టీ 20 వరల్డ్‌కప్‌ జట్టులో భారీ మార్పులు..?

టీ20కి ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. ఈ పొట్టి క్రికెట్‌ టోర్నీ ప్రారంభం అయిందంటే చాలు క్రికెట్‌ ప్రేమికులంతా టీవీల ముందు వాలిపోతుంటారు. అయితే.. ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగబోతోంది. ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చేది కూడా భారతే. శుక్రవారం ప్రారంభం కానున్న ఇంగ్లండ్‌ సిరీస్‌తోనే టీమిండియా సన్నాహం ప్రారంభం కాబోతోంది. టెస్టుల్లో ఓడి, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బదులు తీర్చుకోవడానికి బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది ఇంగ్లండ్‌ జట్టు. ఈ […]

Written By: Srinivas, Updated On : March 11, 2021 3:49 pm
Follow us on


టీ20కి ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. ఈ పొట్టి క్రికెట్‌ టోర్నీ ప్రారంభం అయిందంటే చాలు క్రికెట్‌ ప్రేమికులంతా టీవీల ముందు వాలిపోతుంటారు. అయితే.. ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగబోతోంది. ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చేది కూడా భారతే. శుక్రవారం ప్రారంభం కానున్న ఇంగ్లండ్‌ సిరీస్‌తోనే టీమిండియా సన్నాహం ప్రారంభం కాబోతోంది. టెస్టుల్లో ఓడి, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బదులు తీర్చుకోవడానికి బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది ఇంగ్లండ్‌ జట్టు. ఈ సిరీస్‌లో భారత్‌ వైపు నుంచి ఆసక్తి రేకిస్తున్న అంశాలు కూడా కొన్ని ఉన్నాయి.

Also Read: నట్టూ మిస్‌.. ఆ ఇద్దరు కూడా డౌట్‌

ఈ సిరీస్‌ ద్వారా కొంత మంది కొత్త ప్లేయర్స్‌ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్న సూర్యకుమార్‌‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌.. రాహుల్‌ తెవాతియా మైదానంలోకి దిగి సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటిదాకా ఒక్క టీ20నే ఆడిన స్పిన్నర్‌‌ రాహుల్‌ చాహర్‌‌ సైతం అవకాశం కోసం చూస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్‌తోపాటు దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న సూర్యకు ఎట్టకేలకు అవకాశం దక్కింది. కిషన్‌, రాహుల్‌ గత ఐపీఎల్‌ ప్రదర్శనతో వెలుగులోకి వచ్చారు. తుది జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈ నలుగురిలో ఎవరెవరికి అవకాశం దక్కుతుంది.

హార్దిక్‌ పాండ్యను బౌలర్‌‌ పాత్రలో చూడడం అరుదైపోయింది. 2019లో వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాక అతను చాలా కాలం ఆటకు దరంగా ఉన్నాడు. పునరాగమనం తర్వాత ఆడిన మ్యాచ్‌లు తక్కువ. నిరుడు ఐపీఎల్‌లో అతను బౌలింగే చేయలేదు. ఆస్ట్రేలియాతో ఒక్క వన్డేలో మాత్రమే 4 ఓవర్లు వేశాడు. ఆపరేషన్‌ తర్వాత పాండ్య శరీరంపై ఒత్తిడి పడొద్దన్న ఉద్దేశంతో ఐపీఎల్‌లో, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతడితో బౌలింగ్‌ చేయించట్లేదు. కానీ.. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో పాండ్య నుంచి జట్టు ఆల్‌రౌండ్‌ మెరుపులు ఆశిస్తోంది. మరి ఇంగ్లండ్‌తో టీ20ల్లో హార్దిక్‌ను బౌలింగ్‌ చూస్తామా లేదో చూడాలి.

మరోవైపు.. ఈ సిరీస్‌లో రోహిత్‌కు జోడీగా ఎవరిని ఓపెనర్‌‌గా పంపుతారనేది ఆసక్తికరంగా మారింది. చాలా ఏళ్లు రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ధావన్‌.. ఏడాది కిందట ఫామ్‌ కోల్పోయి తన స్థానాన్నే ప్రశ్నార్థకం చేసుకున్నాడు. గాయాలూ వెనక్కి లాగాయి. ఈ సమయంలో రాహుల్‌ నిలకడగా ఆడి ఓపెనింగ్‌లో స్థిరపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డేలు, టీ20లకు రోహిత్‌ అందుబాటులో లేకపోవడంతో ధావన్‌కు అవకాశం దక్కింది. ఇప్పుడు రోహిత్‌ ఆడుతున్నాడు. రాహుల్‌ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. రాహుల్‌కు వేరే స్థానాల్లోనూ ఆడిన అనుభవం ఉంది. కానీ.. ధావన్‌ ఎప్పుడూ ఓపెనరే. ఈ నేపథ్యంలో అతన్ని తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ధావన్‌నే ఓపెనర్‌‌గా పంపి రాహుల్‌ను దిగువన పంపడానికి కోహ్లి మొగ్గు చూపుతాడా అనేది కూడా చూడాలి.

Also Read: వీడియో వైరల్: పాండ్యా, కేఎల్ రాహుల్ మెరుపులు.. కోహ్లీ, శాస్త్రి షాక్

రెండేళ్లుగా గాయాలతో చాలా కాలం దూరంగా ఉంటున్నాడు పేసర్‌‌ భువనేశ్వర్‌‌. ఐపీఎల్‌లో మెరిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తాడనుకుంటే.. టోర్నీ మధ్యలో గాయంతో వైదొలిగాడు. ఎట్టకేలకు ఫిట్‌నెస్‌ సాధించి మళ్లీ జట్టులోకి వచ్చాడు. తుది జట్టులో చోటు కోసం చాలా మంది పేసర్లు ఎదురుచూస్తున్న నేపథ్యంలో భువి సత్తా చాటాల్సిందే. బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో పేస్‌ దళానికి సారథ్యం వహించాల్సింది కూడా అతనే. డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడంలో ఎంతో నైపుణ్యత కలిగిన అతను..భీకర బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ఇంగ్లండ్‌పై సత్తా చాటి జట్టులో తన ప్రత్యేకతను చాటుకుంటాడో చూడాలి.

మరో కీలక ఆటగాడు పంత్‌. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు పంత్‌ వేరు.. ఇప్పుడు వేరు. అక్కడ టెస్టు సిరీస్‌లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. తాజాగా.. ఇంగ్లండ్‌పైనా అదరగొట్టాడు. దీంతో పంత్‌కు వన్డేలు, టీ20ల్లోనూ తుది జట్టులో చోటివ్వక తప్పని పరిస్థితి. నిజానికి భారత్‌ చివరగా ఆడిన వన్డే, టీ20ల్లో పంత్‌కు అయితే చోటు లేదు. అతడితోపాటు శాంసన్‌ రాణించకపోవడంతో టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని రాహుల్‌ను పరిమిత ఓటర్ల క్రికెట్‌లో వికెట్‌ కీపర్‌‌ బ్యాట్స్‌మన్‌గా ఆడించారు. అయితే.. ఇప్పుడు పంత్‌ను స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా అయినా తీసుకోవాలనే డిమాండ్‌ మొదలైంది. మరి పంత్‌ను వికెట్‌ కీపర్‌‌గానే ఆడిస్తారా.. లేక రాహుల్‌కే గ్లోవ్స్‌ అప్పగించి స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌గా ఆడిస్తారా ఆసక్తిగా మారింది.