T20 World Cup 2024: ఆట ఉండగానే సరిపోదు.. క్రికెట్ లో జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే అదృష్టం కూడా తోడవ్వాలి. అలా అదృష్టం లేక కొంతమంది ఆటగాళ్లు మరీ ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పలు జట్లకు నాయకత్వం వహిస్తున్న కెప్టెన్లకు.. త్వరలో జరిగే టి20 వరల్డ్ కప్ లో అవకాశం దక్కలేదు.. జూన్ 2 నుంచి టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్ లో ఆ జట్ల కెప్టెన్లకు అవకాశం రాకపోవడం ఒకింత ఆశ్చర్యకరమే.
కేఎల్ రాహుల్
లక్నో జట్టుకు ఐపీఎల్ లో కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తున్నాడు. గత వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున ఆడాడు. మెరుగైన పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో జట్టును పర్వాలేదనే స్థాయిలో నడిపిస్తున్నాడు. ఇతడి ఆధ్వర్యంలో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో ఉంది. కేఎల్ రాహుల్ ను లక్నో జట్టు 17 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అతడు బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడి 406 పరుగులు చేశాడు. ఇతడి హైయెస్ట్ స్కోర్ 82.
శ్రేయస్ అయ్యర్
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గా అయ్యర్.. ఈ సీజన్లో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల జాబితాలో సెకండ్ ప్లేస్ లో ఉంది. అద్భుతమైన విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ ముందు నిలిచింది. గత వరల్డ్ కప్ లో ఆడిన అయ్యర్ కు .. ఈ టీ – 20 వరల్డ్ కప్ లో అవకాశం లభించలేదు. కోల్ కతా యాజమాన్యం ఇతడిని 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుత సీజన్లో అయ్యర్ తొమ్మిది మ్యాచ్లో ఆడి 251 రన్స్ చేశాడు. ఇతడి హైయెస్ట్ స్కోర్ 50.
రుతు రాజ్ గైక్వాడ్
చెన్నై జట్టుకు అనూహ్య పరిస్థితుల్లో ఇతడు కెప్టెన్ అయ్యాడు. అద్భుతమైన ఆట తీరుతో అలరిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తిరుగులేని బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇతడి ఆధ్వర్యంలో చెన్నై జట్టు ప్రస్తుతం పాయింట్లు పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో రుతు రాజ్ గైక్వాడ్ 10 మ్యాచ్లు ఆడి 509 పరుగులు చేశాడు. అతడి హైయెస్ట్ స్కోరు 108. ఆరెంజ్ క్యాప్ విభాగంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
వాస్తవానికి వీరికి టీమిండియా త్వరలో ఆడే టి20 వరల్డ్ కప్ లో చోటు లభిస్తుందని అందరూ భావించారు. అయ్యర్, రాహుల్ కంటే రుతు రాజ్ గైక్వాడ్ కు చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ, సెలక్టర్లు వీరివైపు దృష్టిసారించలేదు. ఫలితంగా ఐపీఎల్లో లో మెరుపులు మెరిపిస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. వీరిని ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నకు అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమాధానం చెప్పలేకపోయారు. అందరికీ అవకాశాలు లభిస్తాయి, కాకపోతే కొంత సమయం పడుతుంది అనే తీరుగా వ్యాఖ్యలు చేయడం విశేషం.