Varma: పవన్ కోసం పిఠాపురం నియోజకవర్గాన్ని త్యాగం చేశారు టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ. త్యాగం చేయడమే కాదు పవన్ కోసం గట్టిగానే పని చేశారు. భారీ మెజారిటీతో గెలిపిస్తానని శపధం చేశారు. దానిని నిలుపుకున్నారు కూడా. అయితేపవన్ గెలిచిన తర్వాత జనసేన కార్యకర్తల్లో స్వరం మారింది. సోషల్ మీడియాలో వర్మకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా వర్మపై జనసైనికులు దాడికి ప్రయత్నించడం సంచలనంగా మారింది.
పవన్ విషయంలో వర్మ త్యాగం చేశారు. గెలిచే సీటును చంద్రబాబు పవన్ కి ఇస్తే వర్మ సమ్మతించారు. ఆయన గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. అదే సమయంలో పవన్ కోసం మెగా కుటుంబం, బుల్లితెర నటులు రంగంలోకి దిగారు. ప్రచారం చేశారు. అయితే మొన్నటి వరకు వర్మను ఆకాశానికి ఎత్తేసిన జనసైనికులు.. పవన్ కు భారీ విజయం దక్కేసరికి ఆ క్రెడిట్ అంతా మెగా కుటుంబానికి ఇచ్చారు. అంతటితో ఆగకుండా వర్మ వల్ల పవన్ గెలవలేదని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. దీంతో టిడిపి, జనసేన మధ్య గ్యాప్ ప్రారంభమైంది. సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడిచింది.ఈ నేపథ్యంలోనే వర్మపై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది.ఈ ఘటనకు సంబంధించి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ ఘటనకు దారి తీయడానికి కారణం మాత్రం వైసిపి కార్యకర్తలను టిడిపిలో చేర్చుకోవడమే. మొన్నటి వరకు కొంతమంది వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. అటువంటివారు ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపిలో చేరారు. వారిని వర్మ సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేర్చుకున్నారు. జనసేనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఎలా చేర్చుకుంటారంటూ జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి పిఠాపురం చేరుకున్న వర్మపై దాడికి ప్రయత్నించారు. కానీ వర్మ త్రుటిలో తప్పించుకున్నారు. కానీ వర్మ వాహనాలు ధ్వంసం అయ్యాయి. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేస్తే.. పరిస్థితి ఇంత దాకా తెచ్చారని జన సైనికులపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై పవన్ తో పాటు చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.