T20 Women’s World Cup IND VS AUS : : భారత బౌలర్లు దీప్తి, రేణుక చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శ్రేయాంక, పూజ, రాధా తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.. ఆస్ట్రేలియా జట్టులో గ్రేస్ హారీస్(40), తహలియా మెక్ గ్రాత్ (32), ఎల్లిస్ ఫెర్రీ(32) సత్తా చాటారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 151 రన్స్ చేసింది. వాస్తవానికి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభంలో ఏమంత గొప్పగా సాగలేదు. 2.4 ఓవర్ వద్ద ఓపెనర్ బెత్ మూనీ(2) రేణుక సింగ్ బౌలింగ్ లో రాధా యాదవ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. ఆ తర్వాత వచ్చిన జార్జియా వేర్ హోం (0) పరుగులకే రేణుక సింగ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయింది. దీంతో 17 పరుగులకే ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రేణుక సింగ్ బెత్ మూనీ, జార్జియా వేర్ హోం వికెట్లను వరుస బంతుల్లో తీయడం విశేషం. ఆ తర్వాత వచ్చిన తహలియా తో, మరో ఓపెనర్ గ్రేస్ హారీస్ నిదానంగా ఆడింది. మూడో వికెట్ కు ఏకంగా 67 పరుగులు జోడించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు స్కోరు 11.4ఓవర్ల వద్ద 79 పరుగులకు చేరుకుంది. 11.5 ఓవర్లో తహలియా రాధా యాదవ్ బౌలింగ్లో రీఛా ఘోష్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఎల్లిస్ ఫెర్రీ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంది.. నాలుగో వికెట్ కు హారీస్, ఫెర్రీ 13 పరుగులు జోడించారు. ఈ క్రమంలో గ్రేస్ హారీస్ దీప్తి శర్మ బౌలింగ్లో స్మృతి మందానకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు ఫెర్రీ కి సహకరించలేదు. పైగా వారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో.. ఫెర్రీ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఫెర్రీ కూడా 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్దకు చేరుకున్న తర్వాత దీప్తి శర్మ బౌలింగ్లో సజన కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. మొత్తంగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులను చేసింది.
ఇవేం ఎక్స్ ట్రాలు
బౌలింగ్, ఫీల్డింగ్ లో అదరగొట్టిన భారత బౌలర్లు.. మధ్య ఓవర్లలో మాత్రం చేతులెత్తేశారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లు ఎక్స్ ట్రాల రూపంలో దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు.. 14 పరుగులను ఇలా ఎక్స్ ట్రా ల రూపంలో ఇవ్వడంతో ఆస్ట్రేలియా స్కోర్ 151 పరుగులకు చేరుకుంది. ఎక్స్ ట్రాలలో భారత బౌలర్లు 7 వైడ్లు, ఆరు ఎల్బీల రూపంలో వేయడం విశేషం.. అయితే ప్రారంభంలో వరుస బంతుల్లో వికెట్లను పడగొట్టిన భారత బౌలర్లు.. ఆ తర్వాత అదే లయను కొనసాగించలేకపోయారు..స్లాగ్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ.. మధ్య ఓవర్లలో చేతులెత్తేశారు. 152 పరుగుల విజయ లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగింది. 20 ఓవర్ల పాటు పూర్తిస్థాయిలో ఆడినప్పటికీ ఒత్తిడిలో చిత్తయింది.. చివరి వరకు లక్ష్యాన్ని చేదించేలాగా కనపడినప్పటికీ..స్లాగ్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడం భారత జట్టుకు ప్రతిబంధకంగా మారింది.
నిరాశపరచిన స్మృతి
ఓపెనర్ స్మృతి మందాన ఆరు పరుగులకే అవుట్ కాగా.. మరో ఓపెనర్ షఫాలి వర్మ (20) ఉన్నంతలో మెరుపులు మెరుపుపించింది. 13 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన జెమీమా(16) ధాటిగా ఆడే క్రమంలో ఔట్ అయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(54), దీప్తి శర్మ (29) జట్టును ఆదుకున్నారు. అయితే కీలక సమయంలో దీప్తి శర్మ ఔట్ కావడంతో.. భారత జట్టు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఓ ఎండ్ లో హర్మన్ ధాటిగా ఆడుతున్నప్పటికీ.. మిగతా ప్లేయర్ల నుంచి సహకారం లభించలేకపోయింది.. దీంతో టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమిపాలు కావాల్సి వచ్చింది. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడిన టీమ్ ఇండియా 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా సెమీఫైనల్ వెళ్లాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. అయితే సోమవారం పాకిస్తాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్.. భారత్ సెమీ ఫైనల్ భవితవ్యాన్ని నిర్దేశించనుంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోతే నెట్ రన్ రేట్ ఆధారంగా.. గ్రూప్ – ఏ నుంచి సెమీ ఫైనల్ వెళ్లే రెండవ జట్టును నిర్ణయిస్తారు.