లాక్డౌన్ అనంతరం టాలీవుడ్లో సినిమాల సందడి మొదలైంది. కరోనా సమయంలోనే డార్లింగ్ ప్రభాస్ తొలుత షూటింగును ప్రారంభించాడు. ఆ వెంటనే కింగ్ నాగార్జున సైతం తన సినిమా షూటింగు ప్రారంభించాడు. ఇటీవల ప్రభాస్ సినిమా షూటింగు హైదరాబాద్లో పూర్తి చేసుకొని విదేశాల్లో షూటింగు కోసం బయలుదేరి వెళ్లాడు. డార్లింగ్ ను అనుసరిస్తూ మన్మథుడు సైతం ఫారెన్ టూర్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.
‘రాధే శ్యామ్’ మూవీ కోసం ప్రభాస్ యూరప్ కు వెళ్లాడు. కరోనా సమయంలో అవుట్ డోర్ షూటింగ్ వెళ్లిన తొలి టాలీవుడ్ హీరోగా ప్రభాస్ పేరు విన్పిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పై టాలీవుడ్లోని దర్శక, నిర్మాతలు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. ఈ షూటింగులో తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకున్నారు. వీరి షూటింగు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జరిగితే మిగతా నిర్మాతలు కూడా ఫారెన్ వెళ్లాలని భావిస్తున్నారు.
కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సినిమాలో కీలకమైన చివరి షెడ్యూల్ ను చిత్రయూనిట్ థాయిలాండ్లో ప్లాన్ చేసింది. ఈనెలఖారులో అక్కడ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ పూర్తవుందట. ఈమేరకు దర్శక, నిర్మాతలు షూటింగ్ కోసం ఇప్పటికే సన్నహాలు చేసినట్లు తెలుస్తోంది.
‘వైల్డ్ డాగ్’లో నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలాలిస్టుగా కన్పించబోతున్నాడు. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక ఎన్ కౌంటర్ సహా, పలు సంఘటన ఆధారంగా ఈ మూవీని దర్శకుడు సోలమన్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే టాక్ విన్పించగా చిత్రయూనిట్ ఖండించింది. ‘వైల్డ్ డాగ్’ థియేటర్లలోనే వస్తుందని ప్రకటించింది. ఈ మూవీపై నాగార్జున అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.