https://oktelugu.com/

KL Rahul : ఈ టీమిండియా క్రికెటర్ దృష్టిలో వరల్డ్ బెస్ట్ బౌలర్ బుమ్రా కాదట..బాబోయ్ అంత మాట అనేశాడేంటి?

బుమ్రా.. సమకాలీన క్రికెట్లో అద్భుతంగా బౌలింగ్ చేసే బౌలర్లలో ముందు వరుసలో ఉంటాడు. టీమిండియా కు ఎన్నో విజయాలను కట్టబెట్టాడు. అయితే అటువంటి ఈ బౌలర్ పై టీమిండియా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు బెస్ట్ బౌలర్ కాదని స్పష్టం చేశాడు. దీంతో ఆ క్రికెటర్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 10, 2024 10:09 pm
    KL Rahul Comments

    KL Rahul Comments

    Follow us on

    KL Rahul :  శ్రీలంక వన్డే సిరీస్ లో స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దులీప్ ట్రోఫీలో మాత్రం పర్వాలేదనే ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా – ఏ జట్టుకు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇండియా – బీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 37, 57 పరుగులు చేశాడు. అయితే రాహుల్ మినహా మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడంతో ఇండియా – ఏ జట్టు ఓటమి మూట కట్టుకోవాల్సి వచ్చింది. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఇండియా – బీ జట్టు 76 పరుగుల తేడాతో ఇండియా – ఏ జట్టును మట్టికరిపించింది. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ తో రాహుల్ ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి టీమిండియా సెలెక్టర్లు బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరిగే తొలి టెస్ట్ కు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ మొదలుకానుంది. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరుగుతుంది.. నిలకడగా ఆడుతున్న నేపథ్యంలో తుది జట్టులో రాహుల్ స్థానం సంపాదించుకునే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

    యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..

    బంగ్లాదేశ్ తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కు రాహుల్ ఎంపికైన నేపథ్యంలో.. దులీప్ ట్రోఫీలో భాగంగా జరిగే తదుపరి మ్యాచ్ లకు అతడు అందుబాటులో ఉండడు. నేపథ్యంలో ఒక యూట్యూబర్ కు రాహుల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఈ సందర్భంగా అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి.. ప్రపంచంలోనే టాప్ ఐదుగురు బ్యాటర్లను ఎంచుకోవాలని ఆ యూట్యూబర్ ప్రశ్నించగా.. విరాట్ కోహ్లీకి రాహుల్ తొలి ఓటు వేశాడు. మిగతా స్థానాలలో రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, బాబర్ అజాం, ట్రావిస్ హెడ్ ను ఎంచుకున్నాడు. ఇక అత్యుత్తమ బౌలర్ అనే ప్రశ్నకు.. సౌత్ ఆఫ్రికా దిగ్గజం స్టెయిన్ పేరు చెప్పాడు. రెండవ స్థానం ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అండర్సన్, మూడో స్థానం బుమ్రా, నాలుగు స్థానం ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్, ఐదో స్థానం పాకిస్తాన్ యువ బౌలర్ నసీం షా కు ఇచ్చాడు. బుమ్రా ను కాదని స్టెయిన్ పేరును రాహుల్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ ఆ యూట్యూబర్ రాహుల్ కు తన ఆప్షన్లు ఇచ్చాడు. ఆ పేర్లను ఎంచుకోవాలని సూచించాడు. ” బహుశా యూట్యూబర్ చెప్పిన జాబితాలో బుమ్రా పేరు ఉందో? లేదో? రాహుల్ కు తెలియదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం ఇంటర్వ్యూలో రాహుల్ అత్యంత నిదానంగా సమాధానాలు చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మైదానంలో రాహుల్, బుమ్రా సరదాగా ఉంటారు. వీరిద్దరి మధ్య చాలా సంవత్సరాలుగా స్నేహం ఉంది