Ruturaj Gaikwad: క్రికెట్ లో రాణించడం అనేది ఆటగాడి సామర్ధ్యాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ, మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు వేసే టాస్ మాత్రం అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ, ఆ ఆటగాడికి అదృష్టం ఆమడ దూరంలో, దురదృష్టం చాలా దగ్గరగా ఉంది. ఏ కెప్టెన్ అయినా సరే సమకాలీన క్రికెట్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు టాస్ ఓడిపోయిన చరిత్ర ఇంతవరకూ లేదు. కానీ, ఈ ఆటగాడు మాత్రం ఏకంగా తొమ్మిది సార్లు టాస్ ఓడిపోయాడు. వినటానికి విచిత్రంగా ఉన్నప్పటికీ.. ఈ ఐపీఎల్ లో 9సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్ గా ఆ చెన్నై ఆటగాడు సరికొత్త ఘనత సృష్టించాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టుకు రుతు రాజ్ గైక్వాడ్ సారధ్యం వహిస్తున్నాడు. ధోని శిష్యుడిగా ఇతడు పేరు పొందాడు. ఇతడి ఆధ్వర్యంలో చెన్నై జట్టు 5 విజయాలు, 5 ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.. కీలకమైన ప్లే ఆఫ్ ముంగిట చెన్నై జట్టు బుధవారం రాత్రి సొంతమైదానంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు టాస్ గెలిచింది. మైదానాన్ని దృష్టిలో పెట్టుకొని బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. 20 ఓవర్లలో 162 రన్స్ చేసింది. మెరుగైన ఆరంభం లభించినప్పటికీ.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పోవడంతో చెన్నై జట్టు 162 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఆ లక్ష్యాన్ని 13 బంతులు మిగిలి ఉండగానే, కేవలం 3 వికెట్ల కోల్పోయి పంజాబ్ జట్టు సాధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా చెన్నై జట్టు టాస్ గెలిచి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. కానీ, పంజాబ్ జట్టు కెప్టెన్ టాస్ గెలవడంతో బౌలింగ్ వైపు మొగ్గు చూపాడు. వాస్తవానికి చెన్నై జట్టు కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ ఇప్పుడు మాత్రమే కాదు గత పది మ్యాచ్లలో 9 సార్లు అతడు టాస్ ఓడిపోయాడు. గత నెలలో కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రమే అతడు టాస్ గెలిచాడు. ఆ తర్వాత వరుసగా ఓడిపోయాడు. “అసలు నాకు అది ఒక పీడకల లాగా ఉంది. టాస్ వేయడాన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఇప్పటికి 9సార్లు టాస్ ఓడిపోయాను. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లోనూ టాస్ నెగ్గలేకపోయాను. వాస్తవానికి పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మేము ఇంకా 50 నుంచి 60 పరుగులు చేయాల్సి ఉండేది. చేజింగ్ లో వారికి మంచు సహకరించింది. అందువల్ల వారు గెలిచేందుకు ఆస్కారం ఏర్పడింది. టాస్ వేస్తున్నప్పుడు నేను ఒత్తిడికి గురవుతుంటాను. బహుశా అందువల్లే ఓడిపోతుంటాను కావచ్చు. దీనిని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నాను. అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోతోందని” చెన్నై కెప్టెన్ అన్నాడు. మరోవైపు రుతురాజ్ వరుసగా టాస్ నెగ్గకపోవడం వల్ల సోషల్ మీడియాలో నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.. ధోని శిష్యుడికి ఎంత కష్ట కాలం వచ్చిందని జాలి చూపిస్తున్నారు.