Switzerland : స్విట్జర్లాండ్ పర్యాటక స్వర్గధామం మాత్రమే కాదు.. రాజకీయ నాయకుల నల్ల డబ్బును దాచుకునే వేదిక కూడా.. ప్రకృతి రమణీయత అద్భుతంగా ఉంటుంది కాబట్టి స్విట్జర్లాండ్ దేశానికి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. అందువల్లే ఈ చిన్న దేశం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా ఇది నిలిచింది. అమెరికా కేంద్రంగా పనిచేసే యూఎస్ న్యూస్ అండ్ పోర్టల్ రిపోర్ట్ వెల్లడించిన నివేదికలో ఈ విషయం బయటికి వచ్చింది. యూఎస్ న్యూస్ అండ్ పోర్టల్ రిపోర్టు ప్రకారం.. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో స్విట్జర్లాండ్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ దేశం వరసగా మూడో సంవత్సరం నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.. సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, వ్యాపారం, వారసత్వం, సాహసం, జీవన నాణ్యత, దానికి దోహదం చేసే పరిణామాలు.. వంటి విషయాలపై యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ పోర్టల్ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం ఈ ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 89 దేశాలున్నాయి. అయితే అన్ని విభాగాలలో మెరుగ్గా స్విట్జర్లాండ్ దేశం ఉంది. దీంతో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ దేశం ఏడు సార్లు బెస్ట్ కంట్రీ ఘనతను సాధించింది.
భారతదేశం స్థానం ఎంతంటే..
ఇక ఆసియాలోని ప్రముఖ దేశమైన జపాన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ దేశం వ్యాపారానికి, అత్యుత్తమమైన జీవన నైపుణ్యాలకు, ఘనమైన వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోందని యుఎస్ న్యూస్ వరల్డ్ పోర్టల్ సర్వేలో తేలింది.. జపాన్ తర్వాత అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మిగతా స్థానాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ జాబితాలో భారత్ 33వ స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది భారత్ 30వ స్థానంలో ఉంది. ఈసారి మూడు స్థానాలను కోల్పోవడం విశేషం.. ఇక జపాన్ తర్వాత ఆసియా నుంచి సింగపూర్, చైనా, దక్షిణ కొరియా మాత్రమే టాప్ 25 లో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే కొన్ని దేశాలలో వ్యాపార పరంగా ప్రతి బంధకాలు ఉన్నప్పటికీ.. మిగతా విషయాలలో అవి మెరుగ్గా ఉన్నాయని యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ పోర్టల్ సంస్థ తన నివేదికలో ప్రకటించింది..” ప్రజలు మెరుగైన జీవనాన్ని కోరుకుంటున్నారు. అద్భుతమైన సౌకర్యాలను ప్రభుత్వాల నుంచి ఆశిస్తున్నారు. అవినీతి ఉండకూడదు. అక్రమాలు రాజ్యమేలకూడదు. జీవనం బాగుండాలి. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. కాలుష్యం ఆనవాళ్లు కనిపించకూడదు. పౌర పట్టిక ప్రకారం ప్రభుత్వ పనులు జరగాలి. స్వేచ్ఛాయుత జీవనానికి ఇబ్బంది కలగకూడదు.. విశాల దృక్పథానికి ఆటంకం కలగకూడదని ప్రజలు కోరుకుంటున్నారని” యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ పోర్టల్ తన నివేదికలో వెల్లడించింది.. అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా స్విట్జర్లాండ్ పేరు ప్రకటించగానే సోషల్ మీడియాలో.. ఆ దేశానికి సంబంధించి సెర్చింగ్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో స్విట్జర్లాండ్ మోస్ట్ సెర్చింగ్ టాపిక్ గా నిలిచింది.