Canada Vs Ireland: టి20 ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదయింది. ప్రారంభ మ్యాచ్లో అమెరికా చేతిలో ఓడిపోయిన కెనడా.. శుక్రవారం ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఎట్టకేలకు విజయాన్ని సాధించింది. 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టి20 ప్రపంచ కప్ చరిత్రలో కెనడా జట్టుకు ఇది తొలి గెలుపు. ఈ విజయంతో కెనడా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకొంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేసింది. నికోలస్ కిర్టన్ 49 పరుగులు చేశాడు. వెంట్రుక వాసిలో అర్థ సెంచరీ కోల్పోయాడు. మొవ్వ శ్రేయస్ 36 బంతుల్లో 37 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మిగతా బ్యాటర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో క్రైగ్ యంగ్, మెక్ కార్తీ రెండేసి వికెట్ల చొప్పున తీశారు. మార్క్ అడైర్, గారత్ డెలానీ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 125 రన్స్ చేసింది. ఐర్లాండ్ జట్టులో జియోర్జ్ డాక్ రెల్ 22 బంతుల్లో 29*, మార్క్ అడైర్ 24 బంతుల్లో 34 పరుగులు చేసి రాణించారు.
కెనడా బౌలర్లలో డిలాన్ హేలైర్ 2/18, జెర్మీ గోర్డాన్ 2/16 రెండేసి వికెట్లు పడగొట్టారు.. జునైద్ సిద్ధికి, సాద్ బిన్ జఫర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్ లో ఐర్లాండ్ గెలుపుకు 17 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో గోర్డాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. కెనడా విజయం సాధించింది. ఈ ఓవర్ లో రెండవ బంతికే మార్క్ అడైర్ ను గోర్డాన్ క్యాచ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత నాలుగు బంతుల్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఐర్లాండ్ ను నియంత్రించాడు.. దీంతో కెనడా జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విజయంతో పాయింట్లు పట్టికలో కెనడా మూడో స్థానానికి చేరుకుంది.