SRH Vs CSK 2024: సన్ రైజర్స్ లో మార్పులు.. సీఎస్ కే తో పోటీ పడే జట్టు ఇదే!

డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై.. ఈ సీజన్ లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. సమర్థవంతమైన ఆటగాళ్లతో అలరారుతోంది. అంతటి బలమైన చెన్నై జట్టును ఓడించాలంటే మెరుగైన ప్రణాళికలు ఉండాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 4, 2024 12:43 pm

SRH Vs CSK 2024

Follow us on

SRH Vs CSK 2024: ఈ ఐపిఎల్ సీజన్లో హైదరాబాద్ ప్రయాణం సముద్రపు కెరటం లాగా కిందా, మీదా పడుతూ సాగుతోంది. ఒక ఓటమి, మరొక విజయం, ఇంకొక ఓటమితో ఆ జట్టు పయనిస్తోంది. కోల్ కతా జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో విజయం చివరి అంచుల వరకు వచ్చిన హైదరాబాద్.. రెండవ మ్యాచ్లో ముంబై జట్టు పై వీరవిహారం చేసింది. 277 పరుగులు చేసి.. ముంబై జట్టును 31 పరుగుల తేడాతో ఓడించింది. అదే జోరును గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చూపించలేకపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాదులో చెన్నై జట్టుతో జరిగే మ్యాచ్ లో విజయం సాధించి సక్సెస్ ట్రాక్ పట్టాలని భావిస్తోంది..

డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై.. ఈ సీజన్ లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. సమర్థవంతమైన ఆటగాళ్లతో అలరారుతోంది. అంతటి బలమైన చెన్నై జట్టును ఓడించాలంటే మెరుగైన ప్రణాళికలు ఉండాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది. ఇందులో భాగంగానే జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు ఆడిన మూడు మ్యాచ్ లలో విఫలమైన మయాంక్ అగర్వాల్ పై వేటు వేయాలని భావిస్తోంది. అతడి స్థానంలో రాహుల్ త్రిపాఠి ని జట్టులోకి తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. రాహుల్ తుది జట్టులోకి వస్తే అప్పుడు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తారని సమాచారం. రాహుల్ త్రిపాఠి ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేస్తాడని తెలుస్తోంది. బౌలింగ్ లో నటరాజన్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా రంగంలోకి దించనుంది. గత మ్యాచ్ లో సరిగ్గా ఆడని జయదేవ్ ఉనద్కత్ పై వేటు వేసే అవకాశం కనిపిస్తున్నది. వీరిద్దరు తప్ప మిగతా జట్టులో పెద్దగా మార్పులు లేవని తెలుస్తోంది.

చెన్నై జట్టుతో జరిగే మ్యాచ్లో ప్యాట్ కమిన్స్, హెడ్, మార్క్రమ్, క్లాసెన్ వంటి ఓవర్సీస్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. వీరు రంగంలోకి దిగితే ఫిలిప్స్, జాన్సన్ వంటి వారికి అవకాశం లభించడం కష్టమే. ఒకవేళ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తే అభిషేక్ శర్మ తుది జట్టులో ఉంటాడు. బౌలింగ్ చేస్తే ఇంపాక్ట్ ప్లేయర్ గా రంగంలోకి దిగుతాడు.. అభిషేక్ శర్మ మాత్రమే కాకుండా నటరాజన్, ఉమ్రాన్, వాషింగ్టన్ సుందర్ ను పరిస్థితులకు అనుగుణంగా హైదరాబాద్ జట్టు ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఉపయోగించుకోనుంది. ఇక వీరు మాత్రమే కాకుండా చెన్నై జట్టుతో జరిగే మ్యాచ్ లో లోయర్ ఆర్డర్ లో అబ్దుల్ సమద్, షహబాజ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. వీరిద్దరూ ఇటీవల మ్యాచ్ లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇక స్పెషలిస్ట్ పేస్ బౌలర్ గా భువనేశ్వర్ కుమార్, స్పిన్నర్ గా మయాంక్ మార్కండే మైదానంలోకి దిగనున్నారు. అయితే ఈసారి కూడా తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డికి రిక్త హస్తమే ఎదురవ్వనుంది.

తుది జట్టు ఇలా

మయాంక్ అగర్వాల్/ రాహుల్ త్రిపాఠి, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, క్లాసెన్, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్, కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్/ నటరాజన్.