Chennai Vs Gujarat IPL 2023 Final: చెన్నై వర్సెస్ గుజరాత్.. ఎవరి బలం ఎంత..? గెలుపు ఎవరిది..?

చెన్నై జట్టుకు ప్రధానమైన బలం ఓపెనర్లే. ఈ జట్టు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వే ఓపెనింగ్ భాగస్వామ్యమే చెన్నైకి కలిసి వస్తోంది. చెన్నై జట్టు సాధించిన విజయాల్లో ఈ ఇద్దరు కీలకంగా నిలుస్తున్నారు.

Written By: BS, Updated On : May 27, 2023 8:17 pm

Chennai Vs Gujarat IPL 2023 Final

Follow us on

Chennai Vs Gujarat IPL 2023 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ముగింపుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ తో ఈ సీజన్ ముగియనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడిన చెన్నై, గుజరాత్ జట్లే ఫైనల్ మ్యాచ్ లో తలపడుతుండడం విశేషం. చెన్నై జట్టు గెలిచి ఐదోసారి కప్పు ఒడిసి పడుతుందా..? వరుసగా రెండోసారి టైటిల్ నెగ్గి గుజరాత్ తన సత్తా చాటుతుందా..? అన్నది రేపు జరగబోతున్న ఫైనల్ మ్యాచ్ లో తేలనుంది.

క్రికెట్ ప్రియులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ వేదికగా తుది సమరం జరగనుంది. ఫైనల్ మ్యాచ్ కు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు సిద్ధమయ్యాయి. అభిమానులు కూడా ఆసక్తిగా ఈ ఫైనల్ పోరు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్ల బలాబలాలను అంచనా వేస్తూ ఈ జట్టు గెలుస్తుంది అంటే.. కాదు ఆ జట్టు గెలుస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను పరిశీలిస్తే రెండు జట్లు బలంగానే ఉన్నాయి. కాబట్టి, తుది పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రెండు నెలలుగా అలరిస్తున్న ఐపీఎల్..

దాదాపు రెండు నెలల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులను అలరిస్తోంది. మరొక్క మ్యాచ్ తో ఈ సీజన్ ముగియనుంది. విజేతను తేల్చే మహా సమరం ఆదివారం రోజే జరగనుంది. ఫైనల్లో తలపడేందుకు దిగ్గజ జట్లు సిద్ధమయ్యాయి. ఐదోసారి కప్ గెలిచి ముంబై రికార్డ్ ను సమం చేయాలన్న కసితో చెన్నై జట్టు ఉంది. వరుసగా రెండోసారి కప్ గెలిచి సత్తా చాటాలని గుజరాత్ జట్టు ఉవ్విళ్ళూరుతోంది.

తనదైన మార్క్ వ్యూహాలతో సిద్ధమవుతున్న మహేందర్ సింగ్ ధోని..

ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. అయినప్పటికీ ధోని తనదైన వ్యూహాలతో జట్టును ఫైనల్ కు చేర్చాడు. గత సీజన్ లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన చెన్నై జట్టు ఈసారి అనూహ్యంగా పుంజుకుందంటే దానికి ధోనియే కారణం. ధోని తనదైన వ్యూహాలతో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. లీగ్ దశలో రెండవ స్థానంలో నిలిచిన ఆ జట్టు తొలి క్వాలిఫైయర్ లోనే డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ ను మట్టి కరిపించి సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. మరోవైపు రిటైర్మెంట్ పై వార్తలు వినిపిస్తున్న వేళ కప్పు గెలిచి ధోనీకి కానుక ఇవ్వాలని చెన్నై జట్టు ఆటగాళ్లతోపాటు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

చెన్నై జట్టుకు బలం ఓపెనర్లే..

చెన్నై జట్టుకు ప్రధానమైన బలం ఓపెనర్లే. ఈ జట్టు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వే ఓపెనింగ్ భాగస్వామ్యమే చెన్నైకి కలిసి వస్తోంది. చెన్నై జట్టు సాధించిన విజయాల్లో ఈ ఇద్దరు కీలకంగా నిలుస్తున్నారు. ఫైనల్లో గెలవాలంటే ఈ జంట మరోసారి తమ అద్భుత ప్రదర్శన కొనసాగించాల్సి ఉంటుంది. శివం దూబే, రవీంద్ర జడేజా, రహానేలతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఇక ఫినిషర్ గా ధోని సత్తా చాటేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అయితే, క్వాలిఫైయర్-1లో గుజరాత్ ను ఓడించినప్పటికీ ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. షమీ, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లను ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళికలతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇక బౌలర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ధోనీకి తెలిసినంతగా మరెవరికి తెలియదనే చెప్పాలి. వికెట్లు పడగొట్టేందుకు తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్తాడు ధోని. తుషార్ దేశ్ పాండే, పతిరన రాటు దేలారు. ఇక దీపక్ చాహార్, తీక్షన, జడేజా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. అయితే మూడు శతకాలతో వీర విహారం చేస్తున్న గుజరాత్ ఓపెనర్ గిల్ ను అడ్డుకుంటేనే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందన్న విషయంతో ధోనీకి తెలుసు. అతడిని ఏ మేరకు చెన్నై బౌలింగ్ దళం అడ్డుకుంటుందో చూడాలి.

