ఐపీఎల్ అంటేనే క్రికెట్ ప్రేమికులకు పెద్ద పండుగ లాంటిది. బంతి బంతికి బౌండరీ.. చుక్కలను తాకే సిక్సర్లు.. ఓవర్ ఓవర్‌కీ ఉత్కంఠ.. ఏ టీం విజయం సాధిస్తుందో కూడా తెలియదు. గత రెండు ఆదివారాలు ఉత్కంఠ మ్యాచ్‌లతో ఐపీఎల్ టోర్నీ తారస్థాయికి చేరింది.ఈ ఆదివారం కూడా దాదాపుగా అలానే జరిగింది. కానీ.. చెన్నై టీం ఇందులో స్పెషల్‌గా నిలిచింది. అసలు ఇది చెన్నై టీమేనా అన్నంతగా తేలిపోతున్న జట్టు ఒక్క సారిగా తన ఆటను ప్రదర్శించింది. తాము తల్చుకుంటే ఎలాంటి లక్ష్యాన్నైనా ఉఫ్‌మని ఊదేస్తామని నిరూపించింది. పంజాబ్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని వికెట్ కూడా నష్టపోకుండా సాధించింది.
అబుదాబిలో పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ రాణించాడు. రాహుల్ ప్రతీ మ్యాచ్‌లోనూ వ్యక్తిగతంగా తనదైన ప్రతిభ చాటుతున్నాడు. ఈ ఆదివారం జరిగిన మ్యాచ్‌లోనూ పంజాబ్ జట్టు 178 పరుగులు చేసింది. చెన్నై ముందు 179 పరుగుల లక్ష్యం పెట్టింది. ఆ లక్ష్యం కూడా ఏం చిన్నది కాదు. అదీ బ్యాటింగ్‌లో తరచూ విఫలం అవుతున్న చెన్నైకి అంటే మరీ ఎక్కువే. ధోనీ ఫాం.. టీం వైఫల్యాన్ని చూసి ఆ ఛేజింగ్ చేయడం కష్టమే అనుకున్నారంతా.
కానీ.. చెన్నై బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే పంజాబ్ ఇచ్చిన లక్ష్యం మరీ అంత చిన్నదా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ మెరుపు షాట్లతో ఆడారు. ఎక్కడా తడబడకుండా బౌండరీలతో హోరెత్తించారు. బౌలర్ ఎవరున్నా.. ఒకటే ట్రీట్‌మెంట్. మొదట్లోనే వారు చూపిన జోరు చూసి చెన్నై విజయం ఖాయమని అంచనాకు వచ్చేశారు. అయితే ఐపీఎల్ కాబట్టి.. ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమోనని చూశారు. కానీ.. అద్భుతాలు చెన్నై వైపే జరిగాయి. ఒక్క వికెట్ కూడా పడలేదు.
కేవలం 17.4 ఓవర్లు అంటే 106 బంతుల్లోనే 181 పరుగులు సాధించి విజయం సాధించారు. అంటే.. ప్రతీ బౌలర్ సగటున ఓవర్‌కు పది పరుగులు ఇచ్చుకున్నాడు. అయితే.. ఈ పోరులో వాట్సన్, డూప్లెసిస్ ఎక్కడా కూడా వ్యక్తిగత రికార్డుల కోసం చూసుకోలేదు. ఒకరికొకరు ఛాన్స్ ఇచ్చుకుంటూనే సమానంగా స్కోర్ చేస్తూ వచ్చారు. వాట్సన్ 83, డుప్లెసిస్ 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇతరులకు బ్యాటింగ్‌కు దిగే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ విజయంతో చెన్నై టీం మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లయింది. పాయింట్ల పట్టిన అట్టడుగున ఉన్న స్థానం నుంచి ఆరో స్థానానికి చేరింది. ఇదే ఫామ్ కొనసాగిస్తే మరోమారు ఐపీఎల్‌లో చెన్నై ఫెవరేట్ టీమ్‌గా అయ్యే అవకాశాలూ లేకపోలేదు.