‌ జారీచేసిన ప్రకటనలోనూ టెండర్‌ ప్రక్రియ వివరాలతో కూడిన ఫైలును రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు స్పష్టంగా వివరణ ఇచ్చారు. కానీ, ‘నమస్తే తెలంగాణ’ ఈ అంశాన్ని ప్రస్తావించకుండా తప్పుడు వాదనలు తెరపైకి తెచ్చింది. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేషీకి కూడా టెండర్ల ఫైలు చేరలేదని, మంత్రి స్థాయిలో చర్చలే జరగలేదని, సీఎం కార్యాలయానికే వెళ్లలేదని తప్పుడు సమాచారాన్ని ప్రచురించింది. కానీ వాస్తవంగా జరిగింది వేరు. ఇందులో అవకతవకలు జరుగుతున్నాయని పౌర సరఫరాల శాఖకు చెందిన కొందరు ఉద్యోగులు చెబుతున్న నేపథ్యంలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతున్న నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి ఈ వార్తను రాసింది. కానీ దీనికి కౌంటర్ సరిగా ఇవ్వలేక నమస్తే తెలంగాణ చతికిల పడింది. అంటే ఎక్కడో మాడు వాసన వస్తున్నట్టే కదా!