గిల్ వర్సెస్ చెన్నై జట్టు..

ఇక అరంగేట్ర సీజన్ నుంచి ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో రాణిస్తూ దూసుకెళ్తున్న జట్టు గుజరాత్. క్వాలిఫైయర్ -1లో చెన్నైపై ఓడినప్పటికీ తిరిగి పుంజుకుని అదే జట్టుతో ఫైనల్ కు సిద్ధమైంది. సునాయాసంగా శతకాలు బాదేస్తూ, రికార్డులను చెరిపేస్తూ అద్భుత ఫామ్ లో కొనసాగుతున్న గిల్ మరోసారి రాణిస్తే.. ఫైనల్ లో ఆ జట్టుకు తిరుగు ఉండదు. ఇక సాహా కూడా అప్పుడప్పుడు తన వంతు సహకారం అందిస్తున్నాడు. ముంబై తో మ్యాచ్ లో సాయి సుదర్శన్ కూడా మంచి ప్రదర్శన చేశాడు. హార్దిక్ పాండ్యా, విజయశంకర్ కూడా జట్టు విజయాల్లో భాగమవుతున్నారు.

పర్పుల్ క్యాప్ రేసులో ముగ్గురు వేరే..

చెన్నైతో పోల్చితే గుజరాత్ బౌలింగ్ ఎటాక్ కాస్త మెరుగ్గానే ఉంది. ఎందుకంటే పర్పుల్ క్యాప్ రేసులో తొలి మూడు స్థానాల్లో ఉన్నది గుజరాత్ టైటాన్స్ బౌలర్లు. షమీ 28 వికెట్లు, రషీద్ ఖాన్ 27 వికెట్లు, మోహిత్ శర్మ 24 వికెట్లతో ఈ రేసులో కొనసాగుతున్నారు. ఇక ముంబై మ్యాచ్ లో మోహిత్ శర్మ 5 వికెట్ల ప్రదర్శనతో తన సత్తా ఏంటో చాటాడు. ఫైనల్ లో వీరు చెలరేగితే చెన్నైని కట్టడి చేయడం సులభం అవుతుంది. ఆరెంజ్ క్యాప్ ఎలాగో గిల్ వద్దే ఉంది.

ఈ రెండు జట్ల మ్యాచ్ లు పరిశీలిస్తే గుజరాత్ టైటానికే ఆధిపత్యం..

ఈ సీజన్ క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో తప్పితే ఐపీఎల్ లో ఎప్పటి వరకు ఈ రెండు జట్లు తలపడిన అన్ని మ్యాచ్ ల్లో గుజరాత్ దే విజయం. అయితే ప్లే ఆఫ్ లో తొలి మ్యాచ్ లో గుజరాత్ ను ఓడించడం ద్వారా చెన్నై జట్టుకు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అదే దూకుడు ఫైనల్ లో కొనసాగిస్తుందా..? లేదా..? గుజరాత్ ప్రతీకారం తీర్చుకుంటుందా..? అని ఈ రెండు జట్ల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఫైనల్ కోసం ఎదురుచూస్తున్నారు. అరంగేట్రం చేసిన తర్వాత వరసుగా రెండు సీజన్ లో ఫైనల్ కు చేరిన జట్టుగా గుజరాత్ ఇప్పటికే రికార్డు సృష్టించింది. అరంగేట్ర సీజన్ మాదిరిగానే గుజరాత్ ఈ సీజన్ లోనూ సత్తా చా. వరుస 10 విజయాలతో పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో నిలిచి క్వాలిఫైయర్ కు దూసుకు వచ్చిన తొలి జట్టుగా నిలిచింది.

స్వీట్ వార్నింగ్ నెరవేరేనా..?

తొలి క్వాలిఫైర్ ముందు ధోని సేనకు గుజరాత్ ఓపెనర్ గిల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. చెపాక్ వికెట్ పై చెన్నైను ఎదుర్కొనేందుకు మా వద్ద గొప్ప బౌలింగ్ ఉందని భావిస్తున్నట్టు గిల్ పేర్కొన్నాడు. చెన్నైలో చెన్నై పై తలపడడం కోసం మేము ఉత్సాహంగా ఉన్నామని, రెండోసారి మేము ఫైనల్ లో అడుగు పెడతామనే విశ్వాసం ఉంది అని గిల్ అన్నాడు. అయితే, తొలి క్వాలిఫైయర్ లో చెన్నై చేతిలో గుజరాత్ ఓడిపోయింది. ఇప్పుడు తన సొంత గడ్డ అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరుగుతుండడంతో గిల్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడో చూడాల్సి ఉంది. ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్ గుజరాత్ చెన్నై మధ్య జరిగింది ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ వీరి మధ్య జరుగుతుండడం విశేషం.